Digestive Health । జీర్ణక్రియకు మేలు చేసే, కీడు చేసే ఆహారాల జాబితా చూడండి!
Digestive Health: మనం రోజూ తినే ఆహారం మన జీర్ణక్రియ సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది. పోషకాహార నిపుణులు మీ జీర్ణక్రియకు మేలు చేసే , కీడు చేసే ఆహార పదార్థాల గురించి తెలియజేశారు.
Digestive Health: మీరు తరచుగా అజీర్తి, గ్యాస్, ఆసిడిటీ, మలబద్ధకం మొదలైన జీర్ణ సమస్యలతో? మీ ఆహారపు అలవాట్లు ఈ సమస్యలకు మూలం కావచ్చు. మనం రోజూ తినే ఆహారం కూడా జీర్ణ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది, పేగులోని మైక్రోబయోటాలో అసమతుల్యతను కలిగిస్తుంది. మైక్రోబయోటా అంటే జీర్ణవ్యవస్థలో నివసించే అనేక లక్షల సూక్ష్మజీవుల కమ్యూనిటీ. శరీరంలో జీర్ణక్రియ జరపడం, జీవక్రియ నుండి విషాన్ని తొలగించడం, రోగనిరోధక శక్తిని చురుగ్గా ఉంచడం వరకు వివిధ కీలకమైన విధుల్లో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
ఈరోజుల్లో చాలా మంది కడుపులో అసౌకర్యం, నొప్పి, ఉబ్బరం, అపానవాయువు, విరేచనాలు, గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ డిసీజ్ (GERD) వంటి అనేక రకాల జీర్ణ సమస్యలతో బాధపడుతున్నారు. ఆహారాన్ని విచ్ఛిన్నం చేయాలన్నా, పోషకాలు శరీరంలోకి శోషణ జరగాలన్నా జీర్ణవ్యవస్థ ముఖ్యమైనది. కాబట్టి మన జీర్ణవ్యవస్థకు సరిపడే ఆహారాన్ని తీసుకోవాలి.
సంతృప్త కొవ్వులు అధికంగా ఉన్న ఆహారం, ఫైబర్ లేని ఆహారం, చక్కెర ఎక్కువగా ఉండే ఆహారం మొదలైనవి మంటను కలిగిస్తాయి అది పేగు లైనింగ్‌ను దెబ్బతీస్తుంది. తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు మొదలైన ఆరోగ్యకరమైన, వైవిధ్యమైన ఆహారాన్ని తినడం వల్ల అవి మైక్రోబయోటా ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి.
న్యూట్రిషనిస్ట్, లైఫ్‌స్టైల్ కోచ్ అనుపమ మీనన్ హెచ్‌టి డిజిటల్‌తో మాట్లాడుతూ, జీర్ణక్రియకు ఉత్తమమైన అహారాలు అలాగే జీర్ణక్రియకు సరిపడని ఆహారాల గురించి వివరణ ఇచ్చారు. అవేమిటో మీరూ తెలుసుకోండి.
జీర్ణక్రియకు మేలు చేసే ఆహారాలు
ఈ కింద జీర్ణక్రియకు ఉత్తమంగా భావించే ఆహార పదార్థాల జాబితా ఉంది. ఇటువంటి ఆహారం తినడం మీ కడుపుకు చాలా మంచిది. ఎలాంటి జీర్ణ సమస్యలు ఉండవు.
1. పులియబెట్టిన ఆహారాలు: పెరుగు, కిమ్చి, సౌర్‌క్రాట్, కేఫీర్, కొంబుచా, మిసో , ఊరబెట్టిన దోసకాయలు మీ ప్రేగు ఆరోగ్యానికి అద్భుతమైనవి. ఈ ఆహారాలలో ప్రోబయోటిక్స్ ఉంటాయి, ఇవి జీర్ణాశయంలోని ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాను సమతుల్యం చేయడానికి, హానికరమైన బ్యాక్టీరియా నుండి రక్షించడానికి సహాయపడతాయి. గ్యాస్ , ఉబ్బరం సమస్యలు ఉండవు. మీ ఆహారంలో పులియబెట్టిన పదార్థాలను కలుపుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందించవచ్చు.
2. తృణధాన్యాలు: సంపూర్ణ గోధుమలు, ఓట్స్, బార్లీ, బుక్‌వీట్, బ్రౌన్ రైస్, క్వినోవా, పాప్‌కార్న్ మొదలైనవి తృణధాన్యాలకు ఉదాహరణలు. వీటిలో ప్రీబయోటిక్స్ ఉంటాయి, ఇవి ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాకు ఆహారం. వీటిలోని అధిక పోషకాలు, ఫైబర్, మలాన్ని ముద్దగా చేయడానికి సహాయపడతాయి, ఇది మలబద్ధకాన్ని నివారించడంలో సహాయపడుతుంది.
3. పండ్లు: ఆపిల్స్, పియర్స్, అరటిపండ్లు, రాస్ప్ బెర్రీలు, బొప్పాయిలు మీ జీర్ణాశయానికి ఉత్తమమైన పండ్లు. ఈ పండ్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది. అలాగే జీర్ణక్రియకు సహాయపడే విటమిన్లు , ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. వివిధ రకాల పండ్లను తినడం వల్ల పేగు ఆరోగ్యం బాగుంటుంది.
4. హెర్బల్ టీ: పుదీనా, అల్లం, డాండెలైన్, ఫెన్నెల్, కామోమైల్ వంటి టీలు ఆరోగ్యకరమైనవి. భోజనం తర్వాత కొంతసమయం ఆగి ఇలాంటి ఒక టీ తాగడం వల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్, వికారం, కడుపు తిమ్మిరి, గుండెల్లో మంట వంటి అనేక జీర్ణ లక్షణాల నుండి ఉపశమనం పొందవచ్చు. పొత్తికడుపు కండరాలను సడలించడం ద్వారా ఆహార కొవ్వులను విచ్ఛిన్నం చేయడానికి టీ సహాయపడుతుంది.
జీర్ణక్రియకు కీడు చేసే ఆహారాలు
ఈ కింద పేర్కొన్నవి జీర్ణక్రియకు హానికరమైన ఆహార పదార్థాలు. వీటిని తరచుగా తినడం వలన అది అనేక జీర్ణ సమస్యలకు కారణమవుతాయి.
1. వేయించిన ఆహారం: వేయించిన ఆహారంలో ఫైబర్ తక్కువగా ఉంటుంది, విరేచనాలకు కారణమవుతుంది. ఫ్రై చేసినవి తరచుగా తినడం వల్ల మీ పేగు ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది.
2. ప్రాసెస్ చేసిన ఆహారం: శుద్ధి చేసిన ఆహారాలలో పోషకాలు లోపిస్తాయి. చక్కెర కంటెంట్ ఎక్కువ ఉంటుంది, ఫైబర్ తక్కువ ఉంటుంది, ప్రిజర్వేటివ్స్ కలిగి ఉంటుంది. ఈ రకమైన ఆహారాలు మలబద్ధకం సహా ఇతర జీర్ణ సమస్యలను కలిగిస్తాయి.
3. కృత్రిమ స్వీటెనర్లు: కృత్రిమ స్వీటెనర్లు పొత్తికడుపు తిమ్మిరి, విరేచనాలకు దోహదం చేస్తాయి.
4. ఆల్కహాల్: ఆల్కహాల్ జీర్ణవ్యవస్థకు చికాకును కలిగిస్తుంది, జీర్ణక్రియను నెమ్మదిస్తుంది, యాసిడ్ ఉత్పత్తిని ప్రభావితం చేస్తుంది, కడుపులో అసౌకర్యాన్ని కలిగిస్తుంది.
5.పప్పులు, చిక్కుళ్ళు: ఇవి కొన్నిసార్లు పొత్తికడుపులో అసౌకర్యాన్ని కలిగిస్తాయి. సున్నితత్వం ఉన్నవారికి గ్యాస్ ఏర్పడటాన్ని తగ్గిస్తుంది. కాబట్టి వీటిని నానబెట్టి, వంట సోడాతో ఆవిరిలో ఉడికించడం మంచిది.
సంబంధిత కథనం