Dalitha Bandhu Scheme Update : దళిత బంధుపై తాజాగా ప్రభుత్వం ఏం చెప్పిందంటే?
Telangana Govt On Dalitha Bandhu : దళితబందు పథకాన్ని ఈ ఏడాది మరింత విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దళితుల ఆర్థిక సాధికారతే ప్రభుత్వ సంకల్పమని టీఆర్ఎస్ చెబుతోంది. దళితుల అభ్యున్నతిలో దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని అంటోంది.
రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధు కింద ఇప్పటివరకు 36,392 మంది లబ్ధిదారులు ఖాతాలలో నిధులు జమచేసింది ప్రభుత్వం. 31,088 యూనిట్స్ గ్రౌండ్ అయినట్టుగా ప్రభుత్వ లెక్కలు ఉన్నాయి. హుజురాబాద్ నియోజకవర్గంలో 18,402 వాసాలమర్రిలో 75, నాలుగు పైలట్ మండలాల్లో 4,808 దళిత బంధు యూనిట్స్ గ్రౌండింగ్ అయ్యాయి.
అంబేద్కర్ ఆశయాల సాధనలో భాగంగా దళితుల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని టీఆర్ఎస్ అంటోంది. పోరాడి సాధించుకున్న తెలంగాణలో అభివృద్ధి ఫలాలు అన్ని వర్గాలకు అందించాలనే సంకల్పంతో సామాజిక ఆర్థిక అంతరాలను రూపుమాపాలనే ధ్యేయంతో రాష్ట్ర ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని వజ్ర సంకల్పంతో అమలుచేస్తోందని సమాచార పౌర సంబంధాల శాఖ ప్రకటన విడుదల చేసింది.
దశలు వారిగా రాష్ట్రంలోని 100 శాతం దళిత కుటుంబాలకు ప్రభుత్వ ఆర్థిక సహాయంతో ఎటువంటి బ్యాంకు రుణాలతో సంబంధం లేకుండా నిధులు ఇస్తామని ప్రభుత్వం అంటోంది. తిరిగి చెల్లించవలసిన అవసరం లేకుండా తమకు నచ్చిన, నైపుణ్యం కలిగిన ఆర్థిక యూనిట్లను నెలకొల్పుకొని ఆర్థికంగా నిలదొక్కుకొవాలని అంటోంది.
2021-22 ఆర్థిక సంవత్సరం దళితబందు వివరాలు
యాదాద్రి - భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం లోని వాసాలమర్రి గ్రామంలోని మొత్తం 75 మంది లబ్ధిదారుల ఖాతాలకు దళిత బంధు కింద రూ.7 కోట్ల 60 లక్షలు నిధులను ప్రభుత్వం జమచేసింది. 85 దళిత బంధు యూనిట్స్ గ్రౌండింగ్ అయ్యాయి.
పైలట్ ప్రాజెక్టు కింద రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న నాలుగు మండలాలు (చింతకాని, తిరుమలగిరి, చారకొండ, నిజాంసాగర్)లో 100 శాతం దళిత కుటుంబాలకు ప్రభుత్వం మంజూరుచేస్తోంది. ఈ 4 మండలాల్లో 8,518 దళిత కుటుంబాలు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. అందులో 6,947 కుటుంబాల బ్యాంకు ఖాతాలకు ప్రభుత్వం నిధులు జమచేసింది. ఈ 4 మండలాల్లో ఇప్పటివరకు 4,808 దళిత బంధు యూనిట్స్ గ్రౌండింగ్ అయ్యాయి.
రాష్ట్రంలోని 33 జిల్లాలలోని 118 నియోజకవర్గల్లో 100 కుటుంబాలకు దళితబందు కింద యూనిట్స్ మంజూరు చేయాలని ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా మొత్తం 11,835 దళితకుటుంబాలను ప్రభుత్వం గుర్తించింది. వాటిలో ఇప్పటివరకు 11,159 కుటుంబాల ఖాతాలలో నిధులు జమచేసింది. 10,893 యూనిట్స్ గ్రౌండింగ్ అయ్యాయి.
దళిత బంధు కింద 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబందించి మొత్తం 36,392 మంది లబ్ధిదారుల ఖాతాలకు ప్రభుత్వం నిధులు జమచేసింది. వారిలో 31,088 మంది లబ్ధిదారులు యూనిట్లను ఏర్పాటు చేసుకున్నారు. 2022-23 బడ్జెట్లో కేటాయించిన రూ.17,700 కోట్ల నిధులను పూర్తిగా విడుదల చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ సంవత్సరం ప్రతి నియోజకవర్గంలో 1500 కుటుంబాల చొప్పున 118 నియోజకవర్గంలలో 1,77,00 మంది లబ్ధిదారులకు దళితబందు పథకాన్ని వర్తింపజేయనున్నారు. ఈ సంవత్సరం మొదటి దశలో నియోజకవర్గానికి 500 మంది చొప్పున మొత్తం 59,000 కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది.