Sunny Leone: బుల్లితెర ప్రేక్షకులకు డబుల్ ధమాకా.. విదేశీయులతో సన్నీ లియోన్ తెలుగు షో
Sunny Leone Telugu Medium i School Show: సరికొత్త కార్యక్రమాలతో అలరించే ప్రముఖ ఛానెల్ జీ తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు డబుల్ ధమాకా ఇవ్వనుంది. శృంగార తారగా పేరుగాంచిన సన్నీ లియోన్‌తో ఓ కార్యక్రమం ప్రసారం చేయనుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
Zee Telugu: ఇదివరకు ఎప్పుడూ లేని విధంగా సరికొత్త కాన్సెప్ట్‌తో టెలివిజన్ రంగంలో విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టబోతోంది జీ తెలుగు. తెలుగు భాష, సంస్కృతి సంప్రదాయాలను బోధిస్తూనే కడుపుబ్బా నవ్వించేందుకు ‘తెలుగు మీడియం ఐస్కూల్’ అనే విభిన్నమైన నాన్ ఫిక్షన్ షోతో బుల్లితెర ప్రేక్షకుల ముందుకు రానుంది. మొదట్లో శృంగార తారగా పేరు తెచ్చుకున్న బాలీవుడ్ బ్యూటీ సన్నీ లియోన్ ముఖ్య అతిథిగా ఈ షో ప్రారంభం కానుంది.
ఎనిమిది మంది
జీ తెలుగులో ఆదివారం (అక్టోబర్ 8) నుంచి రాత్రి 9 గంటలకు తెలుగు మీడియం ఐస్కూల్ షోను ప్రసారం చేయనున్నారు. ఇందులో ఎనిమిది మంది తెలుగు మెంటర్స్, తెలుగు భాషపై ఏమాత్రం అవగాహనలేని ఎనిమిది మంది విదేశీ పోటీదారులకు తెలుగు భాషను బోధించే ఛాలెంజ్‌ని స్వీకరించారు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కార్యక్రమంలో పాల్గొనేవారు భాషలోని మెళకువలు నేర్చుకోవడానికి చేసే ప్రయత్నం ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకోవడంతో పాటు అంతులేని వినోదాన్ని పంచుతుంది.
వివిధ దేశాలకు చెందిన
అప్పారావు, మహేష్ విట్టా, గోమతి, అరియానా, రష్మీ, ఫైమా, భద్రం, రంగస్థలం మహేష్ వంటి పాపులర్ తెలుగు కమెడియన్లు మెంటర్స్ జాబితాలో ఉన్నారు. అమెరికాకు చెందిన అలీజా, స్కాట్లాండ్కు చెందిన సామి జోనాస్ హీనీ, జపాన్‌కు చెందిన సుయోషి యమమోటో సహా ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన కంటెస్టెంట్లు ఈ విద్యార్థుల సమూహంలో ఉన్నారు. ఎనర్జిటిక్ యాంకర్ రవి, పండు బాబాయ్, అబ్బాయిలుగా గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనున్నారు.
సెన్సేషనల్ ఎంట్రీ
తెలుగు మీడియం ఐస్కూల్ లాంచ్ ఎపిసోడ్‌కు బాలీవుడ్ బ్యూటీ సన్నీ లియోన్ సెన్సేషనల్ ఎంట్రీ ఇవ్వనుంది. అన్నింటికంటే హైలెట్‌గా సన్నీ లియోన్ అచ్చ తెలుగులో మాట్లాడం కానుంది. ఈ లాంచ్ ఎపిసోడ్లో ప్రముఖ సింగర్ మనో కూడా భాగం కానున్నారు.
డబుల్ ధమాకా
‘జీ తెలుగుతో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమంలో భాగంగా తెలుగు భాష గురించి తెలుసుకోవడం, తెలుగులో మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది. ఎంతో ఆహ్లాదభరితంగా సాగిన ఈ కార్యక్రమాన్ని చూసేందుకు నేనూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. జీ తెలుగులో ప్రసారం కానున్న తెలుగు మీడియం ఐస్కూల్ని మీరూ తప్పక చూడండి’ అని సన్నీ లియోన్ తెలిపింది. బుల్లితెరపై వినోదంతో తెలుగు నేర్పించడమేకాకుండా సన్నీతో డబుల్ ధమాకా ఇవ్వనుంది జీ తెలుగు.