తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Here Is Ap Cabinet Key Decisions, Cm Jagan Warns To Ministers After Meeting

AP Cabinet Decisions : ఏపీ కేబినెట్ నిర్ణయాలివే.. మంత్రులకు జగన్ స్ట్రాంగ్ వార్నింగ్!

HT Telugu Desk HT Telugu

07 September 2022, 18:48 IST

    • CM Jagan On Ministers : సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ సమావేశమైంది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలను మంత్రివర్గం తీసుకుంది. సుమారు 57 ఆంశాలకు ఆమోదం లభించింది. అయితే సమావేశం తర్వాత మంత్రులకు సీఎం జగన్ క్లాస్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది.
ఏపీ కేబినెట్ సమావేశం
ఏపీ కేబినెట్ సమావేశం

ఏపీ కేబినెట్ సమావేశం

ఏపీ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. మెుత్తం 57 అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 1.26 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం లభించింది. గ్రీన్ ఎనర్జీలో రూ.81వేల కోట్ల పెట్టుబడుల ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. 21వేల ఉద్యోగాలు కల్పించే ప్రాజెక్టులపైనా కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా 195 మంది ఖైదీల విడుదల చేసేందుకు నిర్ణయించారు. వైఎస్సార్ చేయూతకు కేబినెట్ ఆమోదం చెప్పింది. ఈనెల 22నుంచి సీఎం జగన్ చేతుల మీదుగా కార్యక్రమం నిర్వహించనున్నారు.

ఆర్‌ అండ్ బీలో ఆర్కిటెక్‌ విభాగానికి 8 పోస్టుల మంజూరు చేయనుంది ప్రభుత్వం. దివ్యాంగులకు 4 శాతం ఉద్యోగాలు, పదోన్నతుల్లో రిజర్వేషన్లు ఉంటాయి. భావనపాడు పోర్టు విస్తరణకు ఆమోదం లభించింది. సచివాలయంలో 85 అదనపు పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. ఒక్కో సచివాలయానికి రూ.20లక్షల నిధుల మంజురూ చేస్తారు. విశాఖపట్నం పరిధిలో లక్ష ఇళ్ల నిర్మాణానికి పరిపాలనా ఆమోదం లభించింది.

కురుపాం ట్రైబల్ ఇంజినీరింగ్ కాలేజీలో సిబ్బంది నియామకానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. నంద్యాల జిల్లా పాణ్యంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు ఓకే చెప్పింది ప్రభుత్వం. ప్రతీ మండలంలో రెండు పీహెచ్‌సీలకు ఆమోదం తెలిపింది. పైడిపాలెం ప్రాజెక్ట్‌ నిర్వాసితులకు ఆర్‌ అండ్ ఆర్‌ ప్యాకేజీ, అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.

మంత్రివర్గ సమావేశం తర్వాత.. కాసేపు జగన్ మంత్రులతో మాట్లాడినట్టుగా తెలుస్తోంది. మంత్రివర్గ సమావేశం పూర్తయిన వెంటనే.. సీఎం కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా మంత్రులపై సీరియస్ అయినట్టుగా సమాచారం. విపక్ష నేతలు ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలకు మంత్రులు సరైన రీతిలో కౌంటర్లు ఇవ్వడం లేదని జగన్ అసంతృప్తిగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రతిపక్షాలకు ధీటుగా సమాధానం చెప్పాలని సీఎం అన్నారట. ప్రభుత్వం చేసేది మంచి పనులేనని, విమర్శలు ఎందుకు తిప్పి కొట్టలేకపోతున్నారని మండిపడ్డారని సమాచారం.

ప్రతిపక్షం.. ప్రతిరోజూ ఏదో ఓ విషయంతో అధికార పార్టీపై విమర్శలు చేస్తోంది. అయితే ఈ విషయాన్నే జగన్ సీరియస్ గా తీసుకున్నారట. సమావేశం ప్రారంభమైనప్పటి నుంచి.. అసంతృప్తితోనే ఉన్నారని తెలుస్తోంది. మంచి పనులు చేస్తుంటే.. బురద జల్లుతున్నారని.. మీరు ఎందుకు తిప్పికొట్టలేక పోతున్నారని జగన్ ప్రశ్నించారని సమాచారం. అధికార పార్టీపైనా, ప్రభుత్వంపైనా బురద జల్లుతున్నా కూడా మంత్రులు పట్టించుకోరా అని జగన్ గట్టిగా అడిగారని చెబుతున్నారు. మళ్ళీ మంత్రివర్గంలో మార్పులు చేయమంటారా? అని నేరుగా హెచ్చరించినట్టుగా తెలుస్తోంది.