Jyotirlingas: శివుని అపారమైన శక్తికి నిదర్శనం ఈ జ్యోతిర్లింగాలు-lord shiva immense power of jyotirlingas in india ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Jyotirlingas: శివుని అపారమైన శక్తికి నిదర్శనం ఈ జ్యోతిర్లింగాలు

Jyotirlingas: శివుని అపారమైన శక్తికి నిదర్శనం ఈ జ్యోతిర్లింగాలు

Gunti Soundarya HT Telugu
Jan 07, 2024 08:00 AM IST

Jyotirlingas: శివుని శక్తి స్వరూపం శివలింగంలో ఉంటుంది. అందుకే జీవితంలో ఒక్కసారైనా జ్యోతిర్లింగాలు దర్శించుకోవాలని అనుకుంటారు.

కేదార్ నాథ్ ఆలయం
కేదార్ నాథ్ ఆలయం (pexels)

Jyotirlingas: ప్రతి హిందువు తప్పనిసరిగా ఒక్కసారైనా జ్యోతిర్లింగాలు దర్శించుకోవాలని కోరుకుంటారు. హిందువులకు జ్యోతిర్లింగాలు ప్రత్యేకమైన పవిత్రమైన స్థలాలుగా పేర్కొంటారు. శైవులు శివుడిని మూర్తి రూపంలో, లింగం రూపంలో పూజిస్తారు. లింగ రూపంలో శివుడు జ్యోతిస్వరూపం ఉంటుందని భక్తుల విశ్వాసం.

భారతదేశంలో మొత్తం 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. వాటినే ద్వాదశ జ్యోతిర్లింగాలు అని కూడా పిలుస్తారు. వారణాసిలోని కాశీ విశ్వనాథ్, గుజరాత్ లోని సోమనాథ్ జ్యోతిర్లింగాల జాబితాలో ఉన్నవి. ఈ పుణ్యక్షేత్రాలు శివుని అపారమైన శక్తిని సూచించబడతాయి. ఈ జ్యోతిర్లింగాలు శివునికి భక్తులు అత్యంత సన్నిహితంగా భావించే ప్రత్యేక ప్రదేశాలు. జీవితంలో ఒక్కసారైనా వీటిని సందర్శించుకోవాలని అనుకుంటారు. భారత్ లోని ప్రముఖ జ్యోతిర్లింగాలు కొన్ని..

కేదార్ నాథ్ జ్యోతిర్లింగం

ఉత్తరాఖండ్ లోని హిమాలయాల నడుమ ఉన్న కేదార్ నాథ్ జ్యోతిర్లింగం చాలా ప్రసిద్ధి చెందింది. ఇది భక్తులకు శివుని పట్ల ఉన్న అసమానమైన భక్తికి నిదర్శనం. పురాణాల ప్రకారం శివుడు ఎద్దు రూపంలో మారి పాండవుల నుంచి దాక్కున్నాడు. కానీ భీముడు ఆయన్ని గుర్తించినప్పుడు ఒక మూపురం విడిచి పెట్టాడు. శివుని ఆశీస్సులు కోరి పాండవులు ఈ ఆలయం నిర్మించారని పురాణ కథలు చెబుతున్నాయి. ఈ ఆలయం ఏడాదికి ఆరు నెలలు మాత్రమే తెరిచి ఉంటుంది. మిగతా ఆరు నెలలు మంచుతో కప్పబడి ఉంటుంది. సుమారు ఇరవై కిలోమీటర్లకు పైగా ట్రెక్కింగ్ చేసి ఈ ఆలయాన్ని దర్శించుకోవాలి.

మహాకాళేశ్వర జ్యోతిర్లింగ

మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలో పవిత్రమైన శిప్రా నది ఒడ్డున మహాకాళేశ్వర ఆలయం ఉంది. మహా కాళేశ్వరుడు అంటే కాలానికి ప్రభువని అర్థం. మానవ జన్మ నుంచి విముక్తి కలిగించే ప్రదేశంగా పేరు గాంచింది. ఇక్కడ ప్రతిరోజూ ఉదయం ఇచ్చే భస్మ హారతికి, మహా శివరాత్రి పండుగ చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. ఆ సమయాల్లో ఈ ప్రదేశం మొత్తం శివనామ స్మరణతో మారుమోగుతుంది.

విశ్వనాథ్ జ్యోతిర్లింగం

బనారస్ లోని గంగా ఘాట్ కి సమీపంలో కాశీ విశ్వనాథ్ జ్యోతిర్లింగం ఉంది. వారణాసి నగరం, ఈ జ్యోతిర్లింగం భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని సూచిస్తాయి. పురాణాల ప్రకారం ఇక్కడే మొదటి జ్యోతిర్లింగం స్థాపించబడింది. కాశీ శివుడి శాశ్వత నివాసమని భక్తులు నమ్ముతారు. చనిపోయే లోపు ఒక్కసారైనా కాశీని దర్శించుకోవాలని అంటారు. ఈ దేవాలయం శివుడికి ఎంతో ప్రీతికరమైనది. కాశీలో చనిపోయిన వారి అస్థికలు గంగానదిలో కలిపితే చనిపోయిన వారికి విముక్తి లభిస్తుందని ప్రజలు నమ్ముతారు. భక్తులకి ముక్తిని, సంతోషాన్ని శివుడు ఇస్తాడని నమ్మకం. ఈ ఆలయం ఇప్పటికీ ఎన్నో సార్లు పునర్మించిన దాని వైభవం మాత్రం చెక్కు చెదరలేదు.

రామేశ్వర జ్యోతిర్లింగం

తమిళనాడులోని హిందూ మహాసముద్రానికి సమీపంలో రామేశ్వరం జ్యోతిర్లింగం ఉంది. బ్రాహ్మణుడైన రావణునిని సంహరించిన తర్వాత బ్రాహ్మణ హత్య మహా పాపమని, తను చేసిన పాపాన్ని క్షమించమని శ్రీరాముడు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్టించాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ పవిత్ర స్థలానికి రావడం వలల తమ తప్పులు తొలగిపోతాయని విశ్వసిస్తారు.

సోమనాథ్ ఆలయం

గుజరాత్ తీరంలోని సోమనాథ్ ఆలయం శక్తి, భక్తికి ప్రతిరూపం. అనేక సార్లు ధ్వంసం కాబడినప్పటికీ ఈ ఆలయాన్ని పునర్మిస్తూ వచ్చారు. పురాణాల ప్రకారం మొదట చంద్రుడు తనకి శాప విముక్తి నుంచి ఉపశమనం కలిగించిన శివుడికి భక్తిగా ఈ ఆలయాన్ని నిర్మించారని చెబుతారు. జ్యోతిర్లింగాలలో మొదటిది ఇది. శ్రీకృష్ణుడు వెలిగించిన దీపం ఇక్కడ ఇప్పటికీ వెలుగుతుండటం ఇక్కడి ప్రత్యేకత.

వైద్యనాథ్ జ్యోతిర్లింగం

ఝార్ఖండ్ లోని డియోఘర్ లో వైద్యనాథ్ జ్యోతిర్లింగం ఉంది. గొప్ప ధ్యానం తర్వాత రావణుడు శివుడిని లంకకి తీసుకుని వెళ్తుంటే దేవతలు కలిసి ఒక ప్రణాళిక వేసి దాన్ని అపాలని చూస్తారు. లంకకి వెళ్ళే మార్గంలో ఎక్కడైనా లింగాన్ని కింద పెడితే అక్కడే ఉంటానని శివుడు రావణుడిని హెచ్చరించాడు. ఒక సమయంలో రావణుడు శివలింగాన్ని నేల మీద పెడతాడు. ఇక అక్కడ నుంచి శివలింగం తీయడం రావణుడి తరం కాలేదు. దీంతో తనకున్న ఒక్కొక్క తల నరుకుతూ వచ్చాడు. అతని భక్తికి మెచ్చిన శివుడు ప్రత్యక్షమై రావణుడికి వైద్యం చేసినట్టు పురాణాలు చెబుతున్నాయి.