Putra Ganapati Vratam: పుత్రగణవతి వ్రతం అంటే ఏమిటి? ఎందుకు చేస్తారు? ఎలా చేయాలి?
Putra ganapati vratam: పుత్ర గణపతి వ్రతం అంటే ఏంటి? ఎలా చేయాలి? ఈ వ్రతం ఆచరించడం వల్ల కలిగే ఫలితాల గురించి పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ చక్కగా తెలిపారు.
Putra ganapati vratam: విఘ్నేశ్వరుని పూజలలో వాడే ఇరవై ఒక్క రకాల వత్రాలలో పుత్రగణపతి వ్రతం ఒకటి అని ప్రముఖ అధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చరక్రవర్తి శర్మ తెలిపారు. భగవంతుడు కాల స్వరూపుడు. చైత్రంలోనే బ్రహ్మ సృష్టి ఆరంభించాడంటారు. చైత్రం నుంచి ఫాల్గుణం వరకు మన సంప్రదాయంలో పన్నెండు మాసాలు ఉన్నాయి. చివరిదైన ఫాల్గుణం ఎన్నో పండుగలకు పర్వాలకు నెలవు.
ఫాల్గుణం విష్ణు ప్రీతికరం అంటోంది భాగవతం. ఫాల్గుణ శుద్ధ తదియ శాలివాహన శక సంవత్సరాది. ఫాలుణ శుద్ధ చవితినాడు పుత్రగణపతి వ్రతం. వినాయక చవితి విధానంలోనే చేసే వ్రతం ఇది. ఆరోజు కూడా గణపతిని పుత్రసంతానం కోసం పూజిస్తూ ఆచరించే వ్రతం ఇది. కేతువు అనుగ్రహానికి వినాయక చవతి, సంకష్టహర చతుర్ధి, పుత్రగణపతి వ్రతాలు చేస్తే ఫలితం ఉంటుందని సిద్ధాంతాలు చెపుతున్నాయని చిలకమర్తి తెలిపారు.
గణపతి శబ్దం బ్రహ్మ స్వరూపము అంటే ఓంకారానికి ప్రతీక. మంత్రాలన్నింటికీ ముందు ఓంకారం ఎలా ఉంటుందో అలా అన్ని శుభకార్యాలకు ప్రారంభంలో గణేశ పూజ విధిగా ఉంటుంది. గణేశుడు ఆది, అంతం లేని ఆనందమూర్తి. సకల సంపత్తులనిచ్చే సిద్ధిదేవుడు. ఓంకారనాదం ఉద్భవించి, ఆ నాదం క్రమక్రమంగా గజానరూపంగా వెలుగొందింది. గణపతిని ఓంకార స్వరూపునిగా గణపత్యథర్వశీర్న్షం కూడా పిలుస్తారు.
దేవతాగణాలకు ఆదిపురుషుడై ఉద్భవించడం వల్లనే ఈయనకు గణనాథుడని, గణేషుడని, గణపతి అని పేర్లు వచ్చాయి. ఆకృతిని అనుసరించి కొన్ని పేర్లు, ఆధిపత్యాన్ని అనుసరించి కొన్ని పేర్లు గణపతికి కలిగినప్పటికీ ప్రధానముగా ఈ దైవం గణాలకు నాయకుడని చిలకమర్తి తెలిపారు.
పుత్రగణపతి వ్రతం ఫాల్గుణ శుద్ధ చవితినాడు చేస్తారు. ఈ రోజు పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం గణపతిని పూజించి చంద్రోదయ సమయాన గణపతికి, చంద్రునికి, చతుర్ధిదేవతకు... చందన దూర్వాక్షతలతో అర్ఘ్యం ప్రదానము చేయాలి. ఇలా చేస్తే సర్వకార్య సిద్ధి కలుగుతుంది . పుత్రగణపతి వ్రతం వినాయక చవితి పూజ తరహాగా చేస్తారని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.