Late Meals at Night: వారానికి నాలుగు రోజులు రాత్రిపూట ఆలస్యంగా తిన్నా చాలు, ఈ వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువ
Late Meals at Night: రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేసే వారికి ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వస్తాయి. ఎవరైతే రాత్రిపూట ఆలస్యంగా తింటారో వారికి వచ్చే క్యాన్సర్ గురించి వైద్యులు వివరిస్తున్నారు.
Late Meals at Night: రాత్రిపూట ఏడు గంటలకే భోజనం పూర్తి చేయమని చెబుతారు పోషకాహార నిపుణులు. ఇంకా కుదరకపోతే రాత్రి 8 గంటల్లోపు భోజనాన్ని తినమని చెబుతారు. అలా చేయడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిదని, కొన్ని రకాల అనారోగ్యాలు రాకుండా ఉంటాయని వివరిస్తారు. ఎవరైతే ఆలస్యంగా భోజనం చేస్తారో వారికి అనారోగ్యాలు త్వరగా వస్తాయని చెబుతున్నారు. కొంతమందికి రాత్రి 10 గంటలకు అన్నం తినే భోజనం చేసే అలవాటు ఉంటుంది. అలాగే అర్ధరాత్రి క్రేవింగ్స్ కూడా ఎక్కువే ఉంటాయి. అర్థరాత్రి టైంలో లేచి ఏదో ఒకటి తినేందుకు ప్రయత్నిస్తారు. ఇలా రాత్రిపూట ఆలస్యంగా తినేవారిలో క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు.
ఏ క్యాన్సర్ వస్తుంది?
రాత్రిపూట ఆలస్యంగా తినడం వల్ల అతిగా తినే అవకాశం ఉంది. అలాగే అధిక క్యాలరీలు ఉండే ఆహారాన్ని కూడా తీసుకోవాలనిపిస్తుంది. దీనివల్ల బరువు త్వరగా పెరుగుతారు. ఊబకాయం బారిన పడితే కొలెరెక్టల్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. క్యాన్సర్ అనేది పెద్ద పేగుకు వస్తుంది.
అర్ధరాత్రి తినడం వల్ల శరీరంలోనే సిర్కాడియన్ రిథమ్ కు అంతరాయం కలుగుతుంది. అలాగే జీర్ణక్రియకు కూడా అంతరాయం కలుగుతుంది. దీనివల్ల అజీర్ణం, మలబద్ధకం, యాసిడ్ రిఫ్లెక్స్ వంటి సమస్యలు వస్తాయి. జీర్ణ సమస్యలు కూడా తలెత్తుతాయి.
రాత్రిపూట భోజనం ఆరోగ్యకరంగా ఉండాలి. తక్కువ కేలరీలతో నిండి ఉండాలి. చక్కెర, అధిక కొవ్వు ఉండే పదార్థాలు తీసుకోకూడదు. కానీ ఎప్పుడైతే రాత్రి భోజనం ఆలస్యం అవుతుందో అప్పుడు శరీరం అధిక కొవ్వు ఉన్న పదార్థాలను, చక్కెర ఉన్న స్నాక్స్ ను కోరుకుంటుంది. అలాగే ఆల్కహాల్ తాగే వారి సంఖ్య కూడా ఎక్కువే. దీనివల్ల కొలెరెక్టల్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం మరింతగా పెరుగుతుంది.
రాత్రిపూట ఆలస్యంగా తినడం వల్ల అధిక కార్బోహైడ్రేట్లు, చక్కెర కలిగిన ఆహారాలు తినాలని అనిపిస్తుంది. దీని వల్ల ఇన్సులిన్ స్థాయిలు పెరిగిపోతాయి. ఇన్సులిన్ నిరోధకత సమస్య పెరుగుతుంది. దీనివల్ల శరీరంలో ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది. ఇది కొలరెక్టల్ క్యాన్సర్ అభివృద్ధిని ప్రోత్సహించే అవకాశం ఎక్కువ.
మిడ్ నైట్ క్రేవింగ్స్ ఉన్న వారిలో నిద్రావిధానాలు మారిపోతాయి. నిద్రా నాణ్యత తగ్గుతుంది. దీనివల్ల రోగనిరోధక పనితీరు మారిపోతుంది. హార్మోన్ల నియంత్రణ కూడా సమస్యల్లో పడుతుంది. దీనివల్ల మల క్యాన్సర్ వచ్చే అవకాశం పెరుగుతుంది.
మొత్తంగా చెప్పాల్సిందేంటంటే నిద్ర తగ్గడం, చెడు ఆహారపు అలవాట్లు కారణంగా కొలరెక్టల్ క్యాన్సర్ వచ్చే అవకాశం పెరుగుతుంది. కొలరెక్టల్ క్యాన్సర్ రాకుండా ఉండాలంటే సమతుల్యమైన ఆహారాన్ని తీసుకోవాలి. సరైన సమయంలో భోజనం చేయాలి. రాత్రిపూట ఎనిమిది గంటల్లోపే భోజనాన్ని పూర్తి చేయాలి. భోజనం చేశాక ఒక గంటపాటు నిద్రపోకుండా ఉండడం మంచిది. మీరు తినే ఆహారంలో పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్లు ఉండేలా చూసుకోండి. బరువు పెరగకుండా జాగ్రత్త పడండి. ఆరోగ్యకరమైన బరువు వల్ల అనారోగ్యాలు రాకుండా ఉంటాయి.