Rishabh Pant IPL Price: నెరవేరిన రిషబ్ పంత్ కల, ఐపీఎల్ 2025 వేలంలో ఆల్‌టైమ్ రికార్డ్ ధరకి అమ్ముడుపోయిన వికెట్ కీపర్
IPL 2025 Auction LIVE Updates: భారత స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ ఆశించినట్లే ఐపీఎల్ 2025 వేలంలో భారీ ధర దక్కింది. అతని కోసం ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంఛైజీలు పోటీపడినా.. ఆఖరికి..?
Most expensive player in IPL auction: ఐపీఎల్ 2025 వేలంలో భారత క్రికెటర్ రిషబ్ పంత్ రికార్డ్ ధర పలికాడు. ఇటీవల ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంఛైజీ అతడ్ని వేలానికి వదిలేయగా.. రూ.2 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చిన పంత్ కోసం తొలుత లక్నో సూపర్ జెయింట్స్ బిడ్ వేయగా.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పోటీకి వచ్చింది. కెప్టెన్, బ్యాటర్, వికెట్ కీపర్ అవసరం ఉన్న ఈ రెండు జట్లూ.. రూ.11 కోట్ల వరకూ గట్టిగా పోటీపడ్డాయి. మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా ఎంట్రీ ఇవ్వడంతో పంత్ ధర అమాంతం పెరిగిపోయింది.
ఆర్టీఎం ప్రయోగించిన ఢిల్లీ
రూ.11 కోట్ల తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంఛైజీ డ్రాప్ అవగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య పోటీ కొనసాగించింది. చివరికి పంత్ ధర రూ.20.75 కోట్లు ఉన్న సమయంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఎంట్రీ ఇచ్చి రైట్ టు మ్యాచ్ (ఆర్టీఎం) కార్డుని వాడింది. అయినప్పటికీ.. రిషబ్ పంత్ కోసం పట్టుబట్టిన లక్నో సూపర్ జెయింట్స్ రూ.27 కోట్ల ధర చెప్పింది. ఆ ధర ఇవ్వలేమన్న ఢిల్లీ క్యాపిటల్స్ ఆర్టీఎంను విత్‌డ్రా చేసుకుంది. దాంతో రూ.27 కోట్లకి లక్నోకి పంత్ సొంతమయ్యాడు.
పట్టించుకోని చెన్నై
ఐపీఎల్ 2025 మెగా వేలంలోనే శ్రేయాస్ అయ్యర్ రూ.26.75 కోట్లు ధర పలికి రికార్డ్ సృష్టించగా.. నిమిషాల వ్యవధిలోనే రిషబ్ పంత్ రూ.27 కోట్లతో ఆ రికార్డ్‌ను బద్ధలుకొట్టాడు. 2008 నుంచి ఐపీఎల్ వేలం జరుగుతుండగా.. ఈ 17 ఏళ్ల వేలం చరిత్రలో ఇదే అత్యధిక ధర. పంత్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ పోటీపడుతుందని అంతా ఊహించారు. కానీ.. వికెట్ కీపర్‌గా ధోనీ ఐపీఎల్ 2025లో ఆడబోతుండటంతో.. పంత్‌పై చెన్నై ఇంట్రస్ట్ చూపలేదు.
పంత్ ఎందుకు వేలానికి?
వాస్తవానికి ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంఛైజీ రిషబ్ పంత్‌ను తొలుత వేలానికి వదిలేందుకు ఇష్టపడలేదు. కానీ.. రిషబ్ పంత్ వేలానికి వెళ్లాలని నిర్ణయించుకుని సాహసం చేశాడు. అంతేకాదు.. తాను వేలానికి వస్తే ఎంత ధరకి అమ్ముడుపోతాను? అని కూడా అభిమానుల్ని సోషల్ మీడియాలో సరదాగా ప్రశ్నించాడు. దాంతో రికార్డ్ ధరకి అమ్ముడుపోతావు.. అన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తావంటూ నెటిజన్లు సమాధానమిచ్చారు. పంత్ డబ్బు ఆశతోనే వేలానికి వచ్చాడని కొందరు మాజీ క్రికెటర్లు ఎద్దేవా చేశారు. కానీ.. డబ్బు కోసం కాదు అని పంత్ సమాధానమిచ్చాడు. ఐపీఎల్ 2024లో రిషబ్ పంత్‌కి రూ.16 కోట్లని మాత్రమే ఢిల్లీ క్యాపిటల్స్ ఇచ్చింది. అయితే.. తన ధర అది కాదు అని భావించిన పంత్.. వేలానికి వచ్చి రికార్డ్ ధరతో తన స్థాయిని క్రికెట్ ప్రపంచానికి చాటాడు.