Unclaimed deposits: క్లెయిమ్ చేయని డిపాజిట్లు, పెట్టుబడులను క్లెయిమ్ చేసుకోవడం ఎలా?-how to claim unclaimed deposits and investments a step by step guide ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Unclaimed Deposits: క్లెయిమ్ చేయని డిపాజిట్లు, పెట్టుబడులను క్లెయిమ్ చేసుకోవడం ఎలా?

Unclaimed deposits: క్లెయిమ్ చేయని డిపాజిట్లు, పెట్టుబడులను క్లెయిమ్ చేసుకోవడం ఎలా?

HT Telugu Desk HT Telugu
Jan 14, 2024 01:33 PM IST

How to claim unclaimed deposits: వివిధ కారణాలతో బ్యాంక్ ఖాతాల్లో డిపాజిట్లను క్లెయిమ్ చేసుకోకుండా ఉంటారు. షేర్లలో పెట్టిన పెట్టుబడులను కూడా అలాగే ఉంచేస్తారు. ఆ డబ్బును క్లెయిమ్ చేసుకోవడం ఎలాగో ఇక్కడ చూడండి..

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (iStock)

How to claim unclaimed deposits: సంవత్సరాలుగా క్లెయిమ్ చేసుకోని బ్యాంక్ డిపాజిట్ల కోసం ఉద్గం పోర్టల్ (UDGAM portal) ను, షేర్లు / డివిడెండ్ల కోసం ఐఈపీఎఫ్ (IEPF portal) వంటి పోర్టల్ ఉపయోగించుకోవచ్చు. క్లెయిమ్ చేసుకోవడానికి పోర్ట్ ఫోలియో/పాలసీ నంబర్లు, కేవైసీ అవసరం. కెవైసి ఆథెంటికేషన్ చాలా కీలకం.

42 వేల కోట్లు..

2023 మార్చి చివరి నాటికి మొత్తం రూ .42,272 కోట్లు క్లెయిమ్ చేయని డిపాజిట్లుగా బ్యాంకుల వద్ద ఉన్నాయని, సుమారు రూ .2,637.94 కోట్ల క్లెయిమ్ చేయని డివిడెండ్లు మరియు యూనిట్లు మ్యూచువల్ ఫండ్ (MF) సంస్థల వద్ద ఉన్నాయి. ఏడేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం క్లెయిమ్ చేయని షేర్లు, డివిడెండ్లు, డిబెంచర్లు మొదలైనవి ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ (IEPF))కు బదిలీ అవుతాయి. ఈ ఫండ్ ను 1956 కంపెనీల చట్టం కింద ఏర్పాటు చేశారు. ఎలాంటి లావాదేవీలు లేని బ్యాంకు ఖాతాల్లో పదేళ్లకు పైగా క్లెయిమ్ చేయకుండా మిగిలిపోయిన డిపాజిట్లు, వడ్డీలను ఆర్బీఐ డిపాజిటర్ ఎడ్యుకేషన్ అవేర్నెస్ ఫండ్ (DEA Fund)కు బదిలీ చేస్తారు.

ఎందుకు క్లెయిమ్ చేయరు?

క్లెయిమ్ చేయని డిపాజిట్లు / పెట్టుబడులు భారీగా ఉండడానికి వెనుక చాలా కారణాలు ఉన్నాయి. బ్యాంకు డిపాజిట్ల విషయానికొస్తే, డిపాజిటర్లు పొదుపు / కరెంట్ ఖాతాలను మూసివేయకపోవడం లేదా మెచ్యూరిటీ ఫిక్స్డ్ డిపాజిట్లకు రిడంప్షన్ క్లెయిమ్స్ చేయకపోవడమే దీనికి ప్రధాన కారణం. ఒకవేళ డిపాజిటర్ మరణించిన తరువాత, నామినీలు, చట్టబద్ధమైన వారసులు ఆ డిపాజిట్లను క్లెయిమ్ చేసుకునేందుకు ముందుకు రాకపోవడం మరో ప్రధాన కారణంగా కనిపిస్తుంది. భారతీయ కుటుంబాలు తమ ఆర్థిక వివరాలను కుటుంబ సభ్యులతో పంచుకోకపోవడం కూడా ఇందుకు మూల కారణాల్లో ఒకటి. అలాగే, సంబంధిత పెట్టుబడి సంస్థలకు సమాచారం ఇవ్వకుండా ప్రజలు తమ చిరునామాలను మార్చుకోవడం కూడా ఒక కారణం. పెళ్లి తర్వాత ఇంటి పేరు మారడం, వరదలు, అగ్నిప్రమాదాల వంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో పెట్టుబడి పత్రాలను కోల్పోవడం' వంటి కారణాలు కూడా ఉన్నాయి.

అన్ క్లెయిమ్డ్ డిపాజిట్లను గుర్తించడం ఎలా?

క్లెయిమ్ చేయని డిపాజిట్లు, పెట్టుబడులను గుర్తించడానికి వివిధ మార్గాలు ఉన్నాయి. ఆర్బీఐ ప్రారంభించిన ఉద్గం (UDGAM portal) పోర్టల్ కు వెళ్లి అవసరమైన వివరాలను నింపడం ద్వారా బ్యాంకుల్లో క్లెయిమ్ కాని డిపాజిట్లను గుర్తించవచ్చు. అదేవిధంగా ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ అథారిటీ (IEPF) వెబ్ సైట్ కు వెళ్లి షేర్ హోల్డర్ సంబంధిత వివరాలను పొందుపరచడం ద్వారా క్లెయిమ్ చేయని షేర్లు, డివిడెండ్లను సెర్చ్ చేయవచ్చు. అయితే క్లెయిమ్ చేయని బీమా పాలసీ ఆదాయాన్ని యాక్సెస్ చేసుకునేందుకు వీలు కల్పించే సెంట్రలైజ్డ్ పోర్టల్ లేదా డేటాబేస్ లేదు. బీమా కంపెనీల వ్యక్తిగత వెబ్ సైట్లను పరిశీలించి క్లెయిమ్ చేయని మెచ్యూరిటీ ఆదాయాన్ని చెక్ చేసుకోవాల్సి ఉంటుంది.

అవసరమైన డాక్యుమెంట్లు

క్లెయిమ్ చేయని డిపాజిట్లు/ పెట్టుబడుల వివరాలను వెతకడానికి ఇన్వెస్టర్లు లేదా వారి చట్టబద్ధమైన వారసుల వద్ద సంబంధిత పోర్ట్ ఫోలియో నంబర్, పాలసీ నెంబరు ఉండాలి. యిమ్ చేయని ఆస్తులను క్లెయిమ్ చేయడానికి పేరు, పాన్ కార్డు, క్లెయిమ్ చేయని ఆస్తి యొక్క సంబంధిత డాక్యుమెంట్ అవసరం ఉంటుంది. చట్టబద్ధమైన వారసులు తమ కేవైసీ డాక్యుమెంట్లు, చనిపోయిన ఇన్వెస్టర్ మరణ ధృవీకరణ పత్రం, లీగల్ వారసుడి సర్టిఫికేట్, ఫ్యామిలీ ట్రీ, సర్వైవింగ్ మెంబర్ సర్టిఫికేట్ వంటి మృతుడితో రిలేషన్ షిప్ ఉన్న ప్రూఫ్లను సమర్పించాల్సి ఉంటుంది.

ముందు ఇంట్లో వెతకండి..

తమ పెట్టుబడుల వివరాలు తెలియజేయకుండా మరణించిన వారి పిల్లలు, లేదా చట్టబద్ధ వారసులు.. ఆ పెట్టుబడుల వివరాలు తెలుసుకోవడానికి ముందుగా, ఇంట్లో ఫైళ్లు, రికార్డులు, డాక్యుమెంట్స్ ను తనిఖీ చేయాలి. భారతీయులుగా ముఖ్యమైన డాక్యుమెంట్లను ఇంట్లోనే భద్రపరుచుకునే అలవాటు ఉంటుంది. చనిపోయిన వారు గతంలో ఫైనాన్షియల్ అడ్వైజర్లు లేదా చార్టర్డ్ అకౌంటెంట్ల సహాయం తీసుకుని ఉంటే, ఆ ఫైనాన్షియల్ అడ్వైజర్లు లేదా చార్టర్డ్ అకౌంటెంట్ల వద్ద పెట్టుబడుల సమాచారం ఉండే అవకాశం ఉంది. అలాగే, ప్రీమియం చెల్లింపులు లేదా పెట్టుబడులకు సంబంధించిన ఆన్లైన్ లావాదేవీలను, బ్యాంకు స్టేట్మెంట్లను పరిశీలించాలి. చివరగా, ఏ బ్యాంక్ లో తమ వారి ఖాతాలు ఉన్నాయని అనుకుంటున్నారో, ఆ బ్యాంక్ కు వెళ్లి, వివరాలు కావాలని అభ్యర్థించవచ్చు.

రుసుములు

క్లెయిమ్ చేయని డిపాజిట్లు, పెట్టుబడులను క్లెయిమ్ చేసుకోవడానికి ప్రభుత్వం ఎలాంటి రుసుము వసూలు చేయదు. అయితే, కొన్ని లీగల్ డాక్యుమెంట్లను పొందడానికి డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. అఫిడవిట్లు/నష్టపరిహార బాండ్లు వంటి కొన్ని లీగల్ డాక్యుమెంట్లను సమర్పించాల్సి ఉంటుంది. అవసరమైతే, ఒక న్యాయవాదిని నియమించుకోవాల్సి ఉంటుంది. అలాగే, మరణించిన పెట్టుబడిదారుల విషయంలో, చట్టపరమైన వారసులు తమ హక్కును నిరూపించాల్సి ఉంటుంది, దీనికి వారసత్వ ధృవీకరణ పత్రం / లెటర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ లేదా ప్రొబేట్స్ వంటి కోర్టు ఉత్తర్వులు అవసరం కావచ్చు.

ఆస్తుల క్లెయిమ్ కు గడువు

ప్రస్తుతం కాలపరిమితి లేకుండా ఎప్పుడైనా షేర్లను క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇన్సూరెన్స్, పీఎఫ్, బ్యాంక్ అకౌంట్లు, పోస్టల్ సేవింగ్స్ వంటి ఇతర పెట్టుబడులకు ప్రభుత్వం కాలపరిమితిని అమలు చేసింది. క్లెయిమ్ చేయని 10 సంవత్సరాల తరువాత, నిధులు ప్రత్యేక నిధికి బదిలీ చేయబడతాయి. అప్పుడు ప్రభుత్వం మరో 15 ఏళ్లు వేచి చూస్తుంది. మొత్తం 10 + 15 సంవత్సరాల తరువాత ప్రభుత్వం వాటిని సీనియర్ సిటిజన్ సంక్షేమ నిధి అంటే పీఎఫ్, ఈపీఎఫ్, డీఈఏ (బ్యాంక్ ఖాతా విషయంలో)లకు మళ్లిస్తుంది.