Engineering fees hike: పలు ఇంజినీరింగ్ కాలేజీల్లో పెరగనున్న ఫీజులు-telangana high court allows engineering colleges to collect hiked fees ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Telangana High Court Allows Engineering Colleges To Collect Hiked Fees

Engineering fees hike: పలు ఇంజినీరింగ్ కాలేజీల్లో పెరగనున్న ఫీజులు

Mahendra Maheshwaram HT Telugu
Aug 24, 2022 12:58 PM IST

engineering colleges seats in telangana: ఈ విద్యా సంవత్సరం ఇంజినీరింగ్ కాలేజీల్లో 45 కోర్సుల్లో 65,633 సీట్లు కన్వీనర్ కోటాలో అందుబాటులో ఉన్నాయని రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రకటించింది. మరోవైపు ఏఎఫ్ఆర్సీ ఎదుట కాలేజీలు అంగీకరించిన మేరకు ఫీజులను వసూలుకు రాష్ట్ర హైకోర్టు అనుమతినిచ్చింది.

ఇంజినీరింగ్‌ కాలేజీల్లో సీట్ల ఖరారు
ఇంజినీరింగ్‌ కాలేజీల్లో సీట్ల ఖరారు

Engineering fees hike in telangana: ఇంజినీరింగ్ ఫీజుల పెంపు అంశంపై సందిగ్ధత నెలకొన్న నేపథ్యంలో... పలు కాలేజీలు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే వీరిక ఊరట లభించింది. ఆయా కాలేజీల్లో ఫీజుల పెంపునకు న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. ఏఎఫ్ఆర్సీ(రాష్ట్ర ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ) ఎదుట కాలేజీలు అంగీకరించిన మేరకు ఫీజులను వసూలు చేసుకోవచ్చిన స్పష్టం చేసింది. ఫలితంగా పలు ఇంజినీరింగ్ కాలేజీల్లో ఫీజులు పెరగనున్నాయి. పద్నాలుగు కళాశాలలకు అనుమతినిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే వసూలు చేసిన ఫీజులు పిటిషన్​పై తుది తీర్పునకు లోబడి ఉండాలని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.పాత ఫీజులకు, కొత్త వాటికి మధ్య పెరిగిన సొమ్మును కాలేజీల బ్యాంకు ఖాతాల్లోనే ఉంచాలని.. ఒకవేళ తుది తీర్పు కళాశాలలకు వ్యతిరేకంగా వస్తే విద్యార్థులకు తిరిగి చెల్లించాలని హైకోర్టు తెలిపింది.

ట్రెండింగ్ వార్తలు

ఈ నేపథ్యంలో కళాశాలల యాజమాన్యాలు అంగీకరించిన ఫీజులను ఏఎఫ్ఆర్సీ రిజిస్టర్​లో నమోదు చేసింది. అయితే కరోనా పరిస్థితులు, ప్రజల ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది పాత ఫీజులను కొనసాగించాలని నిర్ణయించిన ఏఎఫ్ఆర్సీ ఈనెల 1న ప్రభుత్వానికి నివేదిక పంపించింది. ప్రభుత్వం దానిపై తుది నిర్ణయం తీసుకోక పోయినప్పటికీ.. ఈనెల 21న కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కావడంతో పలు కాలేజీలు హైకోర్టును ఆశ్రయించాయి.

పెరిగేది ఈ కాలేజీల్లోనే...

హైకోర్టు ఆదేశాల మేరకు వార్షిక ఫీజులు వర్ధమాన్ ఇంజినీరింగ్ కాలేజీలో రూ.లక్షా 55 వేలు, వీఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి, సీవీఆర్​లో రూ.1.50 లక్షలు, గురునానక్​ కళాశాలలో రూ.1.20 వేలకు పెరగనున్నాయి. పలు కాలేజీలకు హైకోర్టులో ఉపశమనం దొరికిన నేపథ్యంలో మిగతా ప్రైవేటు కాలేజీలు కూడా ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

సీట్లు ఖరారు

ఈ విద్యా సంవత్సరం ఇంజినీరింగ్‌ కాలేజీల్లో 45 కోర్సుల్లో 65,633 సీట్లు కన్వీనర్‌ కోటాలో అందుబాటులోఉన్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. అత్యధికంగా సీఎస్‌ఈలో 17,154, ఈసీఈలో 11,375, సీఎస్‌ఈ ఏఐఎంఎల్‌లో 7,032 సీట్లకు యూనివర్సిటీలు అనుమతిచ్చినట్లు పేర్కొంది. కన్వీనర్ కోటాలో 70శాతం, యాజమాన్య కోటాలో 30శాతం సీట్లను భర్తీ చేస్తారని వెల్లడించింది. కౌన్సెలింగ్ లో భాగంగా ఇవాళ ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ ప్రారంభమైంది.

IPL_Entry_Point