National Dengue day 2024: డెంగ్యూను ‘ఎముకలు విరిచే జ్వరం’ అని ఎందుకు పిలుస్తారు? డెంగ్యూ వస్తే వెంటనే ఏం చేయాలి?
National dengue day 2024: ప్రమాదకరమైన జ్వరాలలో డెంగ్యూ ఒకటి. దీనిపై అవగాహన కల్పించేందుకు ప్రతి ఏడాది మే 16న నేషనల్ డెంగ్యూ డేను నిర్వహించుకుంటారు.
National dengue day 2024: జాతీయ డెంగ్యూ దినోత్సవం ప్రతి ఏడాది మే 16న దేశవ్యాప్తంగా నిర్వహించుకుంటారు. ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈ దినోత్సవాన్ని ప్రారంభించింది. తొలిసారిగా 2010లో ఈ ప్రత్యేక దినోత్సవాన్ని నిర్వహించారు. అప్పటినుంచి ప్రతి ఏటా డెంగ్యూ జ్వరంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తూనే ఉన్నారు.
డెంగ్యూ ప్రమాదకరమైన జ్వరాలలో ఒకటి. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఈ డెంగ్యూ బారినపడి మరణిస్తున్నారు. డెంగ్యూ జ్వరం బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలో ప్రతి ఏడాది మే 16న ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ఉంటారు.
డెంగ్యూ అంటే?
డెంగ్యూ అనేది దోమ వల్ల సోకే ఒక ఇన్ఫెక్షన్ నాలుగు రకాల వైరస్ రకాలు డెంగ్యూకి కారణం అవుతాయి. డెంగ్యూను ‘బ్రోకెన్ బోన్స్ ఫీవర్’ అని కూడా పిలుస్తారు. అంటే తెలుగులో ఎముకలు విరిచే జ్వరం అని అర్థం. ఎందుకంటే డెంగ్యూ సోకితే తీవ్రమైన కీళ్ల నొప్పులు వస్తాయి. ఎముకలు విరిగినంత నొప్పిని భరించాల్సి వస్తుంది. అందుకే ఆ పేరు డెంగ్యూకి పెట్టారు.
డెంగ్యూ లక్షణాలు
డెంగ్యూ దోమ పుట్టిన తర్వాత ఒక వ్యక్తిలో మూడు రోజుల నుండి 14 రోజులలో డెంగ్యూ లక్షణాలు బయటపడతాయి. తీవ్ర జ్వరం రావడం, కళ్ళు నొప్పులు పెట్టడం, కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు, తలనొప్పి, వాంతులు, వికారం, చిగుళ్లలో రక్తస్రావం కావడం, చర్మంపై దద్దుర్లు రావడం ఇవన్నీ కూడా డెంగ్యూ జ్వరం లక్షణాలే.
డెంగ్యూ షాక్ సిండ్రోమ్ వచ్చే అవకాశం
డెంగ్యూ వచ్చిన వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. డెంగ్యూ షాక్ సిండ్రోమ్ కూడా కలిగే అవకాశం ఉంది. దీనివల్ల ప్రాణాంతక సమస్యలు రావచ్చు. డెంగ్యూ వల్ల అధిక జ్వరం వస్తుంది. అలాంటప్పుడు రక్తనాళాలు పగిలి శోషరస నాళాలు దెబ్బతింటాయి. రక్తనాళాలు చేరడం వల్ల రక్తస్రావం కూడా అవుతుంది. అప్పుడు రక్తప్రసరణకు ఆటంకం కలుగుతుంది. దీనివల్ల ప్రాణాలే ప్రమాదంలో పడతాయి. రోగికి కాలేయం, గుండె సంబంధిత వ్యాధులు కూడా వస్తాయి.
డెంగ్యూ బారిన పడకుండా ఉండాలంటే దోమలకు దూరంగా ఉండాలి. దోమల బారిన పడకుండా పొడవాటి చేతులున్న దుస్తులను కట్టుకోవాలి. ఇంటి చుట్టూ క్రిమి సంహారక మందులు చల్లుతూ ఉండాలి. నీటి గుంటలు, తడి చెత్త ఉండకుండా చూసుకోవాలి. టైర్లు, గిన్నెల్లో నీళ్లు నిలవ లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే నీరు ఉన్నచోటే దోమలు అధికంగా పెరుగుతాయి. డెంగ్యూ సోకిన రోగులను చూసుకునే వారికి కూడా ఈ ఇన్ఫెక్షన్స్ సోకే అవకాశం ఉంది. కాబట్టి వారు కూడా జాగ్రత్తగా ఉండాలి.
డెంగ్యూ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఇంటి వద్ద చికిత్సలు తీసుకోవడం మంచి పద్ధతి కాదు. డెంగ్యూ సోకాక వైద్యులు సూచించిన మందులను వినియోగిస్తూ ఉండాలి. ప్రతిరోజూ కనీసం మూడు లీటర్ల నీటిని తాగాలి. ఎందుకంటే డెంగ్యూ వల్ల శరీరం డిహైడ్రేషన్ బారిన పడుతుంది. డెంగ్యూలో ప్లేట్లెట్స్ తగ్గిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఎప్పటికప్పుడు ప్లేట్లెట్స్ ను కూడా పరీక్షించుకుంటూ ఉండాలి.
టాపిక్