Phalguna Masam । దానధర్మాలకు ఉత్తమమైనది ఫాల్గుణం.. మహావిష్ణువు ఆరాధన ఎంతో పుణ్యం!
Phalguna Masam: ఫాల్గుణ మాసం ఎంతో విశిష్టమైనది, అనేక దేవతావతారాలు జనియించిన పవిత్ర మాసం ఇది. ఈ మాసంలో దానధర్మాలు చేస్తే చాలా పుణ్యం. మరింత సమాచారం ఇక్కడ తెలుసుకోండి.
Phalguna Masam: శ్రీ మహావిష్ణువుకు ఇష్టమైన మాసాలలో ఫాల్గుణము ఒకటి. ఫాల్గుణ శుద్ధ తదియ శాలివాహన శక సంవత్సరాది. ఫాల్గుణ మాసములో సమీప నదులలో స్నానమాచరించి విష్ణుమూర్తిని పూజించి, సూర్యభగవానునికి అర్ఘ్యమిచ్చి, విష్ణుమూర్తిని షోడశనామాలతో అర్చించి, విష్ణుమూర్తికి నైవేద్యంగా పాలు గాని, పాలతో చేసిన ప్రసాదాన్ని కాని సమర్పించడం సాంప్రదాయం.
జ్యోతిష్యశాస్త్ర ప్రకారం పూర్వ ఫాల్గుణి, ఉత్తర ఫాల్గుణి నక్షత్రాల వద్ద పౌర్ణమి చంద్రుడు ఉండుట చేత ఈ మాసమునకు ఫాల్గుణ మాసమని పేరు వచ్చినట్లుగా ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
భాగవతం ప్రకారం ఫాల్గుణ మాసము విష్ణు ప్రీతికరము అని చెప్పడమైనది. విష్ణుమూర్తిని ఆరాధించేటటువంటి వారు ఫాల్గుణ శుక్ల పాడ్యమి నుండి శుక్ల ద్వాదశి వరకు ఉన్న ఈ పన్నెండు రోజులు పయోవ్రతమును ఆచరిస్తారు. పయోవ్రతమనగా మహావిష్ణువును పన్నెండు రోజులు పంచామృతాలతో అభిషేకం చేసి, రోజూ ఉదయం, సాయంత్రము స్నానమాచరించి విష్ణుమూర్తిని పూజించాలి. విశేషంగా విష్ణుమూర్తిని పంచామృతాలతో అభిషేకం చేయడం పయోవ్రతములో విశేషము. ఇలా పన్నెండు రోజులు విష్ణుమూర్తిని అభిషేకం చేసి పూజించి పదకొండో రోజు ఉపవాసముండి, పన్నెండో రోజు విష్ణుమూర్తికి క్షీరాన్నాన్ని నైవేద్యంగా పెట్టాలి. ఈ విధంగా నిష్టతో విష్ణుమూర్తిని పూజించిన వారికి అభీష్టసిద్ధి కలుగుతుందని భాగవత పురాణము తెలియచేసినదని బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
ఇదేవిధముగా అదితి విష్ణువును ఫాల్గుణ మాసములో పూజించి పయో వ్రతమును ఆచరించి వామనుని పుత్రునిగా పొందినట్లుగా పురాణాలు తెలియచేసాయి. ఫాల్గుణ మాసములో తదియ, చవితి రోజున విఘ్నేశ్వరుని ప్రత్యేకంగా పూజిస్తారు.
దానధర్మాలకు ఉత్తమమైనది ఫాల్గునం
ఫాల్గుణ మాసము దానధర్మాలు ఆచరించడానికి ఉత్తమమైన మాసమని పురాణాలు తెలియచేస్తున్నాయి. ఫాల్గుణ మాసములో గోదానం, ధనదానం, వస్త్రదానం చేయడం వలన గోవిందునకు ప్రీతి కలిగిస్తాయిని శాస్త్ర వచనం.
ఫాల్గుణ శుద్ధ ఏకాదశిరోజు ఆమ్లక ఏకాదశి వ్రతము నిర్వహించడం, ద్వాదశినాడురోజు నరసింహస్వామిని పూజించడం సాంప్రదాయము. ఫాల్గుణ అమావాస్య రోజు పితృ దేవతలకు తర్పణాలు వదిలి అన్నదానాలు చేయాలి.ఫాల్గుణ మాసములో అతి ముఖ్యమైనది వసంతోత్సవము. ఈ వసంతోత్సవాన్ని హెూలీ పండుగగా జరుపుకుంటారు.
దేవతావతారాలు జనియించిన పవిత్ర మాసం
ఫాల్గుణ మాసములో కొన్ని ముఖ్య దేవతావతారాలు, ఆధ్యాత్మిక గురువులు జన్మించినట్లుగా సనాతన ధర్మం తెలియచేసింది. పాలకడలి నుండి లక్ష్మీదేవి ఫాల్గుణ మాసములో ఉద్భవించినట్లుగా (ఫాల్గుణోత్తరి) పురాణాలు తెలియచేసాయి. హరిహర సుతుడు అయ్యప్ప ఫాల్గుణ మాసములో జన్మించినట్లుగా చెప్పడమైనది.
రామాయణం ప్రకారం ఫాల్గుణ మాసము బహుళ అష్టమి నాడు సీతాదేవి భూమి నుండి ఆవిర్భవించి జనకుడికి లభించినట్లుగా తెలియచేస్తారు. అందుకే ఆ రోజు రామాయణాన్ని ప్రత్యేకంగా చదవాలి.
రామాయణం ప్రకారం ఫాల్గుణ బహుళ పాడ్యమినాడు రాముడు వానరులతో రావణుడిపై లంకకు యుద్ధానికి బయలుదేరినటువంటి రోజుగా చెప్పడమైనది. ఫాల్గుణ బహుళ ఏకాదశి నాడు ఇంద్రజిత్తు, లక్ష్మణుని మధ్య యుద్ధం జరిగినట్లుగా రామాయణం తెలియచేసింది.
మహాభారతము ప్రకారం ఫాల్గుణ అష్టమి నాడు ధర్మరాజు జన్మించినట్లుగా, ఫాల్గుణ బహుళ త్రయోదశి రోజున భీముడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కీచకుడు, జరాసంధుడు వంటి వారు జన్మించినట్లుగా మహాభారతంలో పేర్కొనడమైనది.
రామకృష్ణ పరమహంస వంటి ఆధ్యాత్మిక గురువు ఫాల్గుణ మాసములో జన్మించినట్లుగా చెప్పడమైనది.
- బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ,
మొబైల్: 9494981000.
సంబంధిత కథనం