Tulasi puja vidhanam: తులసి మొక్కకి నీరు ఎప్పుడు సమర్పించకూడదు? ఇలా పూజిస్తే ఆర్థిక సమస్యలే ఉండవు
Tulasi puja vidhanam: తులసి మొక్కకు ఎప్పుడు నీరు సమర్పించకూడదు. తులసిని ఎలా పూజించాలి? ఎలా పూజిస్తే ఆర్థిక సంక్షోభం నుంచి బయట పడతారో తెలుసా?
Tulasi puja vidhanam: ప్రతి ఒక్కరి ఇంట్లో తప్పని సరిగా తులసి మొక్క ఉంటుంది. కొంతమంది ఇంటి ముందు పెట్టుకుంటారు. ఆ సదుపాయం లేని వాళ్ళు కుండీలో తులసి మొక్క పెట్టుకుని ప్రతి రోజు పూజిస్తారు. హిందూ మతంలో తులసి మొక్కకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది.
తులసి మొక్క ఇంట్లో ఉంటే ప్రతికూల శక్తులు ఉండవని నమ్ముతారు. ఇది ఏ ఇంట్లో అయితే ఉంటుందో అక్కడ విష్ణువు, లక్ష్మీదేవి నివాసం ఉంటారని నమ్ముతారు. అందుకే ప్రతిరోజు తులసి కోటకి పూజ చేస్తారు. అయితే తులసి మొక్కను పూజించేటప్పుడు తప్పని సరిగా సరైన నియమాలు పాటించాలి. అప్పుడే మనం చేసిన పూజకి ఫలితం దక్కుతుంది. తులసి మొక్కకి ఎప్పుడు నీరు పోయాలి? ఏ రోజు తులసి ఆకులు కోయకూడదు అనే విషయాలు తెలుసుకోవాలి.
తులసికి ఎప్పుడు నీరు సమర్పించాలి?
ఇతర మొక్కలకు పోసినట్టు ఎప్పుడంటే అప్పుడు తులసి మొక్కకు నీరు పోయాకూడదు. సూర్యోదయ సమయంలో స్నానం చేసిన తర్వాత ఈ మొక్కకు నీరు పోయాలి. ఇలా చేస్తే ఆ ఇంట ఆనందం, సంతోషంతో నిండిపోతుంది. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది.
చాలా మంది ప్రతిరోజు తులసి మొక్కకు నీళ్ళు పోస్తారు. కానీ అలా చేయడం మంచిది కాదు. ఆదివారం తులసి మొక్కకు నీరు పోయాకూడదు. ఎందుకంటే ఆరోజు లక్ష్మీదేవి ఉపవాసం ఉంటుందట. నీరు పోయడం వల్ల లక్ష్మీదేవి ఉపవాసం భగ్నం చేసినట్టు అవుతుంది. ఫలితంగా అమ్మవారి ఆశీస్సులు లభించవు. అది మాత్రమే కాదు ఏకాదశి నాడు కూడా నీరు పూయకూడదు. ఏకాదశి విష్ణువుకి అంకితం చేసిన రోజు. ఏకాదశి రోజు తులసి నీళ్ళు కూడా ముట్టుకోకుండా విష్ణుమూర్తికి ఉపవాసం ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఆరోజు కూడా నీరు సమర్పించకూడదు.
తులసి మొక్కని ఎలా పూజించాలి?
తులసిని ప్రతిరోజు పూజిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. రాగి లేదా వెండి పాత్రలో నీటిని తీసుకుని భక్తి మనస్పూర్తిగా తులసికి నెమ్మదిగా నీరు సమర్పించాలి. ఈ మంత్రం పఠిస్తూ నీరు పోయాలి.
దేవీత్వం నిరితా పూర్వమర్చితసి మునీశ్వరైః
నమో నమస్తే తులసి సిన్ హర్ హరిప్రియం
అని పఠించాలి. నీరు పోసిన తర్వాత పసుపు, కుంకుమ వేసి కొన్ని అక్షితలు, తులసి ఆకులు తీసుకుని నమస్కరించి మొక్క మొదట్లో పెట్టాలి. నెయ్యి దీపం వెలిగించి ధూపం వేసి హారతి ఇవ్వాలి. పూజలో ఏమైనా పొరపాట్లు జరిగితే మన్నించమని వేడుకోవాలి. తులసి వేరు దగ్గర ఉన్న మట్టి తీసుకుని దాన్ని బొట్టుగా పెట్టుకుంటే మంచిది. ప్రతిరోజు సాయంత్రం తులసి దగ్గర నెయ్యి దీపం వెలిగించడం మర్చిపోకూడదు. తులసిని ఇలా పూజించడం వల్ల ఆర్థిక సంక్షోభం నుంచి బయట పడతారు. లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు.
ఆడవాళ్ళు నెలసరి సమయంలో మాత్రం తులసి కోట దగ్గరకి వెళ్లకూడదు. బహిష్టు అయిపోయిన తర్వాత తలంటు స్నానం చేసిన తర్వాత తులసి మొక్కకు పూజ చేయాలి. తులసి మొక్క దగ్గర ఎప్పుడు వాడిపోయిన పూలు ఉండకూడదు. ఎప్పటికప్పుడు తులసి కోట శుభ్రం చేసుకుంటూ ఉండాలి. అలాగే తులసి మొక్క ఎండిపోకుండా చూసుకోవాలి.