Papamochini ekadashi: పాపాలు తొలగించే పాపమోచిని ఏకాదశి ఎప్పుడు? ఈ వ్రత కథ ఏంటి? ఎలా ఆచరించాలి?
Papamochini ekadashi: తెలిసి, తెలియక చేసిన పాపాలను వదిలించుకునేందుకు పాపమోచిని ఏకాదశి వ్రతం ఆచరిస్తారు. ఈ ఏడాది పాపమోచిని ఏకాదశి ఏప్రిల్ 5వ తేదీ వచ్చింది. ఈ వ్రత కథ ఏంటి? అనేది తెలుసుకుందాం.
Papamochini ekadashi: హిందూమతంలో ప్రతి నెల శుక్ల పక్షం, కృష్ణ పక్షంలో ఏకాదశి రోజున విష్ణుమూర్తిని ఆరాధిస్తారు. హోలీ పండుగ, చైత్ర నవరాత్రుల మధ్య వచ్చే ఏకాదశిని పాపమోచిని ఏకాదశి అంటారు. హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది వచ్చే చివరి ఏకాదశి కూడా ఇదే. ఏప్రిల్ 9 నుంచి తెలుగు నూతన సంవత్సరం ఉగాది జరుపుకుంటారు.

పాపమోచిని ఏకాదశి ఏప్రిల్ 5న జరుపుకోనున్నారు. ఆరోజు విష్ణువు, లక్ష్మీదేవిని పూజిస్తారు. మత విశ్వాసాల ప్రకారం పాపమోచిని ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే సకల పాపాల నుంచి విముక్తి లభిస్తుంది. మోక్షం పొందుతారు. ఆనందం, అదృష్టం పెరుగుతుంది. ఆరోజు ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని పూజిస్తే బ్రాహ్మణ హత్య, దొంగతనం, అహింస వంటి పాపాల నుంచి విముక్తి కలుగుతుంది. ఎవరైతే శ్రీమహా విష్ణువును పూజిస్తారో వాళ్ళకు పూర్వజన్మ పాపాలు తొలగిపోయి మోక్షం లభిస్తుంది.
పాపమోచిని ఏకాదశి శుభ సమయం
పాపమోచిని ఏకాదశి తిథి ఏప్రిల్ 4 సాయంత్రం 4.14 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు ఏప్రిల్ 5 మధ్యాహ్నం 1.28 గంటలకు ముగుస్తుంది. అందువలన ఉదయ తిథి ప్రకారం ఏప్రిల్ 5న పాపమోచిని ఏకాదశి జరుపుకుంటారు.
ఏకాదశి రోజు ఉపవాసం ఉండి, వ్రత కథ చదువుకోవడం వల్ల పాపాల నుంచి విముక్తి కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. ఈరోజు పూజలో తప్పనిసరిగా విష్ణువుకి తులసిని భోగంగా సమర్పిస్తారు. అయితే ఏకాదశి రోజు పొరపాటున కూడా తులసి ఆకులు తెంపకూడదు. అలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం పొందలేరు. ధననష్టం జరుగుతుంది.
పురాణాల ప్రకారం అర్జునుడికి పాపమోచిని ఏకాదశి ఉపవాస ప్రాముఖ్యతను శ్రీకృష్ణుడు స్వయంగా చెప్పాడు. తెలిసీ తెలియకుండా చేసిన పాపాలను తొలగించుకోవడం కోసం పాపమోచిని ఏకాదశి వ్రతం ఆచరిస్తారు. ఈ వ్రతం ఆచరించడం వల్ల మనిషికి ఉన్న అన్ని పాపాలు తొలగిపోయి సుఖ సంతోషాలు కలుగుతాయి.
పాపమోచిని ఏకాదశి వ్రతం కథ
పూర్వం రుషి చ్యవనుడు ఉండేవాడు. అతని కుమారుడు మేధావి అందంగా శారీరకంగా బలంగా ఉంటాడు. తన మానసిక, శారీరక స్వచ్ఛతను కాపాడుకోవడం కోసం నిరంతరం తపస్సు చేస్తూ ఉండేవాడు. అయితే తన తపస్సుకు భంగం కలిగించాలని ఇంద్రుడు భావిస్తాడు. అతని దృష్టిని మరల్చడం కోసం అప్సరసలను భూలోకానికి పంపిస్తాడు. కానీ మేధావి చేస్తున్న తపస్సు మీద వారి ప్రభావం పడలేదు.
అప్సరసల్లో ఒకరైన మంజుఘోష మేధావి అందానికి ఆకర్షితురాలు అవుతుంది. ఎలాగైనా తనని సొంతం చేసుకోవాలని అతని ఆశ్రమానికి సమీపంలోనే నివసించింది. తన మధురమైన గానంతో పాటలు పాడుతూ ఉండేది. అది వినడంతో మేధావి ఆమె పట్ల ఆకర్షితుడు అవుతాడు. ధ్యానానికి భంగం వాటిల్లుతుంది. అది గమనించిన ఇంద్రుడు మన్మథుడిని తన పూలబాణంతో మేధావి మనసులో కోరికలు కలిగేలా చేస్తాడు.
మన్మథుడి ప్రభావంతో మేధావి ఆమెతో ప్రేమలో పడతాడు. కొన్ని సంవత్సరాల పాటు మేధావి మంజుఘోష కలిసి ఉంటారు. అయితే కొన్ని రోజుల తర్వాత మంజుఘోష తాను వెళ్లిపోవాలని చెబుతుంది. దీంతో మేధావి తను చేసిన తప్పును తెలుసుకుంటాడు. ఆమె చర్యలకు కోపోద్రిక్తుడై విశ్వంలోనే అత్యంత వికారమైన మహిళగా మారిపోతావని శపిస్తాడు.
తాను చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలని మేధావి తన తండ్రి రుషి చ్యవనుడిని ఆశ్రయిస్తాడు. పాపం నుంచి విముక్తి పొందాలంటే పాపమోచిని ఏకాదశి వ్రతం ఆచరించాలని మేధావికి సూచిస్తాడు. ఈ వ్రతం మంజుఘోష కూడా ఆచరించాలని చెప్తాడు. దీంతో ఇద్దరూ ఈ వ్రతం ఆచరిస్తారు. పాపమోచిని ఏకాదశి వ్రతం పాటించడం వల్ల విష్ణువు దయతో వారిద్దరూ చేసిన పాపాలు తొలగిపోయాయి.
సంబంధిత కథనం