YSR Pension kanuka: వైఎస్సార్‌ పెన్షన్‌ కానుకకు ఎవరు అర్హులు? దరఖాస్తు ఎలా?-ysr pension kanuka eligibility criteria application process ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Ysr Pension Kanuka Eligibility Criteria Application Process

YSR Pension kanuka: వైఎస్సార్‌ పెన్షన్‌ కానుకకు ఎవరు అర్హులు? దరఖాస్తు ఎలా?

Praveen Kumar Lenkala HT Telugu
Dec 28, 2021 11:06 AM IST

YSR Pension kanuka: వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వివిధ వర్గాలకు ప్రతి నెలా పెన్షన్‌ అందజేస్తోంది. మొత్తం 12 కేటగిరీల్లో నెలకు రూ. 2,250 నుంచి రూ. 3 వేల వరకు అందిస్తోంది.

వివిధ పథకాలపై ఏపీ ముఖ్యమంత్రి సమీక్ష
వివిధ పథకాలపై ఏపీ ముఖ్యమంత్రి సమీక్ష

YSR Pension kanuka: వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మొత్తం 12 కేటగిరీల్లో నెలకు రూ. 2,250 నుంచి రూ. 3 వేల వరకు అందిస్తోంది. ఆయా పెన్షన్లు అందుకునేందుకు దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాల సభ్యులు, స్థానిక జిల్లా వాసి అయి ఉండాలి. ఇతర పెన్షన్లు పొంది ఉండకూడదన్న నిబంధన ఉంది.

ట్రెండింగ్ వార్తలు

YSR Pension kanuka: ఏయే పెన్షన్‌ పథకానికి ఎవరు అర్హులు

1. వృద్ధాప్య పెన్షన్: వృద్ధాప్య పెన్షన్‌ పొందేందుకు 60 ఏళ్ల వయస్సు నిండి ఉండాలి.

2. చేనేత కార్మికులకు పెన్షన్: వైఎస్సార్ పెన్షన్ స్కీమ్‌లో చేరాలంటే 50 ఏళ్లు నిండి ఉండాలి.

3. వితంతు పెన్షన్: 18 ఏళ్లకు పైబడిన వయస్సు ఉండి భర్త మరణించిన వారు

4. వికలాంగ పెన్షన్: 40 శాతం వైకల్యం కలిగి ఉన్న వారు అర్హులు. వయోపరిమితి లేదు.

5. గీతకార్మికులు: 50 ఏళ్ల వయస్సు ఉన్న వారు అర్హులు. కల్లు గీత సహకార సంఘాల్లో సభ్యుడు అయి ఉండాలి. లేదా టీఎఫ్‌టీ స్కీమ్‌ కింద కల్లుగీత కార్మికుడై ఉండాలి.

6. ఏఆర్టీ పెన్షన్: యాంటీ రెట్రో వైరల్‌ థెరఫీ కోసం ఆర్థిక సాయం. దీనికి వయో పరిమితి లేదు. ఆరు నెలల పాటు చికిత్స పొంది ఉండాలి.

7. లింగమార్పిడి పెన్షన్: ట్రాన్స్‌జెండర్లకు 18 ఏళ్ల వయస్సు ఉంటే పెన్షన్‌కు అర్హులు.

8. మత్స్యకారుల పెన్షన్: 50 ఏళ్ల వయస్సు ఉన్న మత్స్యకారులు పెన్షన్లకు అర్హులు.

9. ఒంటరి మహిళ పెన్షన్: వివాహం చేసుకున్న మహిళలకు భర్త నుంచి విడిపోయినప్పుడు, భర్త దూరం చేసినప్పుడు ఏడాది కాలం తరువాత పెన్షన్‌ పొందేందుకు అర్హులవుతారు. అలాగే అవివాహితగా ఉండి 30 ఏళ్లు నిండిన గ్రామీణ మహిళలకు, 35 ఏళ్లు నిండిన పట్టణ మహిళలకు కూడా పెన్షన్‌ పొందే అవకాశం ఉంది.

10. చెప్పులు కుట్టేవారికి: సాంప్రదాయంగా చెప్పులు కుట్టే వృత్తిలో ఉన్న వారికి 40 ఏళ్లు నిండితే పెన్షన్‌ లభిస్తుంది.

11. డప్పు కళాకారులకు: 50 ఏళ్లు నిండి ఉంటే పెన్షన్‌ లభిస్తుంది.

12. సీకేడీయూ పెన్షన్: కిడ్నీ డయాలసిస్‌ అవసరమైన పేషెంట్లకు లభిస్తుంది. దీనికి వయో పరిమితి లేదు.

YSR Pension kanuka: ఎంత పెన్షన్‌ లభిస్తుంది?

వైఎస్సార్ పెన్షన్ కానుక పథకం కింద వృద్ధులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, వితంతువులు, మత్స్యకారులు, కల్లు గీత కార్మికులు, ఏఆర్టీ, చెప్పులు కుట్టే వారు తదితరులకు నెలకు రూ. 2,250ల మేర పెన్షన్‌ అందుతుంది.

దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్, డప్పు కళాకారులైతే నెలకు రూ. 3 వేల పెన్షన్‌ అందుతుంది. సీకేడీయూ పెన్షన్‌ అయితే నెలకు రూ. 10 వేల మేర అందుతుంది.

పెన్షన్లకు వీరు అనర్హులు

1. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు

2. ప్రభుత్వ పెన్షనర్లు

3. ఆదాయ పన్ను చెల్లించే వారు

4. 2.5 ఎకరాల కంటే ఎక్కువగా మాగాణి గానీ 5 ఎకరాలకు మించి మెట్ట భూమి గానీ, మొత్తంగా 5 ఎకరాలు మించిగానీ ఉంటే పెన్షన్‌ పొందేందుకు అనర్హులు. అయితే ఐటీడీఏ పరిధిలోని ఎస్టీలకు ఈ నిబంధన నుంచి మినహాయింపు ఉంది.

5. ఔట్‌ సోర్స్‌డ్‌ ఉద్యోగులు

6. ప్రయివేటు వేతన జీవులు

7. కారు ఓనర్లు

8. స్వతంత్ర సమర యోధులై ఉండి పెన్షన్‌ పొందుతున్నవారు.

వైఎస్సార్‌ పెన్షన్ కానుక పెన్షన్లకు దరఖాస్తు ఎలా?

వృద్ధాప్య పెన్షన్‌ తదితర 12 రకాల పెన్షన్లలో కొత్తగా దరఖాస్తు చేయదలిచిన వారు గ్రామ సచివాలయం లేదా వార్డు సచివాలయంలో సంప్రదించాలి. అక్కడి వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ దరఖాస్తు భర్తీ చేసేందుకు సహకరిస్తారు.

ఈ దరఖాస్తు గ్రామ సభ పరిశీలనకు, ఆ తదుపరి ఎంపీడీవో పరిశీలనకు లేదా మున్సిపల్‌ కమిషనర్‌ పరిశీలనకు వెళుతుంది. అక్కడి నుంచి డీఆర్‌డీఏ కార్యాలయంలో ఆమోదం పొందితే పెన్షన్‌ ఎంపీడీవో కార్యాలయం, గ్రామ సచివాలయం ద్వారా లబ్ధిదారులను చేరుతుంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం