Devata vrukshalu: దేవతా వృక్షాలని ఏ చెట్లని అంటారు? ఏ చెట్టులో ఏ దేవుడు ఉంటాడో తెలుసా?-devata vrukshalu list why these trees called divine trees ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Devata Vrukshalu: దేవతా వృక్షాలని ఏ చెట్లని అంటారు? ఏ చెట్టులో ఏ దేవుడు ఉంటాడో తెలుసా?

Devata vrukshalu: దేవతా వృక్షాలని ఏ చెట్లని అంటారు? ఏ చెట్టులో ఏ దేవుడు ఉంటాడో తెలుసా?

Gunti Soundarya HT Telugu
Feb 20, 2024 02:06 PM IST

Devata vrukshalu: హిందూ ధర్మ శాస్త్రం ప్రకారం కొన్ని చెట్లలో దేవుళ్ళు ఉంటారని నమ్ముతారు. ఏ చెట్టులో ఏ దేవతలు, దేవుళ్ళు కొలువై ఉన్నారో తెలుసా?

దేవతా వృక్షాలు
దేవతా వృక్షాలు (unsplash)

Devata vrukshalu: హిందూ శాస్త్రం ప్రకారం ఎక్కువ మంది రావి, శమీ చెట్లకు పూజ చేస్తారు. హిందూ మతంలో కొన్ని చెట్లకి ప్రాముఖ్యత ఉంటుంది. వాటిలో దేవతలు, దేవుళ్ళు నివసిస్తారని నమ్ముతారు. కొన్ని చెట్లు, మొక్కలు పవిత్రమైన చెట్లుగా పూజిస్తారు. అందుకే అటువంటి వాటిని దేవతా వృక్షాలుగా చెప్తారు. హిందూ ధర్మ శాస్త్రం ప్రకారం ఏ చెట్టులో ఏ దేవతలు కొలువై ఉంటారో తెలుసుకుందాం.

తులసి

పవిత్రమైన మొక్కల జాబితాలో తొలి స్థానం తులసికి ఉంటుంది. దాదాపు ప్రతీ ఒక్కరి ఇంట్లో ఉంటుంది. హిందూ మతంలో తులసి అత్యంత పవిత్రమైన మొక్క. విష్ణుమూర్తికి ప్రీతికరమైనదని చెప్తారు. అందుకే విష్ణువును పూజించేటప్పుడు తప్పనిసరిగా తులసి ఆకులు సమర్పిస్తారు. ఇవి లేకుండా పూజ చేస్తే అది సంపూర్ణంగా భావిస్తారు. ఖచ్చితంగా విష్ణువుకు సమర్పించే భోగంలో తులసి చేర్చాలి. అది మాత్రమే కాదు తులసి మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తుందని అంటారు. ఏ ఇంట్లో అయితే తులసి మొక్క ఉంటుందో ఆ ఇంత సుఖ సంతోషాలు ఉంటాయని నమ్ముతారు.

రావి చెట్టు

చాలా దేవాలయాలలో రావి చెట్టు ఉంటుంది. చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి దీపాలు వెలిగిస్తారు. అందుకు కారణం రావి చెట్టులో 22 కోట్ల మంది దేవతలు నివసిస్తారని భక్తుల విశ్వాసం. ఈ చెట్టుని కల్ప వృక్షం అని కూడా పిలుస్తారు. జాతకంలో గ్రహ దోషాలు ఉంటే వాటి నుంచి బయట పడేందుకు రావి చెట్టుకు పూజ చేస్తారు. రావి చెట్టు కింద నెయ్యి దీపం వెలిగిస్తే శుభం జరుగుతుందని, పాపాలు నశిస్తాయని నమ్ముతారు. ఈ చెట్టుని అశ్వత్థ చెట్టు అని పిలుస్తారు. అశ్వత్థనారాయణుడు అంటే విష్ణుమూర్తి. ప్రతి శనివారం రావి చెట్టు కింద దీపం వెలిగిస్తే దోషాలు తొలగిపోతాయని చెప్తారు.

మర్రి చెట్టు

పవిత్రమైన చెట్టుగా మర్రి చెట్టుని భావిస్తారు. దీన్నే వట వృక్షం అంటారు. మర్రి చెట్టులో సృష్టికర్త శివుడు ఉంటాడని అంటారు. సంతానం లేని దంపతులు మర్రి, రావి చెట్టుకి ఊయల కడితే సంతాన ప్రాప్తి కలుగుతుందని నమ్ముతారు. ఉపవాసం ఉన్న రోజు మర్రి చెట్టుని పూజిస్తారు.

అశోక వృక్షం

కామదేవుడికి ప్రతీకగా భావించే చెట్టు అశోక వృక్షం. ఈ చెట్టు ఆకులు ఇంట్లో పెట్టుకుంటే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని నమ్ముతారు. బౌద్ధ మతంలో అశోక చెట్టుకు అధిక ప్రాధన్యత ఉంటుంది. అశోక అంటే శోకం లేనిదని అర్థం. అందుకే ఈ చెట్టుని పూజించడం మంచిదని చెప్తారు. అశోక చెట్టులో శివుడు ఉంటాడని నమ్ముతారు. ఈ చెట్టు నాటితే బాధల నుంచి ఉపశమనం కలుగుతుందని విశ్వాసం. ఈ చెట్టు ఇంట్లో ఉంటే కుజ దోషం తొలగిపోతుందని అంటారు.

శమీ వృక్షం

శమీ చెట్టుని జమ్మి చెట్టు అని కూడా పిలుస్తారు. శని దేవుడి అనుగ్రహం పొందటం కోసం శమీ మొక్కని నాటలని అంటారు. ఈ చెట్టు శని దేవుడికి ఎంతో ప్రీతికరమైనది. రామాయణం, మహా భారతంలో కూడా ఈ చెట్టు గురించి ప్రస్తావన ఉంది. ఈ చెట్టుని పూజించిన తర్వాత ఏదైనా పని తలపెడితే అందులో విజయం కలుగుతుంది.

ఉసిరి

మహా విష్ణువు స్వరూపంగా ఉసిరి చెట్టుని పూజిస్తారు. కార్తీక మాసంలో అందుకే ఈ చెట్టు కింద కూర్చుని వనభోజనాలు చేస్తారు. ఈ మాసంలో తప్పనిసరిగా ఉసిరి దీపాలు వెలిగిస్తారు. మతపరంగా మాత్రమే కాదు ఔషధ గుణాలు కూడా కలిగి ఉన్న ఉసిరికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది.