Narmada pushkaralu 2024: నర్మదా నది పుష్కరాలు ఎప్పటి నుంచి? ఈ పుష్కరాల ప్రాశస్త్యం ఏంటి?-when the narmada river pushkaras what is the significance of these pushkaras ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Narmada Pushkaralu 2024: నర్మదా నది పుష్కరాలు ఎప్పటి నుంచి? ఈ పుష్కరాల ప్రాశస్త్యం ఏంటి?

Narmada pushkaralu 2024: నర్మదా నది పుష్కరాలు ఎప్పటి నుంచి? ఈ పుష్కరాల ప్రాశస్త్యం ఏంటి?

HT Telugu Desk HT Telugu
Apr 14, 2024 09:00 AM IST

Narmada pushkaralu 2024: ప్రతీ ఒక్క నదికి పుష్కరాలు జరుగుతాయి. అలా ఈ ఏడాది నర్మదా నది పుష్కరాలు జరగనున్నాయి. ఈ నర్మదా నది పుష్కరాల ప్రాశస్త్యం ఏంటి అనేది దాని గురించి పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ చక్కగా వివరించారు.

పుష్కర ఘాట్
పుష్కర ఘాట్ (unsplash)

Narmada pushkaralu 2024: గురుగ్రహము మేషాది, ద్వాదశ రాశులలో సంచరించునపుడు ప్రతి రాశి ప్రవేశ సమయములో 12 రోజులు పుష్కరుడు నదిలో నివసించునట్లు బ్రహ్మచే నిర్ణయించబడినది. మొదటి 12 రోజులను ఆదిపుష్కరమని, చివరి 12 రోజులను అంత్య పుష్కరమని వ్యవహరిస్తారు. మిగిలిన కాలమునందు మధ్యాహ్న సమయములో రెండు ముహూర్తాల కాలము ఆ నదిలో పుష్మర ప్రభావము ఉంటుంది.

పుష్కరం అంటే 12 సంవత్సరాల కాలమని వ్యవహారం. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి మన భారతదేశంలోని ముఖ్యమైన 12 నదులకు పుష్కరాలు వస్తాయని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. సాధారణముగా ఆ నదికి పుష్కరకాలం ఒక సంవత్సరం ఉంటుంది.

చిలకమర్తి పంచాంగరీత్యా దృక్‌ సిద్ధాంత గణితం ఆధారంగా ఈ సంవత్సరం 01 05.2024 నుండి బృహస్పతి వృషభరాశి ప్రవేశముతో నర్మదానది పుష్కరాలు ప్రారంభమవుతున్నాయని చిలకమర్తి తెలిపారు.

నర్మదా నదీ పుష్కర ప్రాముఖ్యత 

మేషే గంగా వృషేరౌవా... అన్న ప్రమాణముననుసరించి బృహస్పతి వృషభరాశిలో ప్రవేశించునపుడు రేవానదీ పుష్కరాలు ప్రారంభమౌతాయి. రేవా నదిని నర్మదానది అని అంటారు.

ఓంకారేశ్వర్‌లో నర్మదా నదీ తీరంలో అనేక ఘాట్‌లు నిర్మించబడ్డాయి. ఈ నదీ ప్రవాహం ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది. నీరు కూడా చాలా స్వచ్చంగా ఉంటుంది. ఘాట్‌ల వద్ద నది లోతు ఎక్కువగా ఉండదు. భక్తులు సులభంగా స్నానాలు చేయుటకు అనుకూలంగా ఉంటుంది. నదిలో నీరు ఎక్కువగా ఉన్న లోతైన ప్రదేశాలకు పోకుండా ఇనుప కంచెలు, పట్టుకొనుటకు ఛైనులు ఏర్పాటు చేస్తారు. భద్రత కోసం సేఫ్టీ బోటులు కూడా ఏర్పాటు చేస్తారు.

ప్రధాన ఆలయానికి ఎదురుగా ఉన్న కోటితీర్థఘాట్‌ అన్ని ఘాట్‌లలో ముఖ్యమైనదిగా భావిస్తారు. ఇక్కడ స్నానం చేస్తే అనేక తీర్థయాత్రల పుణ్యఫలం లభిస్తుందని విశ్వసిస్తారు. ఇంకనూ చక్రతీర్థ ఘాట్‌, గోముఖ ఘాట్‌, భైరోన్ ఘాట్‌, కేవల్‌ రాం ఘాట్‌, బ్రహ్మపురి ఘాట్, సంగం ఘాట్‌, అభయ్‌ ఘాట్‌ అని ఉన్నవి. దాహార్తిని తీర్చడం, శుభ్రపరచడం అనే రెండు బాహ్య ప్రయోజనములు నీటికున్నట్లే మేధ్యం, మార్దనం అనే రెండు ఆంతరంగిక శక్తుల ప్రయోజనములు నీటికున్నాయని రుషి సంప్రదాయం.

నదిలో స్నానం చేసి మూడు మునకలు వేస్తే మేధ్యం అని, నీటిని సంప్రోక్షణ చేసుకోవడం (చల్లుకోవడం) మార్దనమని వ్యవహరిస్తారు. మేధ్యం తెలిసి తెలియక చేసిన పాపరాశిని తొలగిస్తుందని. మార్దనం స్థాన, శరీర, ద్రవ్యశుద్దిని కలిగిస్తుందని పెద్దలంటారు. నీరు నారాయణ స్వరూపం కనుక ఆ స్పర్శచే పాపాలు స్నానం ద్వారా తొలగిపోతాయని విశ్వసిస్తారు. తీర్ధ స్నానం ఉత్తమం, దానికంటే నదీస్నానం శ్రేష్టం.

పుష్కర సమయంలో నదీస్నానం ఉత్తమోత్తమం. బాణలింగాలుగా పిలువబడే గులకరాళ్ళు ఈ నదిలో లభిస్తాయి. ఈ ప్రాంతం వారు నర్మదా కే కంకేర్‌ ఉత్తే శంకర్‌ (శివుడు గులక రాళ్ళలో ఉన్నాడు) అని విశ్వసిస్తారని చిలకమర్తి తెలిపారు.

ఆదిశంకరాచార్యుల వారు తన గురువైన గోవింద భగవత్సాదుల వారిని ఈ నది ఒడ్డున గల ఓంకారేశ్వర్‌లో కలిశారు. గోవిందభగవత్సాదుల వారు నర్మదా నదీ తీరముననే తపస్సు గావించినట్లు ఐతిహ్యము గోదావరి తీర్ధ మహాత్య వర్ణనలో నర్మదానదీ ప్రస్తావన చేయబడింది.

శ్లో. రేవాతీరే తపః కుర్యాత్‌, మరణం జాహ్నవీ తటే

దానం దద్యాత్‌ కురుక్షేత్రే, గౌతమీ మ్యాంత్రితయం పరం.

నర్మదా నదీ తీరంలో తపస్సు, గంగానదీ తీరంలో మరణం, కురుక్షేత్రంలో దానము విశేష ఫలప్రదములని (ముక్తికారకములని) ఆర్ష వాక్యము. గోదావరి నదీ స్నానం వలన ఈ మూడింటి ఫలం కలుగుతుందని భావము. అమరకంటకం వద్ద కపిలధారనుండి జనించి వింధ్య పర్వత దేశముల గుండా పశ్చిమ వాహినయై ప్రవహిస్తుంది.

అమరేశ్వర క్షేత్రము నర్మదా తీరమున గలదు. పద్మపురాణము, మహాభారతము, హరివంశము మొదలైన పురాణములందు నర్మదా నది ప్రస్తావన ప్రముఖముగా కనిపిస్తుంది. నర్మద అన్ని నదులలో శ్రేష్టమైనది. సర్వపాపములను పోగొట్టి చరాచర జగత్తును తరింపజేయును. సరస్వతి మూడు రోజులలో, ఏడు రోజులలో యమున, గంగ ఒక రోజులో మనలను పాపవిముక్తులను చేయును. అయితే నర్మద దర్శన మాత్రము చేతనే పరిశుద్ధులను చేయును అని పురాణములలో అనేక విధముల నర్మదా ప్రాశస్త్యము వివరింపబడినది.

నర్మదానది భారతదేశంలో 5 పొడవైన నదులలో 5వ స్థానములో గలదు. దేశంలో మధ్యప్రదేశ్‌, గుజరాత్‌ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది. రెండు రాష్ట్రాలకు అనేక విధాలుగా అందించిన భారీ సహకారం కారణంగా దీనిని మధ్యప్రదేశ్‌, గుజరాత్‌ యొక్క జీవనరేఖ అని పిలుస్తారు.

నర్మదా నదిపై నిర్మించబడిన అతిపెద్ద డ్యామ్‌ సర్దార్‌ సరోవర్‌ డ్యాం. ఇది నర్మదా వ్యాలీ ప్రాజెక్టులో ఒక భాగం. ఇది నర్మదా నదిపై భారీ నీటిపారుదల, జలవిద్యుత్‌ బహుళ ప్రయోజన డ్యాం శ్రేణి నిర్మాణాన్ని కలిగి ఉన్న ఒక పెద్ద హైడ్రాలిక్‌ ఇంజనీరింగ్‌ ప్రాజెక్ట్‌.

సందర్శన ప్రదేశాలు 

ఈ నదీ పుష్కరానికి వెళ్లాలనుకున్న వాళ్ళు మధ్యప్రదేశ్‌ రాష్ట్రములోని ఉజ్జయినీ మహాక్షేత్రమునకు వెళ్ళి అక్కడ మహాకాళేశ్వర జ్యోతిర్లింగ దర్శనము, మహాకాళీ శక్తి పీఠమును, ఇతర దర్శనీయ ప్రదేశములను వీక్షించి, ఇక్కడ నుండి ఇండోర్‌ మీదుగా అమరేశ్వర క్షేత్రమునకు చేరుకొని ఓంకారేశ్వరుని, అమరేశ్వరుని సేవించుకుని నర్మదా పుష్కర స్నానమాచరించి తరింతురని చిలకమర్తి తెలిపారు.

ప్రముఖ దర్శనీయ ప్రదేశాలు అమరకంటక్‌ ఆలయం, ఓంకారేశ్వర్‌ ఆలయం, చౌసత్‌ యోగిని ఆలయం, చౌవిస్‌ అవతార్‌ ఆలయం, మహేశ్వర్‌ ఆలయం, నెమవార్‌ సిద్ధేశ్వర్‌ మందిర్‌, భోజ్‌పూర్‌ శివాలయం చాలా పురాతనమైనవి మరియు ప్రసిద్ధమైనవి. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఓంకారేశ్వర్‌ ఒకటి అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
WhatsApp channel

టాపిక్