Karthika Masam 2023: కార్తీకమాసంలో ఉసిరి చెట్టు కింద ఇలా దీపారాధన చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం-karthika masam perform lamp worship under amla tree to bless your home with wealth and goddess lakshmi grace ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Karthika Masam 2023: కార్తీకమాసంలో ఉసిరి చెట్టు కింద ఇలా దీపారాధన చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం

Karthika Masam 2023: కార్తీకమాసంలో ఉసిరి చెట్టు కింద ఇలా దీపారాధన చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం

HT Telugu Desk HT Telugu
Nov 15, 2023 07:02 AM IST

Karthika Masam 2023: కార్తీక మాసం వచ్చిందంటే ఉసిరి కాయల ధరలు పెరిగిపోతాయి. ఈ మాసంలోనే ఉసిరి దీపాలు పెడతారు. ఉసిరి కాయను లక్ష్మీదేవి స్వరూపంగా, విష్ణు స్వరూపంగా కొలుస్తారు. అందుకే ఉసిరి దీపాలను పెట్టడం వల్ల సకల శుభాలు కలుగుతాయి.

కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద దీపం ఎందుకు వెలిగించాలి
కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద దీపం ఎందుకు వెలిగించాలి

కార్తీక మాసం సకల సౌభాగ్యాలను అందించే నెల. ఈ మాసంలో చేసే పూజలు ఎన్నో దోషాలను తొలగించి సకల సంపదలను అందిస్తాయి. కార్తీక మాసం వచ్చిందంటే ఉసిరి కాయల ధరలు పెరిగిపోతాయి. ఈ మాసంలోనే ఉసిరి దీపాలు పెడతారు. ఉసిరి కాయను లక్ష్మీదేవి స్వరూపంగా, విష్ణు స్వరూపంగా కొలుస్తారు. అందుకే ఉసిరి దీపాలను పెట్టడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. కార్తీక మాసంలో ఉసిరి చెట్టును కూడా పవిత్రంగా పూజిస్తారు. ఆ రోజున కింద చెప్పిన విధంగా పూజ చేస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది.

తెల్లవారు జామునే లేచి తలంటు స్నానం చేయాలి. ఉసిరి చెట్టు కింద విష్ణువు పటాన్ని ఉంచాలి. ఉసిరి కాయలను ప్రమిదల్లా చేసి దీపం వెలిగించాలి. ఉసిరి కాయలనే నైవేద్యంగా సమర్పించాలి. దీపం వెలిగించాక శ్రీ మహా విష్ణువును పూజించాలి. తరువాత ఆ ఉసిరి చెట్టు చుట్టూ పదకొండుసార్లు ప్రదక్షిణలు చేయాలి. ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది.

శ్రీ మహా విష్ణువును ఇలా పూజించినందుకు లక్ష్మీ దేవి సంతోషించి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుందని పూరాణాలు చెబుతున్నాయి. అంతేకాదు ఉసిరి చెట్టు కింద కూర్చుని విష్ణువును ఉసిరికాయలతో దీపారాధన చేస్తే... అలాంటి భక్తులను చూడటానికి యముడికి శక్తి చాలదట. అంటే వారి ఆయుష్షు పెరుగతుందని అర్థం. ఉసిరి చెట్టు ఉన్న తోటలో లేదా ఉసిరి చెట్టు కింద కూర్చుని భోజనం చేస్తే చేసిన పాపాలు పోతాయని అంటారు. సూత మహర్షి తన మునులతో కలిసి ఉసిరి చెట్టు కిందనే కూర్చుని వన భోజనాలు చేసినట్టు కార్తీక పురాణంలో ఉంది. విష్ణువుకు ఉసిరి చెట్టు అంటే ఎంతో ఇష్టమని అంటారు.

ఉసిరి కాయలు దానం చేస్తే

వచ్చే కార్తీక పౌర్ణమి నాడు ఉసిరి కాయలు దానం చేస్తే జీవితంలో చేసిన సకల పాపాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. కార్తీక మాసంలో దీపదానం చేస్తే ఎంతో పుణ్యం. చాలా మంది ఉసిరి దీపాన్ని దానం చేస్తుంటారు. దీపదానం అంటే ఒక ప్లేటులో కొన్ని ఉసిరికాయలు, బియ్యం, పప్పు వేసి మరోపక్క దీపాన్ని ఉంచి శివాలయంలో లేదా విష్ణువాలయంలో దానం ఇవ్వాలి. ఇలా చేయడంలో సర్వ సంపదలు కలుగుతాయని అంటారు.

Whats_app_banner