తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Nokia X30 5g For Rent | ఈ నోకియా ఫోన్ అద్దెకు కూడా లభిస్తుంది, నెలకు ఎంత చెల్లించాలంటే?

Nokia X30 5G for Rent | ఈ నోకియా ఫోన్ అద్దెకు కూడా లభిస్తుంది, నెలకు ఎంత చెల్లించాలంటే?

Manda Vikas HT Telugu

07 November 2022, 15:36 IST

    • నోకియా కంపెనీ పర్యావరణ హితమైన ఉత్పత్తులను లాంచ్ చేయనుంది. ఇందులో భాగంగా వచ్చిన Nokia X30 5G స్మార్ట్‌ఫోన్‌ను కొలుగోలు చేయవచ్చు, అద్దెకు కూడా తీసుకోవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌ ధర ఎంత, అద్దె ఎంత ఇక్కడ చూడండి.
Nokia X30 5G smartphone for rent
Nokia X30 5G smartphone for rent

Nokia X30 5G smartphone for rent

నోకియా మొబైల్స్ లైసెన్సీదారు HMD గ్లోబల్, ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో జరిగిన IFA 2022 గ్లోబల్ టెక్నాలజీ సదస్సులో వివిధ నోకియా ఉత్పత్తులను విడుదల చేసింది. ఇందులో భాగంగా నోకియా X-సిరీస్‌లో Nokia X30 5G అనే స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఇది ఒక ప్రత్యేకమైన స్మార్ట్‌ఫోన్‌. ఎందుకంటే ఈ హ్యాండ్ సెట్ తయారీలో చాలా వరకు వ్యర్థ పదార్థాలను రీసైకిల్ చేసి ఉపయోగించారు. ఇది 100% రీసైకిల్ అల్యూమినియంతో తయారు చేసిన మెటల్ ఫ్రేమ్ కలిగి ఉంది, అయితే ప్లాస్టిక్ బ్యాక్ ప్యానెల్ మాత్రం 65% రీసైకిల్ మెటీరియల్‌తో తయారు చేసినది. భవిష్యత్తులో పర్యావరణ అనుకూలమైన, సుస్థిరమైన ఉత్పత్తులను అందించాలనే లక్ష్యంత నోకియా పని చేస్తుంది. కంపెనీ ప్రకారం ఈ Nokia X30 స్మార్ట్‌ఫోన్‌, తమ బ్రాండ్ నుంచి వచ్చిన అత్యంత పర్యావరణ అనుకూలమైన ఉత్పత్తిగా నొక్కి చెబుతోంది.

మరో విశేషం ఏమిటంటే, తమ Nokia X30 5G స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయకపోయినా, అద్దె ప్రాతిపదికన కూడా తీసుకోవచ్చని కంపెనీ ప్రకటించింది. గ్లోబల్ మార్కెట్లో Nokia X30 5G స్మార్ట్‌ఫోన్‌ ధర 520 డాలర్లు (భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 43 వేలు) గా ఉంది. అయితే, దీనిని నెలకు 25 డాలర్లు (సుమారు రూ. 2 వేలు) చెల్లించి, అద్దెకు తీసుకోవచ్చని తెలిపింది. ఈ సమయంలో ఒకవేళ ఈ స్మార్ట్‌ఫోన్‌ పోయినా లేదా డ్యాజేజ్ అయినా కొత్త స్మార్ట్‌ఫోన్‌ను భర్తీ చేసేందుకు హామి ఇచ్చినట్లు టెక్ నివేదికలు పేర్కొన్నాయి.

అయితే ఒక వ్యక్తి గరిష్టంగా మూడు నెలల వరకు మాత్రమే ఈ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకోవచ్చు. అనంతరం అది ఇతర వ్యక్తులకు అద్దెకు ఇవ్వడం జరుగుతుంది, చివరకు ఆ స్మార్ట్‌ఫోన్‌ను చారిటీ కింద దానం చేయడం జరుగుతుందని నివేదికల సారాంశం.

Nokia X30 అనేది 5G కనెక్టివిటీకి సపోర్ట్ చేసే మధ్య-శ్రేణి బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌. ఇందులో ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఎలా ఉన్నాయో చూడండి.

Nokia X30 5G స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్

  • 90Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.43 అంగుళాల AMOLED FHD+ డిస్‌ప్లే
  • 6GB/8GB RAM, 128 GB/256 GB ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం
  • Qualcomm స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్
  • వెనకవైపు 50MP +13MP కెమెరా, ముందు భాగంలో 16 MP సెల్ఫీ షూటర్‌
  • ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్
  • 4200 mAh బ్యాటరీ సామర్థ్యం, 33W ఛార్జర్

Nokia X30 5G క్లౌడీ బ్లూ లేదా ఐస్ వైట్ కలర్‌ అనే రెండు కలర్ ఆప్షన్లలో లభ్యమవుతోంది. అయితే బాక్స్‌లో ఛార్జింగ్ అడాప్టర్‌ను కలిగి ఉండదు, కాబట్టి దీనిని ప్రత్యేకంగా కొనుగోలు చేయాలి.

ఇదిలా ఉంటే.. Nokia 2780 Flip ఫోన్ కూడా రూ. 4,699 ధరకు భారత మార్కెట్లో కొనుగోలుదారులకు అందుబాటులోకి వచ్చింది.