Paap mukti Certificate : మీరు ఎన్ని పాపాలు చేశారు? ఈ ఆలయంలో పాప విమోచన సర్టిఫికెట్
Gautameshwar Mahadev Temple : పాపాల విముక్తి కోసం చాలా మంది ఎన్నో గుళ్లు తిరుగుతారు. దేవుడిని ప్రార్థిస్తారు. అయితే ఓ గుడికి వెళితే మాత్రం సర్వ పాప విముక్తి సర్టిఫికెట్ ఇస్తారు.
పుణ్యం కోసం ఎన్నో వ్రతాలు, ఎన్నో మంచి పనులు చేస్తుంటారు చాలా మంది. దేవుడికి ప్రార్థనలు చేస్తారు. కొందరికి తాము చేసిన తప్పుడు పనులు గురించి తెలిసే ఉంటుంది. మరికొందరికి తెలియకుండా ఏదైనా తప్పు చేస్తే క్షమించమని దేవుడిని వేడుకుంటారు. ఇలా ఒక్కొక్కరిది ఒక్కో కథ. కానీ అందరి ప్రార్థన ఒక్కటే. దేవుడా.. నన్ను పాపాల నుంచి విముక్తి చేయి.. నేను చేసిన తప్పులు ఏదైనా ఉంటే క్షమించమని. అయితే దీనికి కూడా ఓ ఆలయంలో సర్టిఫికెట్ ఇస్తారు.
నిజానికి మనుషుల మనస్తత్వం ఎలా ఉంటుందంటే.. పుణ్యం యొక్క ఆనంద ఫలాలను అనుభవించడం కంటే పాపం యొక్క శిక్ష గురించి భయపడతారు. పాపాల మురికిని కడిగి, తమను తాము శుద్ధి చేసుకోవాలనే ఆశతో వివిధ మార్గాల కోసం వెతుకుతారు. వివిధ నదులు, నీటి వనరులలో స్నానం చేయడం, దేవాలయాలలో పూజలు చేయడం మొదలుకొని భక్తులు తమ తమ విశ్వాసాలలో అనేక ఆచారాలను అనుసరిస్తారు. ఇవన్నీ మనకు తరచూ కనిపించేవే. అయితే ఎప్పుడూ వినని విధంగా ఓ దగ్గర పాప విమోచన కోసం సర్టిఫికెట్ కూడా ఇస్తారు. ఇది ఎప్పటి నుంచో ఉంది.
రాజస్థాన్‌లోని ఒక దేవాలయం భక్తులకు పాపపు ధృవీకరణ పత్రాలను ఆచారబద్ధంగా అందించడం ప్రారంభించింది. పాపాలు పోగొట్టుకోవడానికి భక్తుల ఖర్చు ఎక్కువ చేయాల్సిన పని లేదు. కేవలం 12 రూపాయలు మాత్రమే సరిపోతంది. ఈ మొత్తాన్ని ఖర్చు చేయడం ద్వారా మీరు ఆ ఆలయం నుండి పాప విమోచనకు సంబంధించిన సర్టిఫికేట్ పొందవచ్చు.
గౌతమేశ్వర్ మహాదేవ్ పాపమోచన తీర్థం రాజస్థాన్‌లోని ప్రతాప్‌గఢ్‌లో ఉంది. ఈ ఆలయం శతాబ్దాలుగా తీర్థయాత్రగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయాన్ని గిరిజనుల హరిద్వార్ అని కూడా అంటారు. ఇందులో మందాకిని పాప్ మోచిని గంగా కుండ్ అనే రిజర్వాయర్ ఉంది. అక్కడ స్నానం చేస్తే సర్వపాపాలు హరించి పుణ్యం లభిస్తుందని భక్తుల విశ్వాసం. గుడిలో కేవలం 12 రూపాయలు చెల్లించి వాటర్ ట్యాంక్‌లో స్నానం చేస్తే పాపవిమోచన పత్రం ఇస్తారు.
తమ తప్పులకు ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి గ్రామస్తులు, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఈ ఆలయానికి వస్తుంటారని అర్చకులు చెబుతున్నారు. పాప విమోచన ధృవీకరణ పత్రాన్ని తీసుకుంటారు. చాలాసార్లు హృదయంలో ఉన్న పాపపు భావం ప్రజలను ఇక్కడికి తీసుకువస్తుందని అర్చకులు అంటున్నారు. తెలిసో.. తెలియకో చేసిన తప్పులను వదిలించుకోవడానికి చాలా మంది సర్టిఫికెట్లు పొందడానికి ఇక్కడకు వస్తారు.
ప్రతి సంవత్సరం గౌతమేశ్వరాలయం నుండి 250 నుండి 300 పాప విమోచన ధృవీకరణ పత్రాలు జారీ చేస్తారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఈ పద్ధతి కొనసాగుతోంది. అయితే ఈ శివాలయానికి ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు తరలివస్తారు. పాప విముక్తి కోసం మాత్రమే కాకుండా పూజలు కూడా చేస్తారు.