Putrada ekadashi: సంతాన ప్రాప్తి కలగాలంటే పుత్రద ఏకాదశి వ్రతం ఆచరించాల్సిందే
Putrada ekadashi: పుత్రద ఏకాదశి వ్రతం ఆచరించడం వల్ల పిల్లలు లేని భార్యాభర్తలకి సంతాన ప్రాప్తి కలుగుతుందని నమ్ముతారు.
Putrada ekadashi: పుష్య మాసంలోని శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని పుత్రద ఏకాదశి జరుపుకుంటారు. ఈ ఏడాది జనవరి 21న పుత్రద ఏకాదశి వచ్చింది. హిందూ ధర్మ శాస్త్రంలో ఒక్కో ఏకాదశికి ఒక్కో ప్రాముఖ్యత ఉంటుంది. అలాగే పుత్రద ఏకాదశికి కూడా ఒక ప్రత్యేకత ఉంది.
పుత్రద ఏకాదశి రోజుని విష్ణువుకి అంకితం చేశారు. ఈరోజు ఉపవాసం ఉండి విష్ణువు, లక్ష్మీదేవిని పూజించడం వల్ల మోక్షం లభిస్తుందని నమ్ముతారు. సంతానం కోసం పెళ్ళయిన వాళ్ళు పుత్రద ఏకాదశి రోజు ఉపవాసం ఉండి విష్ణువుని పూజిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది. పుష్య మాసంలోని శుక్ల పక్ష ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే పుణ్య ఫలం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఈరోజు ఉపవాసం ఉండటం వల్ల చనిపోయిన తర్వాత మోక్షం లభిస్తుంది.
పుత్రద ఏకాదశి తిథి
ఏకాదశి తిథి ప్రారంభం- జనవరి 20, 2024 సాయంత్రం 7.42 గంటల నుంచి జనవరి 21 సాయంత్రం 07.26 గంటల వరకు ఉంటుంది. ఉపవాస విచ్చిన్నం సమయం జనవరి 22 ఉదయం 07.14 గంటల నుంచి 09.16 గంటల వరకు.
ఏకాదశి వ్రత పూజా విధి
తెల్లవారుజామునే నిద్రలేచి స్నానం ఆచరించాలి. ఇంట్లోని పూజ గదిలో దీపం వెలిగించాలి. గంగా జలంతో విష్ణుమూర్తికి అభిషేకం చేయాలి. శ్రీహరికి పూలు, తులసి సమర్పించాలి. వీలైతే ఈరోజు ఉపవాసం ఉండండి. సాత్విక వస్తువులు మాత్రమే భగవంతుడికి నైవేద్యంగా సమర్పించాలి. తులసి లేకుండా విష్ణువుకి భోగం సమర్పించకూడదు. విష్ణువుతో పాటు లక్ష్మీదేవిని పూజించడం వల్ల అమ్మవారి కటాక్షం పొందుతారు.
ఏకాదశి వ్రతం ప్రాముఖ్యత
ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉండటం వల్ల అన్ని రకాల పాపాలు తొలగిపోతాయి. ఉపవాసం ఉండి పూజ చేస్తే అన్ని కోరికలు నెరవేరుతాయి. ఎక్కువ మంది పుత్రద ఏకాదశి రోజు ఉపవాసం సంతానం కోసం చేస్తారు. మత విశ్వాసాల ప్రకారం ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే మోక్షం లభిస్తుందని నమ్ముతారు. విష్ణు సహస్ర నామ పారాయణం చేయాలి. రాత్రి పూట జాగారం చేసి విష్ణువుని భజనలు, కీర్తనలతో స్తుతించడం వల్ల భగవంతుడి ఆశీర్వాదం పొందుతారు. ఈరోజు ఉపవాసం ఉంటే తప్పకుండా పిల్లలు పుడతారని విశ్వసిస్తారు.
పుత్రద ఏకాదశి కథ
పూర్వం సుకేతుమన్ అనే రాజు ఉండేవాడు. తన రాజ్యంలో ఉన్న ప్రజలు అందరూ సంతోషంగా ఉండాలని ఎన్నో పనులు చేసేవాడు. కానీ రాజుకి మాత్రం సంతానం లేదు. సంతానం కోసం రాజు తిరగని పుణ్యక్షేత్రంలేదు. కానీ తన కోరిక మాత్రం నెరవేరదు. ఒకరోజు రాజు తన రాజ్యానికి దగ్గరలో ఉన్న ఒక మహర్షి దగ్గరకి వెళ్ళాడు. ఆయన దగ్గరకి వెళ్ళి తన సమస్య చెప్పుకుని పరిహారం చెప్పాల్సిందిగా కోరాడు. అప్పుడు ఆ మహర్షి పుత్రద ఏకాదశి గురించి చెప్పి ఆరోజు ఉపవాసం ఉంటే మంచిదని సూచించారు.
మహర్షి చెప్పినట్టుగానే రాజు పుత్రద ఏకాదశి వ్రతం ఆచరించాడు. ఇది జరిగిన కొద్ది రోజులకి రాజు భార్య గర్భం దాల్చింది. పండంటి మగబిడ్డకి జన్మనిచ్చింది. అప్పటి నుంచి విష్ణు మూర్తిని పూజిస్తూ పుత్రద ఏకాదశి జరుపుకుంటారు. ఈరోజు చేసే ఉపవాసానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది.