AP Govt : సచివాలయంలో ఫైల్ జంపింగ్ విధానం.. ప్రభుత్వం ఉత్తర్వులు
ఏపీ సచివాలయంలో కొత్తగా ఫైల్ జంపింగ్ విధానం తీసుకొచ్చింది ప్రభుత్వం. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. దస్త్రాల పరిష్కారంలో ఈ విధానం ద్వారా జాప్యం కాకుండా ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఫైల్ జంపింగ్ విధానాన్ని ప్రభుత్వం తీసుకువచ్చింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం.. సెక్రటేరియట్ ఆఫీస్ మాన్యువల్ బిజినెస్ నిబంధనలు సవరించారు. జీఏడీ నోట్ ఆధారంగా సచివాలయ మాన్యువల్‌లో మార్పులు చేశారు. దస్త్రాల పరిష్కారంలో జాప్యాన్ని తగ్గించేందుకు.. ఈ విధానం అమల్లోకి తీసుకొచ్చారు. అనసవరమైన స్థాయిల్లో దస్త్రాల తనిఖీ అవసరం లేదని ప్రభుత్వం పేర్కొంది.
నాలుగు స్థాయిల్లో దస్త్రాలు సర్క్యులేట్ అయితే సరిపోతుందని తెలిపింది. నిర్ణీత వ్యవధిలో ఫైళ్ల వేగం పెంచేందుకే లెవల్ జంపింగ్ విధానమంటూ ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. సహాయ సెక్షన్ అధికారి నుంచి మంత్రి వరకు దస్త్రం సర్క్యులేట్ అవుతుంది. లెవల్ జంపింగ్ విధానంపై గతంలో సచివాలయ ఉద్యోగులు సీఎం జగన్కు లేఖ రాశారు. ఈ విధానం వద్దని చెప్పారు. ఉద్యోగుల విజ్ఞప్తి పక్కనపెట్టి లెవల్ జంపింగ్ జీవో జారీ అయింది.