Sangareddy district News: సంగారెడ్డి జిల్లాలో సైబర్ నేరస్థుల వలలో చిక్కుకొని 80 లక్షలు పోగొట్టుకున్నారు ముగ్గురు బాధితులు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలోని అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పార్ట్ టైం జాబ్ పేరిట ఫోన్ కు వచ్చిన మెసేజ్, లింకులకు స్పందించి ఓ ప్రభుత్వ ఉద్యోగి రూ. 59 లక్షలు పోగొట్టుకున్న ఘటన అమీన్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
వివరాల్లోకి వెళ్తే…. అమీన్ పూర్ పరిధిలోని నందన్ మెడోస్ కు చెందిన ఒక ప్రభుత్వ ఉద్యోగికి, పార్ట్ టైం జాబ్ అంటూ సైబర్ నేరస్థుల నుండి మెసేజ్ వచ్చింది. అతడు దానికి స్పందించి తన వివరాలను నమోదు చేశాడు. ఆ నిర్వాహకులు అతడికి ఒక ఐడి క్రియేట్ చేసి ఇచ్చి,డబ్బులు పెట్టి వారు ఇచ్చిన టాస్క్ లు కంప్లీట్ చేస్తే కమిషన్ ఇస్తామని నమ్మబలికారు. దానికి ఆ ప్రభుత్వ ఉద్యోగి ముందుగా రూ. మూడు వేలు చెల్లించి వారు ఇచ్చిన టాస్క్ లను కంప్లీట్ చేశాడు. దీంతో పెట్టిన నగదుకు వాలెట్ లో ఇంత కమిషన్ వచ్చిందని చూపించారు. ఈ క్రమంలో ఆ ఉద్యోగి మొత్తం రూ. 59 లక్షలు చెల్లించాడు. కాగా సైబర్ నేరగాళ్లు ఆ ఉద్యోగికి ఇచ్చిన వాలెట్ లో రూ.79 లక్షలు నగదు ఉన్నట్టు చూపించారు. ఆ ఉద్యోగి చివరికి తాను పెట్టిన నగదుతో పాటు కమిషన్ కూడా ఇవ్వాలని అడగడంతో వారు స్పందించలేదు. సైబర్ నేరస్తులు స్పందించకపోవడంతో మోసపోయానని గ్రహించిన ఉద్యోగి గురువారం సైబర్ పోలీసులకు పిర్యాదు చేశాడు. దీంతో అమీన్ పూర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
బీరంగూడ సాయి నగర్ కాలనీ కి చెందిన ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగికి, బీరంగూడ మల్లారెడ్డి కాలనీ కి చెందిన ఒక ప్రైవేట్ ఉద్యోగికి కూడా పార్ట్ టైం జాబ్ పేరిట మెసేజ్ వచ్చింది. వారు దానికి స్పందించి వారి వివరాలు నమోదు చేసారు. సైబర్ నేరగాళ్లు వారికీ వాలెట్ ఐడిని క్రియేట్ చేసి టాస్క్ లు పూర్తి చేస్తే కమిషన్ ఇస్తామని నమ్మబలికారు. ఈ క్రమంలో సాఫ్ట్ వేర్ ఉద్యోగి రెండు లక్షలు, ప్రైవేట్ ఉద్యోగి 18 లక్షలు పలు ధపాలుగా పంపించారు. బాధితులు పెట్టిన నగదుతో పాటు కమిషన్ కుడా ఇవ్వాలని అడగడంతో వారు స్పందించలేదు. దీంతో బాధితులు మోసపోయామని గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. గురువారం అమీన్ పూర్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
సిద్ధిపేట జిల్లా మర్కుక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన జరిగింది. గుర్తుతెలియని సైబర్ నేరగాడు పేస్ బుక్ లో ఫోర్ వీలర్ అమ్మకానికి ఉన్నదని తన మొబైల్ కు కాంటాక్ట్ నెంబర్ పంపించాడు. అది నమ్మిన సదరు బాధితుడు అతని వివరాలు అడగగా ఆర్మీ డ్రెస్ లో ఉన్న ఫోటో మరియు ఆర్ సి తదితర వాహనం యొక్క పేపర్లు పంపించాడు. అది నమ్మిన బాధితుడు సైబర్ నేరగాడు చెప్పిన విధంగా ట్రాన్స్పోర్ట్ చార్జి, జీఎస్టీ తదితర ఖర్చులు ఉంటాయని డబ్బులు పంపిస్తే వాహనం డెలివరీ చేస్తానని చెప్పాడు. దీంతో అతడు సైబర్ నేరగాడు పంపించిన ఫోన్ నెంబర్ కు గూగుల్ పే, ఫోన్ పే ద్వారా రూ. 97,649 పంపించాడు. తదుపరి ఆ ఫోన్ నెంబర్ కు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది. అనుమానం వచ్చిన బాధితుడు జాతీయ సైబర్ సెల్ నెంబర్ 1930 ఫోన్ చేసి వివరాలు తెలిపి ఫిర్యాదు చేయడం జరిగిందని పోలీసులు తెలిపారు.