Bone Cancer Symptoms: ఈ లక్షణాలు కనిపిస్తే తేలిగ్గా తీసుకోకండి, ఇవి ఎముక క్యాన్సర్ సంకేతాలు-do not take it lightly if these symptoms appear they are signs of bone cancer ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Bone Cancer Symptoms: ఈ లక్షణాలు కనిపిస్తే తేలిగ్గా తీసుకోకండి, ఇవి ఎముక క్యాన్సర్ సంకేతాలు

Bone Cancer Symptoms: ఈ లక్షణాలు కనిపిస్తే తేలిగ్గా తీసుకోకండి, ఇవి ఎముక క్యాన్సర్ సంకేతాలు

Haritha Chappa HT Telugu
May 23, 2024 05:00 PM IST

Bone Cancer Symptoms: క్యాన్సర్ శరీరంలో ఎక్కడైనా రావచ్చు. చివరకు గట్టిగా ఉండే ఎముకలకు కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. వాటి లక్షణాలు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

ఎముక క్యాన్సర్ లక్షణాలు
ఎముక క్యాన్సర్ లక్షణాలు (Pexels)

Bone Cancer Symptoms: క్యాన్సర్ శరీరంలో మెత్తగా ఉన్న అవయవాల్లోనే వస్తుందని ఎక్కువమంది అనుకుంటారు. నిజానికి ఇది దృఢంగా ఉండే ఎముకలలో వృద్ధి చెందే అవకాశం ఉంది. మన శరీరంలో 206 ఎముకలు ఉంటాయి. ఈ ఎముకల్లో ఎక్కడైనా కూడా క్యాన్సర్ కణితులు పెరిగే ఛాన్సులు ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. ఎముక క్యాన్సర్ వస్తే కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తాయి. వీటిని విస్మరించకూడదు. వెంటనే వైద్యలను కలిసి తగిన చికిత్స తీసుకోవడం ముఖ్యం.

yearly horoscope entry point

ఎముక నొప్పి

ఎముక క్యాన్సర్ ఉన్నవారికి సాధారణంగా ఎముకలు నొప్పి పెడుతూ ఉంటాయి. నిరంతరం ఈ నొప్పి కలుగుతూనే ఉంటుంది. ఈ నొప్పి తీవ్రంగా ఉంటుంది. విశ్రాంతి కూడా లభించదు. పడుకున్నా, కూర్చున్నా ఎముక నొప్పి వస్తూనే ఉంటుంది. రాత్రిపూట ఈ నొప్పి మరీ ఎక్కువవుతుంది. 70 శాతం మందికి ఈ లక్షణం ప్రాథమికంగా కనిపించింది. ఎముక పని తీరును, నిర్మాణాన్ని దెబ్బతీసే క్యాన్సర్ కణాల కారణంగానే ఈ నొప్పి వస్తుంది.

గడ్డలు కట్టడం

ఎముక క్యాన్సర్ సోకిన వారిలో వాపు, శరీరంపై గడ్డలు కట్టడం వంటివి కనిపిస్తూ ఉంటాయి. ఎముకలో ఏ ప్రాంతంలోని క్యాన్సర్ సోకిందో... ఆ ప్రాంతంలోని చర్మం పై వాపు కనిపిస్తుంది. అలాగే తాకితే గట్టిగా ముద్దలాగా అనిపిస్తుంది. కొంతమంది దీన్ని ఆర్థరైటిస్ లేదా ఏదైనా గాయం అనుకుంటూ ఉంటారు. ఇలా తేలిగ్గా తీసుకోకుండా వెంటనే వైద్యులను కలిసి పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం. చేతుల్లో, కాళ్లు, పొత్తి కడుపు వంటి ప్రాంతాల్లో ఉన్న ఎముకలకు క్యాన్సర్ సోకితే వాపు ఎక్కువగా కనిపిస్తుంది. అక్కడ చర్మం వేడిగా అనిపిస్తుంది. ఎరుపు రంగులోకి మారుతుంది.

జ్వరం

క్యాన్సర్ సోకిన వారిలో ఎక్కువగా జ్వరం బారిన పడుతూ ఉంటారు. అలాగే ఎముక క్యాన్సర్ సోకినా కూడా జ్వరం వస్తుంది. అలాగే రాత్రిపూట చెమటలు పడుతూ ఉంటాయి. శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ కాన్సర్ కణాలతో పోరాడడానికి ప్రయత్నిస్తున్నా జ్వరం వస్తుంది. రాత్రి చెమటలు పట్టడం అనేది సాధారణ లక్షణం కాదు. జ్వరం ఎక్కువగా రావడం, రాత్రి చెమటలు పెట్టడం అంటే లక్షణాలు కనిపిస్తే... ఎముక క్యాన్సర్ అధునాతన దశలో ఉందని అర్థం. ఇది ఇతర శరీర భాగాలకు వ్యాపించే అవకాశం ఉందని కూడా అర్థం చేసుకోవాలి.

పగుళ్లు కనిపించడం

ఎముక క్యాన్సర్ సోకిన వారిలో ఎముకలు చాలా బలహీనమవుతాయి. వాటిపై పగుళ్లు వస్తాయి. రోజువారీ పనులు చేయలేరు. చిన్నచిన్న బరువులు ఎత్తలేరు. ఈ క్యాన్సర్ కణాలు ఎముక నిర్మాణాన్ని దెబ్బతీస్తాయి. దీని వల్ల అవి పెళుసుగా మారుతాయి. అప్పుడు నొప్పి ఎక్కువగా అనిపిస్తుంది. ఆ ప్రాంతంలో వాపు కూడా కనిపిస్తుంది.

కదలలేకపోవడం

ఎముక క్యాన్సర్ సోకితే ఎక్కడ, ఏ ప్రాంతంలో ఆ క్యాన్సర్ సోకిందో అక్కడ శరీరాన్ని కదల్చడం కష్టమవుతుంది. కాళ్లు చేతుల్లో అయితే పనులు చేయలేరు. క్యాన్సర్ వల్ల తీవ్రమైన నొప్పి కలుగుతుంది. ఎముక నిర్మాణం దెబ్బతింటుంది. దీని వలన ఆ ఎముక ఉన్న ప్రాంతంలో కదలిక కష్టంగా మారిపోతుంది. వారి శారీరక పనితీరులో తగ్గుదల ఉంటుంది. ఏ పని చేసుకోలేరు. రోజువారీ కార్యకలాపాలు చేసుకోవడం కష్టంగా మారుతుంది. దీనివల్ల మొత్తం జీవన నాణ్యతే తగ్గిపోతుంది.

పైన చెప్పిన లక్షణాలు కనిపిస్తే తేలిగ్గా తీసుకోకుండా వెంటనే వైద్యులను కలిసి తగిన పరీక్షలు చేయించుకోవాలి. దీని వల్ల ప్రాథమిక దశలోనే వ్యాధిని గుర్తించి తగిన చికిత్స తీసుకునే అవకాశం ఉంటుంది.

Whats_app_banner