Ratha saptami 2024: హిందూ శాస్త్రంలో మాఘ మాసం ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంటుంది. ఈ మాసంలో అనేక పండుగలు వస్తాయి. మాఘ మాసం ఏడో రోజు వచ్చి శుక్ల సప్తమి నాడు రథసప్తమి జరుపుకుంటారు. ఈ ఏడాది రథసప్తమి ఫిబ్రవరి 16న వచ్చింది. ఈరోజు నుంచి వసంత ఋతువు మొదలవుతుందని నమ్ముతారు.
రథసప్తమిని సూర్య జయంతి, భాను సప్తమి, మహా సప్తమి, భీష్మ సప్తమి అని కూడా పిలుస్తారు. సూర్య భగవానుడి జన్మించిన రోజునే రథసప్తమిగా జరుపుకుంటారు. ఈరోజు సూర్యుడి ఆరాధనకి అధిక ప్రాముఖ్యత ఉంటుంది.
రథసప్తమి రోజు ఉపవాసం ఉండి సూర్యుడిని పూజిస్తే వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుందని అంటారు. ఒకప్పుడు కాంభోజ రాజుగా ఉన్న యశోవర్మ తనకున్న ఏకైక పుత్రుడు అనారోగ్యం పాలైతే రథసప్తమి వ్రతం ఆచరించాడని, ఫలితంగా కుమారుడు అనారోగ్యం నుంచి కోలుకున్నాడని పురాణాల్లో ఒక కథ ఉంటుంది. అందుకే సూర్యుడిని ఆరోగ్య ప్రదాత అంటారు.
ఫిబ్రవరి 16, శుక్రవారం రోజున రథసప్తమి వచ్చింది.
స్నాన ముహూర్తం: ఉదయం 5.03 గంటల నుంచి 6.43 గంటల వరకు ఉంది.
వ్యవధి- 01.39 గంటలు
సప్తమి తిథి ప్రారంహం- ఫిబ్రవరి 15 ఉదయం 10.12 గంటల నుంచి
సప్తమి తిథి ముగింపు- ఫిబ్రవరి 16 ఉదయం 8.54 గంటల వరకు
రథసప్తమి రోజు తెల్లవారు జామున నిద్రలేచి పవిత్ర నదిలో స్నానం ఆచరించాలి. ఈరోజు తలంటు స్నానం చేయడం వల్ల అనేక రోగాలు నయం అవుతాయని చెప్తారు. సూర్యుడికి ప్రతీక అయిన జిల్లేడు ఆకులు తల మీద పెట్టుకుని స్నానం ఆచరిస్తే ఫలితం ఉంటుంది. మూడు, ఐదు, ఏడు ఆకులు వాటి మీద అక్షితలు, రేగుపళ్లు ఉంచి తలంటు స్నానం చేయాలి. ఇలా స్నానం చేయడం వల్ల కర్మణా చేసిన పాపాలు, జన్మ జన్మ పాపాలు, తెలిసీ తెలియక చేసిన ఏడు రకాల పాపాలు తొలగిపోతాయి. ఈరోజున సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి.
సూర్యుని ఆరాధనలో ముఖ్యమైన భాగం అర్ఘ్యం సమర్పించం. స్నానం చేసిన అనంతరం రాగి పాత్రలో నీటిని తీసుకుని అందులో కుంకుమ, ఎర్రని పూలు, ఎర్ర చందనం, నువ్వులు వేసి సూర్యుడికి ఆ నీటిని సమర్పించాలి. ఇలా చేసేటప్పుడు ఆదిత్య హృదయ పారాయణం చేయడం మరచిపోవద్దు.
సూర్యుడికి ఎదురుగా పొయ్యి పెట్టి అందులో ఆవు పేడతో చేసిన పిడకలు వేసి పొయ్యి వెలిగించాలి. దాని మీద మట్టి పాత్ర లేదా రాగి పాత్ర వేసి ఆవు పాలు పొంగించిన తర్వాత అందులో బియ్యం, చక్కెర, బెల్లం, నెయ్యి వేసి పరమాన్నం చేయాలి. చిక్కుడు ఆకులలో సూర్య భగవానుడికి ఈ ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించాలి.
రథసప్తమి రోజు బంగారం, వెండి లేదా రాగితో చేసిన సూర్యుడి రథం చేయించి దాన్ని పూజించి ఆ రథాన్ని పండితులకి దానం చేయడం వల్ల జాతకంలో ఉన్న గ్రహ దోషాలు తొలగిపోతాయి.