Diarrhoea Cases in Vijayawada : విజయవాడను వణికిస్తున్న డయేరియా - ఎనిమిదికి చేరిన మృతుల సంఖ్య..!
Diarrhoea Cases in Vijayawada : విజయవాడను డయేరియా వణికిస్తోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. గడిచిన 15 రోజుల్లో మృతుల సంఖ్య ఎనిమిదికి చేరింది. మరోవైపు ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజల నుంచి రక్త నమూనాలను సేకరిస్తున్నారు.
Diarrhoea Cases in Vijayawada : విజయవాడలో అతిసార వ్యాధి విజృంభిస్తుంది. రోజురోజు వివిధ ప్రాంతాలకు విస్తరిస్తుంది. దీంతో ఏకంగా ఎనిమిది మంది మరణించారు. మరణించిన వారిలో ఎక్కువ మంది మహిళలే ఉన్నారు. ఎనిమిది మందిలో ఐదుగురు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నారు. అలాగే ఆసుపత్రుల్లో పదుల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. ఈ వ్యాధికి కారణం కలుషిత నీటిని వాడటమేనని వైద్యులు చెబుతున్నారు.
ఈ అతిసార కేసు మొదటగా మొగల్రాజపురంలో వెలుగు చూసింది. ఆ తరువాత పాయకాపురం ప్రాంతానికి, అలా మరికొన్ని ప్రాంతాలకు ఈ వ్యాధి వ్యాప్తి విస్తరించింది. అందువల్ల ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రిల్లో పదుల సంఖ్యలో బాధితులు చికిత్స పొందుతున్నారు. ఈ వ్యాధి విజృంభణతో మరణాల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయి.
8కి చేరిన మృతుల సంఖ్య…!
గత 15 రోజుల్లో మృతుల సంఖ్య ఎనిమిదికి చేరింది. మరిన్ని మరణాలు సంభవించే అవకాశం ఉంది. మరణించిన వారిలో ఎక్కువ మంది మహిళలే ఉన్నారు. ఎనిమిది మందిలో ఐదుగురు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నారు. పాయకాపురం రాధానగర్ కు చెందిన చౌదరి కనకమ్మ (60), రామవరపు సన్యాసమ్మ (80), యడ్లపల్లి వినరు సిద్ధార్థ (ఏడాది), మొగల్రాజపురం గుమ్మడు వారి వీధికి చెందిన మెట్టు అంజమ్మ (70), శిఖా ఇందిర (36), కాకర్లమూడి ఇందిర (55), ఇడుపుల కల్యాణ్ (26), వల్లూరి దుర్గారావు (46) అతిసార వ్యాధితో మరణించారు.
పాయకాపురం, మొగల్రాజపురం ఈ రెండు ప్రాంతాలకు చెందిన సుమారు 50 మందికిపైగా అతిసార వ్యాధి బాధితులు వివిద్ ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. విజయవాడ నగరంలో నీటి సమస్య ఈనాటిది కాదు. ఎప్పటినుంచో ఇక్కడ నీటి సమస్యతో ప్రజలు బాధపడుతున్నారు. ఎంత మొర పెట్టుకున్నప్పటికీ ప్రభుత్వాలు పట్టించుకోలేదని బాధితులు చెబుతున్నారు. అయితే కలుషిత నీటి వల్లే ఈ వ్యాధి విజృంభిస్తుంది. దీంతో డయేరియా కేసులు భారీగా పెరుగుతున్నాయి.
అధికారులు, పాలకుల అలసత్వంతో కలుషిత నీటి తాగడంతో సామాన్య ప్రజలు వ్యాధి బారిన పడుతున్నారు. ఈ వ్యాధి బారిన పడుతున్న బాధితుల్లో నిరుపేదలే అధికంగా ఉన్నారు. ఏడాదిలోపు వయస్సు ఉన్న చిన్నారులు సైతం ఈ వ్యాధి బాధితుల్లో ఉండటం దారుణం. కలుషిత నీరు మంచి నీటి సరఫరా పైప్ లైన్లలో కలుస్తున్నప్పటికీ, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ (విఎంసి) అధికారులు పట్టించుకోవడం లేదు. అలాగే డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో కనీస వైద్య సేవలు అందించడం లేదు. దీంతో నగర వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
అధికారులు ఇంటింటి సర్వే…
డయేరియా వ్యాధి మరణాలు రోజు రోజుకు పెరగడంతో అధికారులు అలసత్వం వదిలారు. ఆలస్యంగానైనా మేల్కొన్న అధికారులు డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో ఇంటింటి సర్వే చేపట్టి, రక్త నమూనాలను సేకరిస్తున్నారు. అయితే రక్త నమూనాల ఫలితాలను మాత్రం వైద్యా ఆరోగ్య శాఖ వెల్లడించలేదు. ప్రజలు నమూనాల ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు.