Hanuman temple: హనుమంతుడిని స్త్రీగా పూజించే ఏకైక దేవాలయం ఇదే.. ఈ ఆలయం ఎక్కడ ఉందో తెలుసా?
Hanuman temple: హనుమంతుడు పురుషుడని అందరికీ తెలుసు. కానీ ఈ ఆలయంలో మాత్రం దేవతగా పూజిస్తారు. ప్రపంచంలోనే ఉన్న ఇలాంటి ఏకైక ఆలయం ఇదే. అది ఎక్కడ ఉందో తెలుసా?
Hanuman temple: శ్రీరాముడు పరమ భక్తుడు, ధైర్యం, పరాక్రమానికి ప్రతీకగా హనుమంతుడిని పూజిస్తారు. హిందూ సంప్రదాయం ప్రకారం హనుమంతుడిని పురుష మూర్తిగా పూజిస్తారు. కానీ ఇక్కడ మాత్రం హనుమంతుడిని స్త్రీ మూర్తిగా పూజిస్తారు. దేవుడిగా కాకుండా దేవతగా కొలుస్తారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా కానీ ఇది నిజం.
ఈ ఆలయం ఎక్కడ ఉందో తెలుసా?
ఛత్తీస్ గడ్ లోని రతన్ పూర్ లో ఈ గిర్జాబంధ్ ఆలయంలో హనుమంతుడిని దేవతగా పూజిస్తారు. అందుకు కారణం ఆయన బ్రహ్మచర్యం. క్రమ శిక్షణ, స్వీయ నియంత్రణ, స్వచ్చతకు హనుమంతుడు ప్రతీక. ఈ ఆలయం ఇంటీరియర్ చాలా అందంగా ఉంటుంది. కానీ వెలుపలి భాగం చాలా చిన్నగా ఉంటుంది. ఆలయం చుట్టూ ఉన్న ప్రదేశం ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. ఇక్కడ హనుమంతుని స్త్రీ దేవతా విగ్రహం ఉంటుంది. ఏడాది పొడవునా ప్రజలు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. హనుమంతుడిని స్త్రీ పూజించే ఏకైక ఆలయం ఇదే. ఈ ఆలయంలో ఏం కోరుకున్నా అది నెరవేరుతుందని నమ్ముతారు.
గిర్జాబంధ్ వెనుక ఉన్న పురాణ కథ
గిర్జాబంధ్ ఆలయంలో హనుమంతుడిని దేవతగా ప్రతిష్టించడం వెనుక ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. పూర్వం పృథ్వీ దేవ్జు రాజు ఉండేవాడు. ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడ్డాడు. గొప్ప రుషులు, వైద్యులు, సాధువులు కూడా అతని రోగాన్ని నయం చేయలేకపోయారు. ఒకనాడు పృథ్వీ రాజు కలలో హనుమంతుడు కనిపించి తన పేరుని ధ్యానించి ఆలయం నిర్మించమని చెప్పాడట. రాజు తాను చేయగలిగినంతగా హనుమంతుడికి అత్యుత్తమ ఆలయాన్ని నిర్మించాడు.
ఆలయ నిర్మాణం జరిగే సమయంలో హనుమంతుడు మళ్ళీ రాజుకి కలలో కనిపించాడు. ఈసారి అతను సమీపంలోని నీటి కుంట నుంచి విగ్రహాన్ని వెలికితీసి ఆలయంలో ఉంచమని రాజుకి సలహా ఇచ్చాడు. ఆ సలహా ప్రకారం రాజు అదే విధంగా చేశాడు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ విగ్రహం స్త్రీ రూపంలో ఉంది. హనుమంతుడికి ఆజ్ఞ మేరకు రాజు వెంటనే కట్టించిన ఆలయంలో ఈ విగ్రహాన్ని ప్రతిష్టించాడు. అలా చేసిన తర్వాత రాజు అనారోగ్యం తగ్గిపోయింది. అప్పటి నుంచి గిర్జాబంధ్ ఆలయం తీవ్రమైన వ్యాధులని నయం చేయగల ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది. అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు ఇక్కడి వచ్చి సందర్శించుకుంటే రోగాలు నయం అవుతాయని నమ్ముతారు.
హనుమంతుడిని పూజించడం ఎలా?
మంగళవారం నాడు హనుమంతుడిని పూజిస్తారు. ఆయన్ని పూజిస్తే శని వల్ల కలిగే బాధలు కూడా తొలగిపోతాయని నమ్ముతారు. పురాణాల ప్రకారం శని అశుభ దృష్టి పడని వారిలో హనుమంతుడు ఒకడు. బలం, ధైర్యం, రక్షణకు చిహ్నంగా భావిస్తారు. హనుమంతుడిని పూజించడం వల్ల జీవితంలోని అనేక సవాళ్ళని అధిగమించగలుగుతారని విశ్వాసం.
ప్రతిరోజూ హనుమాన్ చాలీసా పఠించడం వల్ల అడ్డంకులు తొలగిపోతాయి. ఆంజనేయుడు ఆశీస్సులు పొందటం కోసం మంగళవారం నాడు కొన్ని పరిహారాలు పాటిస్తే మంచిదని పండితులు చెబుతున్నారు. రామ నామం జపించడం వల్ల హనుమంతుడి ఆశీస్సులు లభిస్తాయి. ఆయన్ని పూజించడం వల్ల జీవితంలో ఎదురయ్యే సంక్షోభాలు అన్ని తొలగిపోతాయి. మంగళవారం ఆంజనేయుడిని పూజించి బెల్లం, పప్పు నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేస్తే మీ కోరికలు నెరవేరతాయి.