Akhanda Deeparadhana: కలియుగ దైవం వెంకటేశ్వరస్వామి. తెలుగు రాష్ట్రాలలో అనేకమందికి ఇలవేల్పు వెంకటేశ్వరస్వామి. పొద్దున్నే నిద్రలేవగానే చాలా మంది ఇళ్ళలో వెంకటేశ్వర స్వామి సుప్రభాతం వింటూ ఉంటారు. నిత్యం గోవింద నామ స్మరణ చేసుకుంటారు. ఏదైనా శుభకార్యంలో ఆటంకాలు ఎదురైతే స్వామి వారికి మొక్కలు చెల్లించుకుంటామని అనుకుంటారు. అలాగే కొత్తగా పెళ్ళైన దంపతుల చేత వారి కాపురం సజావుగా ఏ ఒడిదుడుకులు లేకుండా సాగిపోవాలని కోరుకుంటూ వారితో సత్యనారాయణ స్వామి వ్రతం చేయిస్తారు.
కొత్తగా ఇల్లు కట్టుకున్నా, పెళ్లి జరిగినా, ఇంట్లో ఏదైనా శుభకార్యం చేపట్టినా తప్పనిసరిగా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటారు. ఈ వ్రతం చేసుకోవడం వల్ల జీవితంలో ఎటువంటి ఆటంకాలు ఎదురుకావని భక్తుల నమ్మకం. ఈ వ్రతం చేసిన తర్వాత అఖండ దీపారాధన జరిపిస్తారు. ఇంట్లో ఎలాంటి శుభకార్యం జరిగినా, అలాగే వెంకటేశ్వరస్వామికి మొక్కు పెట్టుకున్నా ఆ శుభ కార్యాలు కోరికలు నెరవేరిన తరువాత వెంకటేశ్వర స్వామికి అఖండ దీపారాధన వేడుక జరపటం ఒక సాంప్రదాయమని అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
ఇంట్లో అబ్బాయి పెళ్లి అయిన తర్వాత శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్న తర్వాత శ్రీ వెంకటేశ్వరస్వామివారికి అఖండ దీపారాధన చేస్తారు. ఇంట్లోని పూజా మందిరములో మట్టి మూకుడుకు పసుపు రాసి, కుంకుమ బొట్లు పెట్టి, ఆవు నెయ్యి, నువ్వుల నూనె మూకుడులో వేసి వెంకటేశ్వరస్వామి వారిని మదిలో తలుస్తూ నూతన దంపతులు అఖండ దీపారాధన వెలిగించాలని అని చిలకమర్తి తెలిపారు.
ఈ సందర్భంగా ఐదుగురు బాలదాసులు అనగా పది సంవత్సరముల లోపు మగ పిల్లలకు ముఖాన గోవింద నామములు పెట్టి, తుండ్లు కట్టించి వారిని గోవిందునిగా భావించి వారిచేత గోవింద నామం జపింపచేయాలి. పిల్లలకు కొత్త టవలు, పండ్లు, తాంబూలం ఇవ్వాలి. ఐదుగురు ముత్తైదువులకు, బాలదాసులకు విందు భోజనము ఏర్పాటు చేయాలి. ఆ తరువాత ముత్తైదువులకు జాకెట్టు వస్త్రము, పసుపు, కుంకుమ, తాంబూలం ఇవ్వాలి.
ఒక మూకుడులో నిప్పులు తయారుచేసి పెండ్లికొడుకు పట్టుకొనగా, పెండ్లికూతురు సాంబ్రాణి వేసుకుంటూ భోజనములు వడ్డించిన తరువాత గోవింద నామం జపిస్తూ వారి ముందు తిరగాలి. ఆ తర్వాత నూతన దంపతులు భోజనం చేయవచ్చు. కొత్తగా పెళ్లి అయిన దంపతులతో ఇలా పూజ చేయించడం వల్ల వారి జీవితం సుఖ సంతోషాలతో, పిల్లా పాపలతో వర్థిల్లుతుంది నమ్ముతార ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.