Dubai floods: దుబాయిలో వరదలు; అబుదాబిలో వడగండ్ల వాన; బుర్జ్ ఖలీఫాపై పిడుగు-dubai flooded hailstorm causes havoc in abu dhabi as heavy rainfall hits uae ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Dubai Floods: దుబాయిలో వరదలు; అబుదాబిలో వడగండ్ల వాన; బుర్జ్ ఖలీఫాపై పిడుగు

Dubai floods: దుబాయిలో వరదలు; అబుదాబిలో వడగండ్ల వాన; బుర్జ్ ఖలీఫాపై పిడుగు

HT Telugu Desk HT Telugu
Feb 13, 2024 03:42 PM IST

Dubai flooded: భారీ వర్షాలు, వరదలు యనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ను ముంచెత్తుతున్నాయి. వాణిజ్య కేంద్రం దుబాయిని భారీ వర్షాలతో వరద నీరు ముంచెత్తింది. ప్రభుత్వ ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేయాలని ఆయా కంపెనీలు సూచించాయి. పాఠశాలలకు కూడా సెలవు ప్రకటించారు.

దుబాయిలో వరద బీభత్సం దృశ్యం
దుబాయిలో వరద బీభత్సం దృశ్యం (REUTERS)

hailstorm in Abu Dhabi: దుబాయిలో భారీ వర్షాలు, వరదలతో జన జీవనం అస్తవ్యస్తమైంది. ఒక్క సారిగా ముంచెత్తిన వాన ధాటికి రహదారులు కాలువలుగా మారాయి. భారీ ట్రాఫిక్ జామ్ లతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా, దుబాయి నగరంపై అకస్మాత్తుగా మేఘాలు కమ్ముకుని కుంభ వృష్టిగా వర్షం కురిసి నగరాన్ని జలమయం చేసింది.

వడగండ్ల వానలు..

దుబాయి సహా యూఏఈ వ్యాప్తంగా భారీగా వడగండ్ల వానలు కురుస్తున్నాయి. పరిస్థితులు సాధారణం అయ్యే వరకు ప్రభుత్వ ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేయాలని ప్రభుత్వం ఆదేశించింది. యూఏఈలో జాతీయ వాతావరణ శాఖ (ఎన్సీఎం) కూడా రెడ్ అండ్ అంబర్ అలర్ట్ జారీ చేసింది. అబుదాబిలోని పలు ప్రాంతాల్లో వడగళ్ల వాన కురిసింది. వాతావరణంలో అకస్మాత్తుగా వచ్చిన మార్పు యూఏఈ వాసులను భయభ్రాంతులకు గురిచేసింది. అబుదాబి, దుబాయ్, రస్ అల్ ఖైమా, ఫుజైరా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయని ఖలీజ్ టైమ్స్ తెలిపింది. రస్ అల్ ఖైమా, ఫుజైరాలోని కొన్ని ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాల్లో రహదారులు జలమయమై, వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

దుబాయి నగర రహదారుల్లో నిలిచిన వర్షపు నీరు
దుబాయి నగర రహదారుల్లో నిలిచిన వర్షపు నీరు (AFP)

దుబాయిలో వరదలు

అకస్మాత్తుగా కురిసిన వర్షానికి దుబాయ్ లో వరదలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. వరదనీటితో నిండిన రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ లు ఏర్పడ్డాయి. వర్షానికి డ్రైనేజీ వ్యవస్థలు తట్టుకోలేకపోవడంతో మరికొన్ని కార్లు నీటిలో చిక్కుకున్నాయి. సోమవారం తెల్లవారుజామున భారీ ఉరుములు, మెరుపులతో దుబాయ్ వాసులు మేల్కొన్నారు. యూఏఈ అంతటా భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని హెచ్చరిస్తూ దేశ వాతావరణ శాఖ ఆరెంజ్ వెదర్ అలర్ట్ జారీ చేసింది.

బుర్జ్ ఖలీఫాపై పిడుగు

భారీ వర్షాలు, వరదలు, వడగండ్ల వానలు, పిడుగులు.. దుబాయి సహా యూఏఈని ముంచెత్తాయి. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మానవ నిర్మిత కట్టడం బుర్జ్ ఖలీఫాపై కూడా పిడుగు పడింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 13న యూఏఈలో పర్యటించనున్నారు. 2015 నుంచి ప్రధాని మోదీ యూఏఈలో పర్యటించడం ఇది ఏడోసారి కాగా, గత ఎనిమిది నెలల్లో ఇది మూడోసారి. అబుదాబిలోని జాయెద్ స్పోర్ట్స్ సిటీలో నిర్మించిన బీఏపీఎస్ ఆలయాన్ని ప్రధాని మోదీ ప్రారంభించి యూఏఈలోని భారతీయులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అబుదాబిలోని మొదటి సాంప్రదాయ హిందూ ఆలయం బిఎపిఎస్ మందిర్. దీనిని 27 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు.

Whats_app_banner