IPL 2024 Playoffs: ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్.. 8 మ్యాచ్‌లు, 7 టీమ్స్, 3 బెర్తులు.. ఎవరి అవకాశాలు ఎలా ఉన్నాయంటే?-ipl 2024 playoffs scenario 8 league matches left 7 team still in contention for 3 playoffs berths ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ipl 2024 Playoffs: ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్.. 8 మ్యాచ్‌లు, 7 టీమ్స్, 3 బెర్తులు.. ఎవరి అవకాశాలు ఎలా ఉన్నాయంటే?

IPL 2024 Playoffs: ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్.. 8 మ్యాచ్‌లు, 7 టీమ్స్, 3 బెర్తులు.. ఎవరి అవకాశాలు ఎలా ఉన్నాయంటే?

Hari Prasad S HT Telugu
May 13, 2024 02:09 PM IST

IPL 2024 Playoffs: ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్ రేసు ఎప్పటిలాగే ఈసారి కూడా రసవత్తరంగా మారింది. మరో 8 లీగ్ మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉండగా.. ఇంకా మిగిలి ఉన్న మూడు బెర్తుల కోసం ఏడు టీమ్స్ పోటీ పడుతుండటం విశేషం.

ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్.. 8 మ్యాచ్‌లు, 7 టీమ్స్, 3 బెర్తులు.. ఎవరి అవకాశాలు ఎలా ఉన్నాయంటే?
ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్.. 8 మ్యాచ్‌లు, 7 టీమ్స్, 3 బెర్తులు.. ఎవరి అవకాశాలు ఎలా ఉన్నాయంటే? (AFP)

IPL 2024 Playoffs: ఐపీఎల్ 2024 లీగ్ దశ మ్యాచ్‌లు చివరి వారానికి వచ్చేశాయి. వచ్చే ఆదివారం (మే 19)తో లీగ్ స్టేజ్ ముగుస్తుంది. అయితే ఇప్పటి వరకూ కేవలం ఒకే ఒక్క ప్లేఆఫ్స్ బెర్త్ మాత్రమే ఖాయమైంది. కోల్‌కతా నైట్ రైడర్స్ 18 పాయింట్లతో ఈ బెర్త్ ఖాయం చేసుకుంది. లీగ్ స్టేజ్ లో మరో 8 మ్యాచ్ లు మాత్రమే మిగిలి ఉండగా.. మిగిలిన మూడు బెర్తుల కోసం ఏడు జట్లు పోటీ పడుతున్నాయి.

ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్ రేసు ఇలా..

ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్ కు కేకేఆర్ చేరుకోగా.. ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ ఇంటికెళ్లిపోయాయి. ఇక మిగిలిన వాటిలో రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటన్స్, లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మూడు బెర్తుల కోసం పోటీ పడుతున్నాయి. ఏ టీమ్ అవకాశాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

రాజస్థాన్ రాయల్స్

రాజస్థాన్ రాయల్స్ ఇప్పటి వరకూ 12 మ్యాచ్ లలు 8 విజయాలు, 4 ఓటములతో16 పాయింట్లు, 0.349 నెట్ రన్ రేట్ తో రెండో స్థానంలో ఉంది. మిగిలిన రెండింట్లో ఒక్కటి గెలిచినా ప్లేఆఫ్స్ వెళ్తుంది. రెండు మ్యాచ్ లు ఓడినా కూడా అవకాశం ఉంది. సన్ రైజర్స్ మిగిలిన రెండు మ్యాచ్ లలో ఒకటి ఓడాలి. లక్నో కూడా ఆర్ఆర్ నెట్ రన్ రేట్ ను అధిగమించకూడదు. రాజస్థాన్ రాయల్స్ ఇంకా మే 15న పంజాబ్ కింగ్స్ తో, మే 19న కేకేఆర్ తో ఆడాల్సి ఉంది.

చెన్నై సూపర్ కింగ్స్

చెన్నై సూపర్ కింగ్స్ ఈ మధ్యే రాజస్థాన్ రాయల్స్ పై గెలిచి మళ్లీ ప్లేఆఫ్స్ రేసులో నిలిచింది. ఆ టీమ్ 13 మ్యాచ్ లలో 7 గెలిచి, ఆరు ఓడి 14 పాయింట్లు, 0.528 నెట్ రన్ రేట్ తో మూడో స్థానంలో ఉంది. ఆర్సీబీతో మే 18న చివరి మ్యాచ్ ఆడనుంది. ఆ మ్యాచ్ లో గెలిస్తే సులువుగా ప్లేఆఫ్స్ వెళ్తుంది. ఒకవేళ ఓడితే మాత్రం ఆర్సీబీ తమ నెట్ రన్ రేట్ ను అధిగమించకుండా చూసుకోవాలి.

సన్ రైజర్స్ హైదరాబాద్

సన్ రైజర్స్ హైదరాబాద్ 12 మ్యాచ్ లలో 7 గెలిచి, 5 ఓడి, 14 పాయింట్లు, 0.406 నెట్ రన్ రేట్ తో నాలుగో స్థానంలో ఉంది. ఒక్క మ్యాచ్ గెలిచినా ప్లేఆఫ్స్ ఖాయమవుతుంది. మే 16న గుజరాత్ టైటన్స్ తో, మే 19న పంజాబ్ కింగ్స్ తో ఆడాల్సి ఉంది. రెండూ ఓడితే మాత్రం మిగతా జట్ల ఫలితాలు, నెట్ రన్ రేట్ పై ఆధారపడాల్సి ఉంటుంది.

లక్నో సూపర్ జెయింట్స్

లక్నో సూజర్ జెయింట్స్ కూడా 12 మ్యాచ్ లలో 6 గెలిచి, 6 ఓడి.. 12 పాయింట్లు, -0.769 నెట్ రన్ రేట్ తో ఏడో స్థానంలో ఉంది. ఆ టీమ్ ఇంకా మే 14న ఢిల్లీతో, మే 17న ముంబైతో ఆడాల్సి ఉంది. వీళ్ల నెట్ రన్ రేట్ దారుణంగా ఉండటంతో కచ్చితంగా చివరి రెండు మ్యాచ్ లు గెలిస్తేనే ప్లేఆఫ్స్ చేరే అవకాశం ఉంటుంది. లేదంటే ఇంటికెళ్లిపోవాల్సిందే.

ఢిల్లీ క్యాపిటల్స్

ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ 13 మ్యాచ్ లలో 6 గెలిచి, 12 పాయింట్లు, -0.482 నెట్ రన్ రేట్ తో ఆరో స్థానంలో ఉంది. ఆ టీమ్ చివరి మ్యాచ్ ను మే 14న లక్నోతో ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్ కచ్చితంగా గెలవాలి. అయినా ఆ టీమ్ ఆర్సీబీ ఫలితం కోసం చూడాల్సి ఉంటుంది.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

ఆర్సీబీ తాజాగా డీసీపై విజయంపై ఐదో స్థానానికి వచ్చింది. ఆ టీమ్ 13 మ్యాచ్ లలో 6 గెలిచి, 12 పాయింట్లు, 0.387 నెట్ రన్ రేట్ తో ఉంది. చివరి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ పై కచ్చితంగా గెలవాల్సి ఉంటుంది. అదే సమయంలో చెన్నై సూపర్ కింగ్స్ నెట్ రన్ రేట్ అధిగమించాలి. ఇది జరగాలంటే ఆ టీమ్ 200 చేస్తే కనీసం 18 పరుగులతో గెలవాలి. ఇక 201 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాల్సి వస్తే 11 బంతులు మిగిలి ఉండగానే గెలవాలి. అలా అయితేనే ముందడుగు వేస్తుంది.

గుజరాత్ టైటన్స్

గత రెండు సీజన్లలోనూ ఫైనల్ చేరిన గుజరాత్ టైటన్స్ ప్రస్తుతం 12 మ్యాచ్ లలో ఐదు గెలిచి, 7 ఓడి 10 పాయింట్లు, -1.063 నెట్ రన్ రేట్ తో ఎనిమిదో స్థానంలో ఉంది. ఆ టీమ్ ఇంకా సన్ రైజర్స్, కేకేఆర్ తో ఆడాల్సి ఉంది. ప్లేఆఫ్స్ రేసులో ఉండాలంటే ఈ రెండూ కచ్చితంగా గెలవాలి. అదే సమయంలో నెట్ రన్ రేట్ మెరుగుపరచుకోవడంతోపాటు మిగిలిన జట్ల ఫలితాలు తమకు అనుకూలంగా రావాలని కోరుకోవాలి.

Whats_app_banner