Tulasi leaves: తులసి ఆకులు ఏ రోజు కోయకూడదు? కుండీలోనే తులసి మొక్క ఎందుకు పెడతారు?
Tulasi leaves: దైవ కార్యాలలో అత్యంత పవిత్రమైన మొక్క తులసి. ఇది లేకుండా విష్ణు మూర్తికి చేసే పూజ అసంపూర్ణంగా నిలుస్తుంది. అయితే కొన్ని రోజుల్లో తులసి ఆకులు తెంపకూడదు. అలా చేస్తే అశుభ ఫలితాలు ఏర్పడతాయి.
Tulasi leaves: పవిత్రమైన మొక్కల జాబితాలో తులసి ముందు ఉంటుంది. ప్రతి ఒక్కరి ఇంట్లో తులసి మొక్కకి తప్పని సరిగా పూజలు చేస్తారు. వాస్తు శాస్త్రంలో కూడా తులసి మొక్కకి అధిక ప్రాధాన్యత ఉంటుంది. శ్రీ హరి విష్ణు మూర్తికి తులసి లేకుండా భోగం సమర్పిస్తే ఆ పూజ అసంపూర్తిగా ఉన్నట్టే.
తులసిని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. ఇంట్లోని తులసి మొక్క పచ్చగా ఉంటే ఆ కుటుంబం సుఖ సంతోషాలతో ఉంటుందని నమ్ముతారు. అయితే తులసి మొక్కని పూజించేటప్పుడు కొన్ని నియమాలు తప్పనిసరిగా తెలుసుకోవాలి. మహా విష్ణువు, లక్ష్మీదేవి ఆశీస్సులు పొందాలంటే తులసి మొక్కకి సరైన పద్ధతి ప్రకారం పూజ చేయాలి.
ఆదివారం నీళ్ళు పోయకూడదు
మత విశ్వాసాల ప్రకారం తులసిని రోజూ పూజించాలి. స్నానం చేయకుండా తులసి మొక్కని వాటి ఆకులు తాకడం చేయకూడదు. కొంతమంది తులసి ఆకులు కోసుకుని నోట్లో వేసేసుకుని తింటారు. కానీ స్నానం చేయకుండా ముట్టుకోకూడదు. ఏకాదశి, ఆదివారం రోజుల్లో నారాయణుడి కోసం తులసి మాత ఉపవాసం ఉంటుంది. అందుకే ఆ రోజు తులసి మొక్కకి నీళ్ళు పెట్టకూడదు.
నీళ్ళు పెట్టడం వల్ల తులసి దేవి ఉపవాసం విరమించినట్టు అవుతుంది. అలా చేయడం వల్ల అశుభ ఫలితాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే ఆరోజు నీళ్ళు పెట్టకూడదు. అలాగే ఆ రెండు రోజుల్లో తులసి ఆకులు కోయకూడదు. అదే విధంగా సూర్యాస్తమయం తర్వాత కూడా తులసి ఆకులు తెంపడం, కోయడం వంటివి చేయకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆదివారం తులసి మొక్కకి నీళ్ళు పెట్టడం వాలల ఇంట్లోకి ప్రతికూల శక్తి ప్రవేశిస్తుందని వాస్తు శాస్త్రం చెబుతోంది.
తులసి దగ్గర నెయ్యి దీపం
ఉదయం నిద్రలేవగానే స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించిన తర్వాత తులసి మొక్కకు పూజ చేయాలి. వాటికి పసుపు, కుంకుమ, గంధం వేసి పూజించాలి. ఎరుపు లేదా గులాబీ పువ్వులు సమర్పించాలి. తర్వాత తులసి దగ్గర నెయ్యి దీపం వెలిగించాలి. కుటుంబంలో సుఖ సంతోషాలు, సౌభాగ్యం నిలవాలంటే సాయంత్రం పూట తులసి దగ్గర నెయ్యి దీపం వెలిగించాలి. తులసి మొక్కని సరైన పద్ధతిలో పూజించడం వల్ల లక్ష్మీదేవి, విష్ణుమూర్తి ఆశీస్సులు ఎల్లప్పుడూ లభిస్తాయి.
నేల మీద నాటకూడదు
తులసి మొక్కని పొరపాటున కూడా నేల మీద నాటకూడదు. ఇంటి గుమ్మం కంటే ఎక్కువ ఎత్తులోనే తులసి ఉండాలి. అందుకే చాలా మంది తులసి కోట ఎత్తుగా కట్టించుకుంటారు. తులసి మొక్క ఎండిపోకుండా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. తులసి మొక్క ఎండిపోయిందంటే ఇంట్లో దురదృష్ట సంఘటనలు ఏదో జరుగుతాయని సూచిస్తుంది. తులసి మొక్క దగ్గర ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. ఎండిపోయిన పూలు అసలు ఉండకూడదు. నిత్యం తులసి కోట శుభ్రం చేసుకుంటూ ఉంటాలి.
ఎన్ని మొక్కలు ఉండాలి?
తులసి మొక్క ఇంట్లో ఉంటే చాలా శుభప్రదంగా భావిస్తారు. అలాగే తులసి మొక్కలు ఎన్ని ఉండాలనే దానికి వాస్తు శాస్త్రం వెల్లడించింది. బేసి సంఖ్యలోనే ఇంట్లో తులసి మొక్కలు పెట్టుకోవాలి. ఒకటి, మూడు, ఐదు ఇలా బేసి సంఖ్యలో మాత్రమే ఉండాలి. స్వచ్చత, పవిత్రతకి చిహ్నంగా తులసిని భావిస్తారు. తులసి వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ తో పోరాడేందుకు సహాయపడుతుంది.