RCB Playoffs Chances: ఆర్సీబీ ప్లేఆఫ్స్ అవకాశాలు.. చెన్నై సూపర్ కింగ్స్‌పై ఇలా గెలిస్తే టాప్ 4లోకి..-ipl 2024 rcb playoffs chances royal challengers bengaluru needs to win match against chennai super kings ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Rcb Playoffs Chances: ఆర్సీబీ ప్లేఆఫ్స్ అవకాశాలు.. చెన్నై సూపర్ కింగ్స్‌పై ఇలా గెలిస్తే టాప్ 4లోకి..

RCB Playoffs Chances: ఆర్సీబీ ప్లేఆఫ్స్ అవకాశాలు.. చెన్నై సూపర్ కింగ్స్‌పై ఇలా గెలిస్తే టాప్ 4లోకి..

Hari Prasad S HT Telugu
May 13, 2024 08:46 AM IST

RCB Playoffs Chances: ఐపీఎల్ 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్లేఆఫ్స్ చేరే అవకాశాలు ఇంకా ఉన్నాయా? చెన్నై సూపర్ కింగ్స్ పై గెలవడంతోపాటు మరో రెండు జట్ల గెలుపోటములపై ఇది ఆధారపడి ఉంది.

ఆర్సీబీ ప్లేఆఫ్స్ అవకాశాలు.. చెన్నై సూపర్ కింగ్స్‌పై ఇలా గెలిస్తే టాప్ 4లోకి..
ఆర్సీబీ ప్లేఆఫ్స్ అవకాశాలు.. చెన్నై సూపర్ కింగ్స్‌పై ఇలా గెలిస్తే టాప్ 4లోకి.. (AFP)

RCB Playoffs Chances: ఐపీఎల్ 2024లో మొదట వరుసగా ఓడి తర్వాత వరుసగా ఐదు మ్యాచ్ లలో గెలిచిన ఆర్సీబీ ప్లేఆఫ్స్ చేరుతుందా? ఆ టీమ్ కు ఇంకా టాప్ 4లోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయా? అలా చేయాలంటే చెన్నై సూపర్ కింగ్స్ తో మ్యాచ్ లో ఎలా గెలవాలి? సన్ రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ టీమ్స్ నుంచి ఆర్సీబీ ఏం ఆశిస్తోంది? ఇలా వివరాలన్నీ ఇక్కడ చూడండి.

ఆర్సీబీ ప్లేఆఫ్స్ చేరాలంటే..

ఐపీఎల్ 2024లో ఆర్సీబీ ప్రస్థానం ఓ అద్భతమనే చెప్పాలి. నెల రోజులకుపైగా పాయింట్ల టేబుల్లో అట్టడుగున ఉన్న ఆ జట్టు తర్వాత వరుసగా ఐదు విజయాలతో ఐదో స్థానంలోకి దూసుకొచ్చింది. ఈసారి లీగ్ నుంచి బయటికెళ్లిపోయే తొలి టీమ్ అవుతుందనుకుంటే.. ఇప్పుడు ప్లేఆఫ్స్ రేసులోకే వచ్చేసింది. 13 మ్యాచ్ లలో 6 విజయాలతో 12 పాయింట్లు, 0.387 నెట్ రన్ రేట్ తో ఐదో స్థానంలో ఉంది.

మరి ఆ జట్టు ఇప్పుడు ప్లేఆఫ్స్ చేరాలంటే ఏం చేయాలన్నది ఆసక్తికరంగా మారింది. అయితే ఇది అంత సులువైన పనేమీ కాదు. ఐదు సార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ తో తన చివరి మ్యాచ్ లో ఘనంగా గెలవడంతోపాటు మరో రెండు జట్ల సహకారం కూడా దీనికి అవసరం. సీఎస్కే ప్రస్తుతం 13 మ్యాచ్ లలో 14 పాయింట్లు, 0.528 నెట్ రన్ రేట్ తో మూడో స్థానంలో ఉంది.

ఆర్సీబీ చివరి మ్యాచ్ కంటే ముందు సన్ రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ చేతుల్లో ఆ టీమ్ ప్లేఆఫ్స్ అవకాశాలు ఆధారపడి ఉంటాయి. సన్ రైజర్స్ తమ చివరి రెండు మ్యాచ్ లలో కనీసం ఒకటి లేదా రెండు మ్యాచ్ లలో గెలిచి మూడో స్థానానికి చేరాలి. లక్నో సూపర్ జెయింట్స్ తమ రెండు మ్యాచ్ లలో ఒకటి కంటే ఎక్కువ గెలవకూడదు.

అప్పుడు ఆర్సీబీ, సీఎస్కే మధ్య ప్లేఆఫ్స్ కోసం ఎలిమినేటర్ లాంటి మ్యాచ్ జరుగుతుంది. ఆ మ్యాచ్ లోనూ సీఎస్కే నెట్ రన్ రేట్ మెరుగ్గా ఉండటంతో ఆ జట్టును ఆర్సీబీ కనీసం 18 పరుగులతో ఓడించాలి. అది కూడా మొదట ఆర్సీబీ బ్యాటింగ్ చేసి 200 పరుగులు చేసింది అనుకుంటు. అదే చెన్నై మొదట బ్యాటింగ్ చేసి 201 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది అనుకుంటే.. ఆ లక్ష్యాన్ని 11 బంతులు మిగిలి ఉండగానే ఆర్సీబీ చేజ్ చేయాల్సి ఉంటుంది.

ఆర్సీబీకి కష్టమే కానీ..

ప్రస్తుతం ఉన్న పరిస్థితి చూస్తే ఆర్సీబీకి ఇది అంత సులువైన పని కాదనిపిస్తోంది. ముందుగా సన్ రైజర్స్, లక్నో సూపర్ జెయింట్స్ నుంచి ఆర్సీబీకి అనుకూల ఫలితాలు రావాల్సి ఉంటుంది. సన్ రైజర్స్ తన చివరి రెండు మ్యాచ్ లలో గుజరాత్ టైటన్స్, పంజాబ్ కింగ్స్ లతో ఆడాల్సి ఉంది. వీటిలో ఒక్కటి గెలిచినా సన్ రైజర్స్ ప్లేఆఫ్స్ చేరుతుంది.

మరోవైపు లక్నో సూపర్ జెయింట్స్ కూడా రేసులో ఉన్నా.. వాళ్ల నెట్ రన్ రేట్ -0.769గా ఉండటంతో మిగిలి రెండు మ్యాచ్ లలో ఘనంగా గెలవాల్సి ఉంటుంది. ఆ టీమ్ రెండూ గెలిస్తే ఆర్సీబీ పనైపోయినట్లే. ఇప్పటికీ గుజరాత్ టైటన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ కు కూడా సాంకేతికంగా అవకాశాలు ఉన్నా.. సీఎస్కే, ఆర్సీబీ, సన్ రైజర్స్, లక్నోలను మించి ఆ రెండు టీమ్స్ మెరుగైన నెట్ రన్ రేట్ తో ప్లేఆఫ్స్ చేరడం అంత సులువు కాదు.

ఇక ఆర్సీబీ విషయానికి వస్తే సన్ రైజర్స్, లక్నోల నుంచి అనుకూల ఫలితాలు వచ్చినా.. చివరి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ పై గెలవడం మామూలు విషయం కాదు. అది కూడా నెట్ రన్ రేట్ ను దృష్టిలో పెట్టుకొని ఇంతకుముందు చెప్పినట్లు గెలవాలంటే ఆర్సీబీ తమ సర్వశక్తులూ ఒడ్డాల్సిందే. మరి ఈ సవాలుకు డుప్లెస్సి అండ్ టీమ్ ఎలా సిద్ధమవుతుందో చూడాలి.

Whats_app_banner