కాశి, మధురై, త్రిపురాంతకంలో మాత్రమే ఉన్న కదంబ వృక్షాలు ఎర్ర రంగు పువ్వులతో ఉంటాయి. వీటిని మరి ఎక్కడా మనము చూడము. కాలక్రమేణా ఈ వృక్షాలు క్షీణిస్తూ వచ్చాయి. ఈ పువ్వుల్ని మనము చెట్టు నుండి కోయరాదు. కింద రాలినవి మాత్రమే పూజించుకోవాలి.
అవి చాలా సుకుమారంగా ఉంటాయంట. అంతే కాదు ఈ కదంబ చెట్టు కింద కూర్చుని పార్వతీ దేవీ నామాన్ని గాని సహస్రనామాలు కానీ లేదా గురువు దగ్గర నుంచి తీసుకున్న ఉపదేశ మంత్రాన్ని జపిస్తే చాలా త్వరగా సిద్ధిస్తుంది. పౌర్ణమి రోజు రాత్రి ఆ చెట్టు కింద కూర్చొని మనసుని అమ్మ పై పెట్టి సహస్రనామాలు పారాయణం చేస్తే అమ్మ ఎంతో సంతోషిస్తుంది. మణిద్వీపానికి చేరుకోవడానికి మనము ముందు అడుగులో ఉంటాము.
ఈ కదంబ వృక్షానికి పురాణాల్లో రెండు రకాల పేర్లు ఉన్నాయి. ఉత్తరభారతంలో దీన్ని కృష్ణవృక్షమనీ, దక్షిణభారతంలో పార్వతీవృక్షమనీ అంటారు. ఈ వృక్షానికి కృష్ణుడికీ మంచి అనుబంధం ఉంది. రాధాకృష్ణుల ముచ్చట్లు ఈ వృక్షం నీడలోనే జరిగాయంటారు. అందుకే కృష్ణవృక్షం అంటారని పురాణాలు చెబుతున్నాయి. దక్షిణాదిలో అమ్మవారిని “'కదంబ వనవాసిని” అంటారు. కదంబ వృక్షానికి 'ఓం శక్తిరూపిత్రై నమః అనే మంత్రంతో పూజ చేసినటైతే రోగనివారణ జరుగుతుందని చెబుతారు పండితులు.
గ్రహదోషాలు తొలగించుకోవడానికి అమ్మవారి స్వరూపమైన కదంబ వృక్షానికి పసుపు, కుంకుమలు, పూలతో అర్చన చేయాలి. అలా పూజ చేసిన తర్వాత పెరుగన్నాన్ని పార్వతీదేవికి నివేదించాలి.
హనుమంతుడి పుట్టుకకు మూలం కదంబం. అంతేకాదు, సాక్షాత్తు పార్వతీ స్వరూపం ఈ వృక్షం. దక్షిణాదిలో అమ్మవారిని 'కదంబ వనవాసిని’ అని, అలాగే నేటి మీనాక్షి అమ్మవారి ఆలయం ఉన్న ప్రాంతమే కదంబవనం అని అంటారు. ఏది ఏమైనా అన్నాచెల్లెళ్ళు నారాయణా నారాయణిలకూ, ఈ వృక్షానికీ చాలా సంబంధం ఉందని చెబుతారు.
-పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
టాపిక్