Lord shiva: బ్రహ్మ పురోహితుడుగా మారి శివపార్వతుల వివాహం జరిపించిన ఆలయం ఇదే..!-famous triyuginarayana temple where it is believed lord shiva parvathi devi got married ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Lord Shiva: బ్రహ్మ పురోహితుడుగా మారి శివపార్వతుల వివాహం జరిపించిన ఆలయం ఇదే..!

Lord shiva: బ్రహ్మ పురోహితుడుగా మారి శివపార్వతుల వివాహం జరిపించిన ఆలయం ఇదే..!

Gunti Soundarya HT Telugu
Feb 22, 2024 04:13 PM IST

Lord shiva: త్రియుగినారాయణ ఆలయంలో ఆదిదంపతులు పార్వతీపరమేశ్వరుల వివాహం జరిగిందని స్థల పురాణాలు చెబుతున్నాయి. ఈ ఆలయం ఉత్తరాఖండ్ లోని రుద్రప్రయాగ్ లో ఉంది.

శివపార్వతుల వివాహం జరిగిన ఆలయం ఇదే
శివపార్వతుల వివాహం జరిగిన ఆలయం ఇదే (pixabay)

Lord shiva: శివపార్వతులను ఆదిదంపతులు అంటారు. అటువంటి ఈ ఆదిదంపతుల వివాహం ఎక్కడ జరిగిందో తెలుసా? ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగా త్రియుగినారాయణ ఆలయంలో జరిగిందని పురాణాలు చెబుతున్నాయి.

పురాణాల ప్రకారం తారకాసురుడు అనే రాక్షసుడు తపస్సు చేసి బ్రహ్మ దగ్గర నుంచి శివపుత్రుడు తప్ప మరెవరి చేతిలోని మరణం సంభవించకూడదని వరం పొందుతాడు. వర గర్వంతో ముల్లోకాలని ముప్పు తిప్పలు పెడుతూ దేవతలని హింసించసాగాడు. అదే సమయంలో సతీదేవి వియోగంతో శివుడు ఆమె దేహాన్ని భుజం మీద పెట్టుకుని తాండవం ఆడుతూ లోక రక్షణ మరిచిపోయాడు. తన కర్తవ్యం గుర్తు చేయడం కోసం విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో సతీదేవి దేహాన్ని ఖండఖండాలుగా చేశాడు. ఒక్కో శరీర భాగం పడిన ప్రదేశమే శక్తి పీఠాలుగా విరాజిల్లుతున్నాయి.

తారకాసురుడి నుంచి విముక్తి కలగాలంటే శివపార్వతుల వివాహం జరిపించాలని దేవతలు నిశ్చయించుకుంటారు. అప్పటికే శివుడిని మనువాడాలనే కోరికతో పార్వతీ దేవి కొన్ని ఏళ్లుగా తపస్సు చేస్తూ ఉంది. ఆమె అంచచలమైన భక్తి, తపస్సుకి మెచ్చిన శివుడు త్రియుగినారాయణ ఆలయంలో పార్వతీ దేవిని వివాహమాడాడని శివపురాణం చెబుతోంది. ఈ ఆలయంలో పవిత్రమైన హోమం ఏర్పాటు చేసి పెళ్లి జరిపించారు. స్వయంగా బ్రహ్మ, విష్ణువు ఈ వివాహం జరిపించారని చెబుతారు. శివపార్వతుల వివాహం రోజు వెలిగించిన అఖండ హోమం ఇప్పటికీ వెలుగుతూనే ఉండటం ఇక్కడి విశేషం.

పార్వతీ దేవి అన్నగా విష్ణుమూర్తి

త్రియుగినారాయణ ఆలయం అటు శైవులకు, విష్ణువు భక్తులకు ఎంతో విశేషమైనది. త్రియుగినారాయణ అంటే త్రి-మూడు, యుగి- యుగాలు, నారాయణ- విష్ణు మూర్తిని సూచిస్తుంది. శివపార్వతుల వివాహంలో విష్ణుమూర్తి కీలక పాత్ర పోషించారు. పార్వతి దేవి క్షేమం గురించి ఆయన తండ్రి ఆందోళన వ్యక్తం చేసిన సందర్భంలో విష్ణువు ఆమెకి సోదరుడిగా ఉన్నారు. వధువు సోదరుడు చేయాల్సిన క్రతువులన్నీ విష్ణుమూర్తి చేశాడు.

పురోహితుడుగా మారిన బ్రహ్మ

శివపార్వతుల వివాహానికి పురోహితుడు గా బ్రహ్మ దేవుడు నిలిచాడు. ఈ దైవిక జంటకు ఆశీర్వదించాడు. బ్రహ్మ ఉనికి వారి ఐక్యతను పవిత్రం చేసింది. వారిది శాశ్వతమైన బంధంగా మార్చింది. వివాహం జరిపించడానికి ముందు ఆలయం లోపల ఉన్న బ్రహ్మ కుండ్ లో స్నానం ఆచరించాడు. అందుకే ఆ ప్రదేశానికి బ్రహ్మ కుండ్ అనే పేరు వచ్చింది.

బ్రహ్మ శిల, మూడు తీర్థ కుండాలు

త్రియుగినారాయణ ఆలయంలో మూడు కుండాలు ఉంటాయి. రుద్ర కుండ్, విష్ణు కుండ్, బ్రహ్మ కుండ్ ఉంటాయి. ఇవి అత్యంత పవిత్రమైన తీర్థ స్థలాలు. త్రియుగినారాయణ ఆలయంలో వివాహం చేసుకోవాలని అనుకునే వాళ్ళు వేడుకలకు ముందు తప్పనిసరిగా వీటిలో స్నానం చేయాలని స్థానికులు చెబుతారు.

ఆలయానికి సమీపంలో బ్రహ్మ శిల అనే ఒక ప్రత్యేకమైన రాయి ఉంది. వివాహ ఆచారాలను అక్కడే నిర్వహించారని స్థల పురాణం చెబుతోంది. ఈ ఆలయం మధ్యలో ఒక చిన్న పీఠం మీద శివలింగం ఉంటుంది. ఆ పీఠం మీదనే వివాహం జరిగిందని చెబుతారు.

శివపార్వతుల వివాహం సమయంలో వెలిగించిన హోమ గుండం ఇప్పటికీ అక్కడ వెలుగుతూనే ఉంటుంది. మూడు యుగాలుగా ఈ హోమం ఆరిపోకుండా అక్కడ ఉన్న వాళ్ళు కర్రలు, నెయ్యి వంటి వస్తువులు వేస్తూ అగ్ని జ్వాల రగులుతూనే ఉండేలా చూసుకుంటారు. ఈ ఆలయ పరిసర ప్రాంతాలు ఆహ్లాదకరంగా ఉంటాయి. చుట్టూ మంచు కొండలు కనిపిస్తాయి. త్రియుగినారాయణ ఆలయం కేదార్ నాథ్ ఆలయాన్ని పోలి ఉంటుంది.

WhatsApp channel