BJP: మునుగోడులో ఈటల మార్క్ రాజకీయం..! చక్రం తిప్పుతున్నారా?-mla etela rajendar eye on munugodu bypoll to target cm kcr ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Bjp: మునుగోడులో ఈటల మార్క్ రాజకీయం..! చక్రం తిప్పుతున్నారా?

BJP: మునుగోడులో ఈటల మార్క్ రాజకీయం..! చక్రం తిప్పుతున్నారా?

Mahendra Maheshwaram HT Telugu
Aug 18, 2022 07:02 AM IST

ఈటల రాజేందర్... హుజురాబాద్ లో అధికార టీఆర్ఎస్ ను ఢీకొట్టి గెలిచారు. కేసీఆర్ కు గట్టి షాక్ ఇచ్చారు. అయితే ఇక మునుగోడులోనూ దెబ్బకొట్టాలని చూస్తున్నారు ఈటల. మునుగోడుకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు ఆయన సమక్షంలోనే బీజేపీలో చేరిపోయారు. దీంతో ఉపపోరులో ఈటల రాజేందర్ హాట్ టాపిక్ గా మారారు.

<p>ఈటల సమక్షంలో చౌటుప్పల్ ఎంపీపీ వెంకట్ రెడ్డి చేరిక</p>
ఈటల సమక్షంలో చౌటుప్పల్ ఎంపీపీ వెంకట్ రెడ్డి చేరిక (twitter)

Munugodu by poll 2022ఛ మునుగోడు... రాజకీయ యుద్ధానికి వేదికైంది. ఇప్పటికే నేతలు మాటల తుటాలు పేల్చేస్తున్నారు. బైపోల్ బరిలో ఎలాగైనా విక్టరీ కొట్టి... సాధారణ ఎన్నికల యుద్ధానికి సిద్ధం కావాలని చూస్తున్నాయి ప్రధాన పార్టీలు. ఇక కమలదళం మాత్రం... ఈ ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. అమిత్ షా సభతో సమరశంఖం పూరించేలా ప్లాన్ సిద్ధం చేసేసింది. ఇదిలా ఉంటే ఇప్పటికే పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్న... మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాత్రం మునుగోడుపై తెగ ఫోకస్ పెట్టేశారు. ఇప్పటికే స్థానిక నేతలతో... సంప్రదింపులు జరుపుతూ ప్రధాన పార్టీలకు షాక్ ల మీద షాక్ లు ఇస్తున్నారు. దీంతో అందరి చూపు ఈటల రాజేందర్ పై పడింది. మునుగోడులో అసలు ఆయన ఏం చేయబోతున్నారు..? ప్రజాప్రతినిధులు ఆయన సమక్షంలోనే ఎందుకు చేరుతున్నారు.? అసలు ఆయన టార్గెట్ ఏంటి అన్న చర్చ జోరుగా జరుగుతోంది.

కాంగ్రెస్ పార్టీతో ఎమ్మెల్యే పదవికి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయటంతో... మునుగోడు రాజకీయం ఒక్కసారిగా మారిపోయింది. ఆయన బీజేపీలో చేరటంతో పాటు... కేడర్ ను తీసుకెళ్లేందుకు సీరియస్ గా ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్య నేతలంతా తనతోనే ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకువెళ్తున్నారు. అమిత్ షా సభ తర్వాత... కంప్లీట్ గా మునుగోడులోనే ఉండేలా కార్యాచరణను సిద్ధం చేసుకుంటున్నారు. మరోవైపు ఈటల రాజేందర్ కూడా... మునుగోడు విషయంలో సీరియస్ గా వర్కౌట్ చేసే పనిలో పడ్డారు. పార్టీ నాయకత్వం కూడా... పలు బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. గడిచిన కొద్దిరోజుల్లోనే పలువురు ప్రజాప్రతినిధులు...ఈటల సమక్షంలోనే బీజేపీలో చేరటం ఆసక్తిని రేపుతోంది.

అంసతృప్తులతో చర్చలు...!

మునుగోడులో టీఆర్ఎస్ తీరుపై అసంతృప్తితో ఉన్న ఆ పార్టీ నేతలను గుర్తించి వారిని పార్టీలోకి తీసుకొచ్చేందుకు ఈటల ప్రయత్నాలు చేస్తున్నారనే చర్చ నడుస్తోంది. ఈ క్రమంలోనే అనూహ్య పరిణామాల మధ్య చౌటుప్పల్ ఎంపీపీ తాడూరి వెంకట్ రెడ్డి... బీజేపీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఈటల... మరికొంతమంది ముఖ్య నేతలు కూడా... బీజేపీలోకి వస్తారంటూ హింట్ ఇచ్చారు. ఆయన చెప్పినట్లే పలువురు కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ కు చెందిన సర్పంచ్ లు, ఎంపీటీసీలను బీజేపీలోకి వచ్చేలా చేశారు. ఉప ఎన్నిక షెడ్యూల్ వచ్చే నాటికి... మరింత స్పీడ్ పెంచే దిశగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. హుజురాబాద్ సీన్ ను రిపీట్ చేసి... అధికార టీఆర్ఎస్ గట్టి షాక్ ఇవ్వాలన్న కసితో ఈటల ఉన్నట్లు స్పష్టమవుతోంది.

ఈటల భార్య ఇక్కడివారే...

నిజానికి హుజూరాబాద్‌లో టీఆర్ఎస్, బీజేపీ మధ్య పోటీ ఇంతకంటే తీవ్రంగా జరిగింది. ఎలాగైనా రాజేందర్ ఓడించాలనే కసితో అధికార పార్టీ చేయని ప్రయత్నమంటూ లేదు. కానీ అక్కడ గట్టి పట్టున్న ఈటల రాజేందర్.. గెలుపు కోసం తనదైన శైలిలో వ్యూహాలను అమలు చేశారు. తాజాగా ఆయన మునుగోడులో ముందుగానే వాలిపోవడంతో... కేసీఆర్ మార్క్ రాజకీయాలకు ధీటుగా మునుగోడులో ఈటల రాజేందర్ మార్క్ రాజకీయాలు ఉంటాయేమో అనే చర్చ జరుగుతోంది. అయితే మునుగోడుతో ఈటలకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఆయన భార్య జమునా రెడ్డి ఇదే నియోజకవర్గానికి చెందిన వ్యక్తి. ఫలితంగా ఈటల వివాహం అయిన నాటి నుంచే... మునుగోడు నియోజకవర్గంతో టచ్ ఉంది. దీనికితోడు పలువురు ప్రముఖులు, నేతలతో కూడా ఈటలకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఇది కూడా బీజేపీకి కలిసివచ్చే అంశంగా చెప్పొచ్చు. ఇప్పటికే పలు సమావేశాల్లో మాట్లాడిన ఈటల... తప్పకుండా మునుగోడులో మక్కాం వేస్తానని స్పష్టం చేశారు. ఉపపోరులో టీఆర్ఎస్ ను ఓడించి తీరుతామని సవాల్ విసిరారు.

గతంలో టీఆర్ఎస్ లో కీలకంగా వ్యవహరించటంతో పాటు కేసీఆర్ రాజకీయాలు గురించి బాగా తెలిసిన వ్యక్తిగా ఈటల రాజేందర్ కు పేరుంది. దీంతో మునుగోడు ఉప ఎన్నికల్లో మెరుగ్గా పని చేసి.. పార్టీకి ఆశించిన ఫలితాలు తీసుకొస్తారని బీజేపీ నాయకత్వం కూడా భావిస్తుంది. అయితే పార్టీ పరంగానే కాకుండా... వ్యక్తిగతంగా కేసీఆర్ ను ఏ చిన్న ఛాన్స్ దొరికినా టార్గెట్ చేసేస్తున్నారు ఈటల రాజేందర్. హుజురాబాద్ లోనూ గెలిచి నిలిచిన ఈటల.... మునుగోడులోనూ తన వంతు పాత్ర పోషించాలని చూస్తున్నారంట. విక్టరీ కొట్టి కేసీఆర్ కు మరోమారు గట్టి షాక్ ఇవ్వాలని చూస్తున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది.

Whats_app_banner

సంబంధిత కథనం