తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  రోడ్డు మీద బైక్​ నడిపిన 'శివుడు'.. అరెస్ట్​ చేసిన పోలీసులు..!

రోడ్డు మీద బైక్​ నడిపిన 'శివుడు'.. అరెస్ట్​ చేసిన పోలీసులు..!

Sharath Chitturi HT Telugu

10 July 2022, 17:45 IST

  • అసోం వీధుల్లో శివుడు- పార్వతి దర్శనమిచ్చారు! 'ఇంధన ధరలు పెరిగిపోతున్నాయి. ప్రజల కష్టాలను తీర్చేందుకే వచ్చాను,' అని శివుడు అన్నాడు. కొద్దిసేపటికి.. ఆ శివుడిని పోలీసులు అరెస్ట్​ చేశారు. అసలేం జరిగిందంటే..

రోడ్డు మీద బైక్​ నడిపిన 'శివుడు'.. అరెస్ట్​ చేసిన పోలీసులు..!
రోడ్డు మీద బైక్​ నడిపిన 'శివుడు'.. అరెస్ట్​ చేసిన పోలీసులు..! (ANI)

రోడ్డు మీద బైక్​ నడిపిన 'శివుడు'.. అరెస్ట్​ చేసిన పోలీసులు..!

వీధి నాటకాల్లో భాగంగా.. శివుడి వేషం ధరించి.. బైక్​ నడిపిన ఓ వ్యక్తిని అసోం పోలీసులు అరెస్ట్​ చేశారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా అతను ప్రవర్తించడంతోనే అరెస్ట్​ చేసినట్టు పోలీసులు చెప్పారు.

ఇదీ సంగతి..

అసోంలోని నగౌన్​ జిల్లాలో జరిగింది ఈ ఘటన. 38ఏళ్ల బిరించి బోరా అనే సామాజిక కార్యకర్త.. నిరుద్యోగం, ఇంధన ధరలు, ద్రవ్యోల్బణం సమస్యలపై నిరసన వ్యక్తం చేసేందుకు ఓ వీధి నాటకం చేయాలని అనుకున్నాడు. అతనికి మరో మహిళ కూడా సాయం చేసింది. ఈ క్రమంలోనే వారిద్దరు.. శివుడు- పార్వతి దేవి వేషాలు వేసుకుని రోడ్డు మీద్​ బైక్​ నడిపారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.

"ఇంధన ధరలు దారుణంగా పెరుగుతున్నాయి. ప్రజల కష్టాలను తీర్చేందుకు నేను దైవ లోకం నుంచి భూమి మీదకు వచ్చాను. నిరుద్యోగ సమస్యలు కూడా ఉన్నాయి. ఇన్ని సమస్యలతో సాధారణ ప్రజలు ఎలా బతుకుతారు?" అని శివుడి వేషధారణలో ఉన్న బోరా ప్రశ్నించాడు.

కాగా.. ఈ వ్యవహారంపై బీజేపీ.. పోలీసులకు ఫిర్యాదు చేసింది.

"నిరసన చేయాలనుకుంటే.. కూర్చుని మీ పని మీరు చేసుకోండి. అంతేకానీ ఇలా దేవుళ్లలాగా వేషాలు వేసుకోవడం ఏంటి? మా మనోభావాలు దెబ్బతిన్నాయి. అందుకే ఎఫ్​ఐఆర్​ వేశాం," అని బీజేపీ కార్యకర్త రాజా పారీక్​ వెల్లడించారు.

బీజేపీ ఫిర్యాదుతో స్పందించిన నగౌన్​ పోలీసులు.. బోరాను అరెస్ట్​ చేశారు.

మరోవైపు ఈ వ్యవహారంపై అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ స్పందించారు. వీధి నాటకాలతో తప్పులేదు అన్నట్టు మాట్లాడారు.

"వీధి నాటకాలు చేస్తే దైవదూషణ చేస్తున్నట్టు కాదు. దేవుళ్లలాగా వేషం వేసుకుంటే తప్పు కాదు. వివాదాస్పదంగా వ్యవహరిస్తేనే తప్పు. ఈ విషయానికి సంబంధించి నగౌన్​ జిల్లా పోలీసులు ఆదేశాలిచ్చాను," అని శర్మ అన్నారు.

అనంతరం.. బోరాను బెయిల్​ మీద విడుదల చేశారు పోలీసులు.