Lord shiva: మహావిష్ణువు దశవతారాల గురించి అందరికీ తెలుసు. దుష్ట సంహారం చేసేందుకు విష్ణువు అవతారాలు ఎత్తాడు. కానీ విష్ణువు మాత్రమే కాదు భోళా శంకరుడైన శివుడు కూడా పది అవతారాలు ఎత్తాడు. ఒక్కో అవతారంలో శివుడితో పాటు పార్వతీ దేవి కూడా ఆయనకి భార్యగా అవతారాలు ఎత్తుతూ వచ్చింది. ఇంతకీ పరమేశ్వరుడి ఎత్తిన పది అవతారాలు ఏంటంటే..
శివుడి పది అవతారాలలో మొదటిది మహా కాలుడు. మహాకాళిగా పార్వతీ దేవి మహా కాలుడి భార్యగా వచ్చింది. వీరిని పూజించడం వల్ల భక్తులకి భుక్తి, ముక్తి ఇచ్చి వాళ్ళు అడిగిన కోరికలు నెరవేరుస్తారు.
ఈశ్వరుని రెండో అవతారం తారక అవతారం. తారకా దేవి భార్యగా స్వామి వారిని అనుసరించింది. భక్తుల సేవకులకి భుక్తి, ముక్తి ప్రసాదించారు.
పరమేశ్వరుడి మూడో అవతారం బాల భువనేశ్వరుడు. ఈ అవతారంలో శివుని సతీమణి పార్వతీ దేవి బాల భువనేశ్వరి రూపంలో ఆయనకి అర్థాంగిగా వచ్చింది. ఈ అవతారంలో సత్పురుషులకి సుఖాలని ప్రసాదించారు.
ముక్కంటి షోడశశ్రీవిద్యేశుడు పేరుతో నాలుగో అవతారం ఎత్తారు. ఈ అవతారంలో షోడశశ్రీవిద్యాదేవిగా పార్వతీ దేవి ఆయనకి భార్యగా వచ్చింది. భక్తులని సర్వ సుఖాలు, భక్తి, ముక్తి ఇచ్చేందుకు ఈ అవతారం ఎట్టారు.
నీలకంఠుడు ఐదో అవతారం భైరవుడు. పార్వతీ దేవి భైరవిగా అవతరించింది. ఉపాసకులకి సర్వ సుఖాలు ఇచ్చారు.
శివుడి ఆరో అవతారం భిన్నమస్త అవతారం. భిన్న మస్తగా పార్వతీ దేవి అవతారం ఎత్తి శివుడిని పెళ్లాడింది.
ధూమవంతుడిగా శివుడు ఏడో అవతారం ఎత్తాడు. పార్వతీ దేవి ధూమవతిగా ఆయన అర్థాంగిగా వచ్చింది. ఉపాసకుల కొంగుబంగారంగా ఈ ఆదిదంపతులు నిలిచారు.
కైలాస అధిపతి ఎనిమిదో అవతారం బగళాముఖుడు. శివుడి అర్థాంగిగా ఈ అవతారంలో పార్వతీ దేవి బగళాముఖిగా అవతరించింది. ఆమెనే మహానంద అని కూడా పిలుస్తారు.
మాతంగుడిగా శివుడు తొమ్మిదో అవతారం ఎత్తాడు. మాతంగిగా పార్వతీ దేవి అవతరించింది. భక్తుల కాంక్షలు నెరవేర్చుతారు.
శివుడు దశావతారం కమలుడు. కమలగా పార్వతీ దేవీ పుట్టింది.
శివ పార్వతులకి సంబంధించిన ఈ పది అవతారాల గురించి చాలా మందికి తెలియదు. తంత్ర శాస్త్రంలో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. భక్తులని రక్షించే ఉద్దేశంతో శివుడు ఈ అవతారాలు ఎత్తాడు. ఈ దశావతారాలకి పార్వతీ దేవి వివిధ రూపాలలో భార్యగా ఉండటం ఎంతో ప్రత్యేకం. వీటిలో బగళాముఖి, ధూమవతి శక్తులకి వేర్వేరుగా మంత్రాలు ఉన్నాయి. శివుడి ఎత్తిన ప్రతి అవతారానికి ప్రత్యేక ప్రాధన్యత ఉంది.
మహా కాలుడు ఆది అంతం లేని వాడు. జనన మరణాలు లేని వాడు. శివుడికి కార్తీక మాసం అత్యంత ప్రీతికరమైనది. శివుని అనుగ్రహం కోసం సోమవారం నాడు ప్రత్యేక పూజలు చేస్తే మంచి ఫలితాలు పొందుతారు. శివుడు అభిషేక ప్రియుడు. గంగాజలంతో అభిషేకం చేసినా కూడా సంతోషించి భక్తులకు వరాలు ప్రసాదిస్తాడు.