Lord Shani dev: ఈ శనీశ్వరుడి ఆలయం ప్రపంచంలోనే వింతైనది.. మహిళలకు ప్రవేశం ఉండదు
Lord Shani dev: మహారాష్ట్రలోని శని శింగనాపూర్ లో ఉన్న శనీశ్వరుడి ఆలయం ఎన్నో వింతలు, ప్రత్యేకతలు సంతరించుకుంది. ప్రపంచంలోనే వింతైన ఈ ఆలయం గురించి విశేషాలు మీకోసం.
Lord Shani dev: అందరి దేవుళ్ళకు అనేక ఆలయాలు ఉంటాయి. వాటికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. పురుషులు, మహిళలు అనే తేడా లేకుండా దైవ దర్శనం చేసుకుంటారు. కానీ శనీశ్వరుడికి మాత్రం ఉన్న ఆలయాలు చాలా తక్కువ. శని దేవుడికి ఉన్న ఆలయాలు ఎన్నో వేళ్ళ మీద లెక్కబెట్టవచ్చు. అందుకు కారణం శని అంటే అందరికీ భయమే. చెడు ఫలితాలు ఇస్తాడని నమ్ముతారు.
ఈ ప్రదేశంలో ఉన్న శనీశ్వరుడి ఆలయం అన్నింటికంటే ప్రత్యేకమైనది. ఇక్కడ శని స్వయంభువుగా వెలిశాడని చెప్తారు. అది మాత్రమే కాదు ఈ శనీశ్వరుడి ఆలయంలో మహిళలకు ప్రవేశం లేదు. ఇంకా మరెన్నో ప్రత్యేకతలు కలిగిన ఆ ఆలయం ఎక్కడ ఉందో తెలుసా? మహారాష్ట్రలో అహ్మద్ నగర్ జిల్లా నెవాసా తాలూకాలోని శింగనాపూర్ అనే గ్రామంలో ఉంది.
శని శింగనాపూర్ ఆలయ ప్రత్యేకతలు
ప్రపంచంలోనే ప్రసిద్ది చెందిన శనీశ్వరుడి ఆలయం ఇది. ఈ గ్రామం మధ్యలో ఆలయ వేదికని సోనై అంటారు. ఎంతో మంది భక్తులు, పర్యాటకులు ఈ శనీశ్వరుడి ఆలయాన్ని సందర్శించుకుంటారు. కొన్ని అంచనాల ప్రకారం ఇది 350 సంవత్సరాల కంటే పాతదిగా చెప్తారు. స్థానిక పురాణాల ప్రకారం శని దేవుడు ఇక్కడ స్వయంభువుగా వెలిశాడని నమ్ముతారు.
ఒకసారి శింగనాపూర్ లో వరదలు వచ్చినప్పుడు శని దేవుడి విగ్రహం వరదల్లో కొట్టుకుపోయి చెట్టులో కూరుకుపోయింది. ఒక గొర్రెల కాపరి విగ్రహాన్ని తరలించడానికి ప్రయత్నించగా దాని నుంచి రక్తస్రావం అయ్యింది. అధ చూసి భయపడిపోయిన కాపరి పారిపోయాడు. కానీ ఆ రాత్రి శనిదేవుడు అతనికి కలలో కనిపించి గ్రామాన్ని రక్షించుకోవడం కోసం తన స్వయంభువు రూపమైన తన విగ్రహాన్ని పూజించాలని చెప్పాడట. అప్పటి నుంచి ఇక్కడ శనీశ్వరుడికి పూజలు చేస్తూ వచ్చారు.
ఆలయానికి పైకప్పు లేదు
సాధారణంగా ఎక్కడైనా ఆలయం అంటే చక్కగా ఉంటుంది. కానీ ఇక్కడ శనీశ్వరుడి ఆలయానికి మాత్రం గోడలు, పైకప్పు వంటివి ఏమి ఉండవు. స్వయంభుగా వెలిసిన ఐదు అడుగుల ఎత్తైన నల్ల రాయి ఉంటుంది. అదే శని దేవునిగా పూజిస్తారు.
మహిళలకు అనుమతి లేదు
ఆలయంలో ప్రవేశించేందుకు ఎటువంటి భేదాలు ఉండవు. కానీ ఇక్కడ శనీశ్వరుడి ఆలయంలోకి మహిళలకు అనుమతి లేదు. ఈ ఆలయంలో మహిళలు పూజలు చేసేందుకు అనుమతించరు. మహిళలు పూజలు చేసేందుకు అనర్హులుగా భావించే పాత పద్ధతిని ఇక్కడ అవలంభిస్తారు. శని దేవుడికి నూనె పోసి ప్రార్థనలు చేసేందుకు ఆలయం మెట్ల పైకి మహిళలు ఎక్కరాదనే పురాతన సంప్రదాయం వీళ్ళు పాటిస్తారు.
ఇళ్లకు తలుపులు, తాళాలు ఉండవు
ఇళ్లకు తలుపులు, తాళాలు లేని ఏకైక గ్రామంగా శని శింగనాపూర్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ దొంగతనాలు కూడా జరగవు. మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇక్కడ ఉన్న యూకో బ్యాంక్ శాఖకు కూడా తాళాలు ఉండవు. శని దేవుడు ఈ గ్రామాన్ని రక్షిస్తాడని ప్రజలు నమ్ముతారు. దొంగలు దొంగతనాలు చేయడానికి కూడా భయపడతారు. ఎవరైనా ఈ గ్రామంలో దొంగతనం చేయాలని ప్రయత్నిస్తే వారికి దురదృష్టం వెంటాడుతుంది. శని దేవుడు శిక్ష వేస్తాడని నమ్ముతారు.
గుడిలో చెట్టు ప్రత్యేకమే
ఈ గుడిలో ఉండే చెట్టు చాలా ప్రత్యేకమైనది. సుమారు 30 సంవత్సరాల క్రితం గుడి పక్కన కళ్యాణోత్సవం జరుగుతున్న సమయంలో ఈ వేప చెట్టుపై పిడుగు పడింది. అక్కడ ఎవరికీ ఎటువంటి హాని జరగనప్పటికీ చెట్టు మూలం వరకు కాలిపోయింది. దాదాపు 12 గంటల పాటు చెట్టు మండుతూ పూర్తిగా కాలిపోయింది. కానీ విచిత్రం ఏమిటంటే ఆ మరుసటి రోజే చెట్టు పచ్చదనంతో నిండిపోయింది. శని అనుగ్రహం వల్ల అలా జరిగిందని అక్కడి ప్రజలు నమ్ముతారు.
చెట్టు ఉంటుంది కానీ నీడ ఉండదు
శనిదేవుడి విగ్రహానికి ఉత్తరం వైపున ఈ వేప చెట్టు ఉంటుంది. ఈ చెట్టు కొమ్మలు విగ్రహం మీదకు వచ్చేంత వరకు పొడవు పెరుగుతాయి. కానీ అవి కాలిపోవడం లేదా విరిగి నేల మీద పడిపోవడమో జరుగుతుంది. వాటి వాళ్ళ ఎవరికి ఎటువంటి నష్టం వాటిల్లదు. అంత పొడవు పెరిగినా కూడా చెట్టు నీడ ఎప్పుడు విగ్రహం మీద పడదు. చెట్టు ఉంటుంది కానీ నీడ మాత్రం ఉండదని అక్కడి ప్రజలు చెప్తారు.