IPL 2024: కీలక సమయంలో ఐపీఎల్ జట్లకు ఇంగ్లండ్ ప్లేయర్ల షాక్.. వెళ్లిపోతున్న ఈ ఆటగాళ్లు.. రాజస్థాన్‍కు బైబై చెప్పిన బట్లర్
IPL 2024 - England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లు కొందరు ఐపీఎల్ 2024 నుంచి వైదొలుగుతున్నారు. ఇప్పటికే ఒక్కొక్కరుగా స్వదేశానికి బయలుదేరుతున్నారు. దీంతో ఐపీఎల్ జట్లకు ఇబ్బందిగా మారింది.
IPL 2024: ఐపీఎల్ 2024 సీజన్ కీలక దశకు చేరుకుంది. లీగ్ దశ మ్యాచ్‍లు ముగింపు దశకు చేరుకుంటున్నాయి. ప్లేఆఫ్స్‌కు సమయం ఆసన్నమవుతోంది. అయితే, ఈ తరుణంలో కొందరు స్టార్ ఇంగ్లండ్ ప్లేయర్ల నుంచి ఐపీఎల్ జట్లకు షాక్ ఎదురైంది. టీ20 ప్రపంచకప్ ఆడాల్సి ఉన్న ఇంగ్లండ్ ఆటగాళ్లు ఐపీఎల్‍ను వీడి స్వదేశానికి వెళ్లిపోతున్నారు. వరల్డ్ కప్ సన్నద్దత కోసం స్వదేశానికి చేరుతున్నారు. రాజస్థాన్ రాయల్స్ స్టార్ ప్లేయర్ జోస్ బట్లర్ సహా మరికొందరు ప్లేయర్లు నేడు (మే 13) ఇంగ్లండ్‍కు బయలుదేరారు. ఆ వివరాలివే..
జూన్‍లో జరగనున్న టీ20 ప్రపంచకప్‍కు సన్నద్ధతగా పాకిస్థాన్‍తో స్వదేశంలో నాలుగు టీ20ల సిరీస్ ఆడనుంది ఇంగ్లండ్. మే 22న ఈ సిరీస్ మొదలుకానుంది. అయితే, ఈ సిరీస్ సహా టీ20 ప్రపంచకప్ సన్నద్ధత కోసం ఇప్పటి నుంచే ఇంగ్లండ్‍కు బయలుదేరుతున్నారు ప్లేయర్లు. ప్రపంచకప్ టోర్నీ కోసం ఇంగ్లండ్ జట్టులో ఉన్న ప్లేయర్లు ఐపీఎల్ జట్లను వీడుతున్నారు.
రాజస్థాన్‍కు ఎదురుదెబ్బ
ఐపీఎల్ 2024 సీజన్‍లో రాజస్థాన్ రాయల్స్ జోరు మీద ఉంది. ఆ జట్టు ప్లేఆఫ్స్ చేరడం ఇప్పటికే దాదాపు ఖరారైంది. అయితే, ఈ తరుణంలో ఇంగ్లండ్ కెప్టెన్ అయిన జాస్ బట్లర్ నేడు స్వదేశానికి తిరిగి వెళ్లిపోయాడు. బట్లర్‌కు వీడ్కోలు పలుకుతూ ఓ వీడియో కూడా పోస్ట్ చేసింది రాజస్థాన్ రాయల్స్. మిస్ అవుతామంటూ బైబై చెప్పింది. సీనియర్ ఓపెనర్ బట్లర్ వెళ్లడం ఆర్ఆర్ జట్టుకు ఎదురుదెబ్బలా మారింది.
ఆర్సీబీ నుంచి ఇద్దరు
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును కూడా ఇంగ్లండ్ ఆల్ రౌండర్ విక్ జాక్స్, పేసర్ రీస్ టాప్లీ వీడారు. వారిద్దరూ నేడు స్వదేశానికి బయలుదేరారు. ఫామ్‍లో ఉన్న జాక్స్ వెళ్లిపోవడం ఆర్సీబీకి ఇబ్బందిగా మారింది. ప్లేఆఫ్స్ చేరాలంటే లీగ్ దశ ఆఖరి మ్యాచ్‍లో తప్పక గెలువాల్సిన దశలో జాక్స్ దూరమయ్యాడు.
చెన్నై సూపర్ కింగ్స్ ఆల్ రౌండర్ మోయిన్ అలీ, పంజాబ్ కింగ్స్ కెప్టెన్ సామ్ కరన్, బ్యాటర్ జానీ బెయిర్ స్టో, కోల్‍కతా నైట్‍రైడర్స్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ కూడా త్వరలో ఇంగ్లండ్ వెళ్లనున్నారు. పంజాబ్ ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకోవడంతో పెద్దగా ప్రభావం ఉండదు. అయితే, ప్లేఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకున్న కోల్‍కతాకు సాల్ట్ దూరం కానుండడం ఎదురుదెబ్బ. కోల్‍కతా విజయాల్లో సాల్ట్ కీలకపాత్ర పోషించాడు. మోయిన్ అలీ వెళ్లిపోతే చెన్నై కూడా ఇబ్బందిగా మారనుంది.
ఇంగ్లండ్, పాకిస్థాన్ మధ్య మే 22 నుంచి నాలుగు టీ20ల సిరీస్ మొదలుకానుంది. మే 22న తొలి టీ20, మే 25న రెండో మ్యాచ్ జరగనుంది. మే 28న మూడో టీ20, మే 30న ఆఖరి టీ20 సాగనుంది. మే 22వ తేదీకి ఇంకా సమయం ఉన్నా.. ఆటగాళ్లు గాయపడకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తగా ఇప్పటి నుంచే స్వదేశానికి రప్పించుకుంటోంది ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు.
జూన్ 2వ తేదీన నుంచి జూన్ 29వ తేదీ వరకు వెస్టిండీస్, అమెరికా వేదికలుగా టీ20 ప్రపంచకప్ జరగనుంది. జూన్ 4న స్కాట్‍ల్యాండ్‍తో మ్యాచ్‍తో ప్రపంచకప్ వేటను ఇంగ్లండ్ మొదలుపెట్టనుంది.
ఇలా ఐపీఎల్ మధ్యలో వదిలివెళ్లే విదేశీ ఆటగాళ్లపై చర్యలు తీసుకోవాలని బీసీసీఐకు సలహా ఇచ్చారు భారత దిగ్గజం సునీల్ గవాస్కర్. టోర్నీ నుంచి మధ్యలో నిష్కమించే ప్లేయర్లకు ఇచ్చే మొత్తంలో కోత విధించేలా నిబంధన తీసుకురావాలని అన్నారు.