Palakova Modak | గణపతికి మోదకాలంటే అందుకే ఇష్టం.. పాలకోవతో ఇలా చేసేయండి!
Happy Ganesh Chaturthi 2022: వినాయక చవితి పండగ సంబరాలు మొదలయ్యాయి. సకల విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడు నేడు ప్రతి చోటా కొలువుదీరాడు. మరి ఆ గణపయ్యకు ఇష్టమైన మోదకాలను పాలకోవతో చేసే రెసిపీ ఇక్కడ ఉంది. గణపతికి మోదకాలు ఎందుకు ఇష్టమో ఇక్కడ తెలుసుకోండి.
Happy Ganesh Chaturthi 2022: జై బోలో గణేష్ మహరాజ్ కీ.. గణపతి బొప్పా మోరియా.. ఇక నుంచి పది రోజుల పాటు ఇదే మన మంత్రం ఇదే. మనకు ఎంతో ఇష్టమైన మన గణపయ్య మన ఇంటికి, ప్రతి ఊరికి, వాడవాడకు వచ్చేశాడు. దేశమంతటా వినాయక చవితి సంబరాలు మొదలయ్యాయి. మరి మన వద్దకు వచ్చిన అత్యంత విశిష్టమైన అతిథి గణపతికి ఈ పది రోజుల పాటు దీపధూపాలతో ఆరాధించాలి, రుచికరమైన నైవైద్యాలు సమర్పిస్తూ ప్రేమగా చూసుకోవాలి. వినాయకుడికి అత్యంత ఇష్టమైన ఆహారం మోదకాలు. అందుకే గణపతిని 'మోదకప్రియ' అని కూడా అంటారు.
గణపతికి మోదకాలు ఎందుకు ఇష్టం అని చెప్పేందుకు పురాణాల్లో ఒక కథ ఉంది. అదేమిటంటే.. గణేషుడికి ఆకలి చాలా ఎక్కువ. ఈ క్రమంలో శివుడు తమ బాల గణేశుడిని వెంటబెట్టుకొని అత్రి ఋషి ఆశ్రమాన్ని సందర్శిస్తాడు. ఆ సమయంలో అత్రి ఋషి సతీమణి అనసూయ ఈ బాల గణేశుడికి ఆహారం అందిస్తుంది. ఎంత తినిపించినా, బుజ్జి గణపయ్య ఆకలి తీరదు. దీంతో అనసూయ పిండితో మోదకాన్ని చేసి తినిపిస్తుంది. అప్పుడు బాలగణేశుడి ఆకలి తీరిపోతుంది. పార్వతీ మాత కూడా వెంటనే మోదకాలు సిద్ధం చేసి గణేషుడి ఆహారం తీర్చేది. ఈ కథల ఆధారంగానే ప్రతి వినాయక చవితికి మోదకాలు చేసి భక్తితో గణేశుడికి సమర్పించటం ఆనవాయితీగా వస్తుంది.
మరి మీరూ పది రోజుల పాటు సాగే ఈ గణేశ్ మహోత్సవాల సందర్భంగా సులభంగా, రుచికరంగా పాలకోవతో చేసేటువంటి మోదకాల రెసిపీ ఇక్కడ అందిస్తున్నాం. మీరూ ప్రయత్నించండి మరి.
పాలకోవ మోదకాలు రెసిపీకి కావలసినవి
పాలు - 1/2 కప్పు
పాలపొడి - 1 కప్పు
దేశీ నెయ్యి - 1 టేబుల్ స్పూన్
చక్కెర - 1/4 కప్పు
తరిగిన డ్రై ఫ్రూట్స్, నట్స్ తగినన్ని
కుంకుమ పువ్వు చిటికెడు
తయారీ విధానం
1) ముందుగా పాన్‌లో పాలను వేడి చేయండి. అందులో కాస్త దేశీ నెయ్యి వేసి బాగా కలపాలి.
2) ఇప్పుడు మిల్క్ పౌడర్ వేసి వేడి చేయండి, పొడి పూర్తిగా కలిసిపోయేలా పాలు చిక్కగా మారేలా తిప్పుతూ ఉండండి.
3) ఈ దశలో చక్కెర వేసి, అది పూర్తిగా కరిగిపోనివ్వండి. ఇదే సమయంలో ఫ్లేవర్ కోసం కుంకుమ పువ్వు, కొద్దిగా యాలకుల పొడి, దాల్చిన చెక్క పొడి కలుపుకోవచ్చు.
4) ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి, ఈ మిశ్రమాన్ని చల్లారనిస్తే ముద్దలా తయారవుతుంది.
5) ఈ పిండి ముద్దను తీసుకొని కావలసిన ఆకృతిలో మోదకాలు చేయండి. ఆపై డ్రైఫ్రూట్స్, నట్స్ అతికించండి.
అంతే రుచికరమైన పాలకోవ మోదకాలు సిద్ధమైనట్లే. వెంటనే ఆహా ఓహో అంటూ తినేయకండి. ముందుగా గణపతి బొప్పకు సమర్పించి, ఆ తర్వాత ఈ పాలకోవ మోదకాల రుచిని ఆస్వాదించండి.
సంబంధిత కథనం