Rules To Drink Tea । టీ తాగడానికి సరైన సమయం ఏది? భోజనం తర్వాత టీ తాగితే జరిగేదిదే!
Rules To Drink Tea: ప్రపంచంలోని చాలా మంది ప్రజలు ఉదయం ఒక కప్పు టీతో తమ రోజును ప్రారంభిస్తారు. అయితే టీ తాగడానికి కొన్ని నియామాలు, నిర్ధిష్ట సమయాలు ఉంటాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవి ఇక్కడ తెలుసుకోండి.
Rules To Drink Tea: మనలో చాలా మంది ప్రతీరోజూ క్రమం తప్పకుండా తాగే పానీయం ఏదైనా ఉందా అంటే ఒకటి తాగే నీరు అయితే రెండోది కచ్చితంగా ఒక కప్పు టీ. ఉదయం వేళ ఒకసారి, మధ్యాహ్నం లంచ్ తర్వాత ఒకసారి, సాయంత్రం వేళ ఒకసారి, బ్రేక్ తీసుకున్న ప్రతీసారి కడుపులోకి టీ వెళ్లాల్సిందే.

అయితే ఇలా ఎప్పుడంటే అప్పుడు ఎక్కువ కప్పుల టీ తీసుకోవడం వల్ల పోషకాల శోషణ తగ్గుతుంది, ఆందోళన పెరుగుతుంది, నిద్ర నాణ్యతపై ప్రభావం చూపుతుంది, గుండెల్లో మంట పుడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అదే సమయంలో మితంగా టీ తాగడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. మితంగా తాగితే శక్తిని పెంచడంలో సహాయపడుతుంది, గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది, కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది, బరువు తగ్గడంలో సహాయపడుతుంది.
అంతేకాదు టీ ఎప్పుడంటే అప్పుడు తాగకూడదు. టీ తాగడానికి సరైన సమయాన్ని తెలుసుకోవడం ముఖ్యం. టీ తాగటానికి కూడా కొన్ని నియమాలు, నిర్ధిష్టమైన సమయాలు ఉన్నాయని HT లైఫ్‌స్టైల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో డైటీషియన్, న్యూట్రిషనిస్ట్ అయిన సాక్షి లాల్వానీ చెప్పారు.
టీ మీ శరీరాన్ని వేడి చేస్తుంది, ఆహారంలో ఆరోగ్యాన్ని పెంపొందించే పదార్థాలను మిళితం చేస్తుంది. అదే సమయంలో, టీలో కూడా కెఫీన్ ఉంటుందని చాలా మంది టీ తాగేవారికి తెలియదు. తేయాకు పండించే విధానం, ప్రాసెస్ చేసే విధానం ఆధారంగా,- మీరు వాడే టీ పొడిలో కెఫిన్ కంటెంట్ మారుతూ ఉంటుంది, కాబట్టి సమయానుసారంగా, నియమాలకు లోబడి టీ తాగాలని సాక్షి తెలిపారు.
Tea After Meal - భోజనం తర్వాత టీ తాగవచ్చా?
టీలో కెఫిన్ ఉంటుంది, ఇది మన శక్తిని పెంచుతుంది, జీర్ణవ్యవస్థకు మద్దతు ఇస్తుంది. ఈ ప్రకారంగా భోజనం చేసిన తర్వాత టీ తాగడం అర్ధవంతమైనదే. కానీ, టీలో టానిక్ యాసిడ్ కూడా ఉంటుంది. ఇది ఆహారంలోని ప్రోటీన్, ఐరన్ కంటెంట్‌తో చర్య జరుపుతుంది. ఫలితంగా, ఈ పోషకాలు శరీరానికి అందవు. అందువల్ల అల్పాహారం లేదా భోజనం చేసిన వెంటనే టీ, కాఫీలు తాగకూడదు. సుమారు పదిహేను నుండి ఇరవై నిమిషాల గ్యాప్ తర్వాత తాగవచ్చునని సిఫారసు చేస్తున్నారు. అయితే రాత్రి భోజనం తర్వాత టీ తాగడం అంత మంచిది కాదు, ఇది నిద్రకు భంగం కలిగిస్తుందని సాక్షి లాల్వానీ తెలిపారు.
ఒకవేళ రాత్రిపూట టీ తాగాలనుకుంటే, రాత్రి 8:30 గంటలకు తాగడం ఉత్తమ సమయంగా పేర్కొన్నారు. ఎందుకంటే ఈ సమయంలో జీర్ణక్రియ చాలా బలంగా ఉంటుంది, జీవక్రియలో కెఫీన్ సహాయపడుతుంది.
మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో టీ తాగడం వల్ల శరీరానికి చాలా మేలు జరుగుతుంది, ఎందుకంటే ఇది మన రోగనిరోధక శక్తిని పెంచుతుంది, ఫ్లూ, జలుబులను నివారిస్తుంది.
Tea On Empty Stomach -ఖాళీ కడుపుతో టీ తాగవచ్చా?
టీలో ఆమ్లత్వం కలిగించే టానిన్లు ఉంటాయి. ఎవరికైనా ఇదివరకే ఆసిడిటీ సమస్యలు ఉన్నట్లయితే, ఉదయం ఖాళీ కడుపుతో టీ తాగకుండా ఉండాలని చెబుతున్నారు. అయితే పాలు ఎక్కువ కలుపుకొని తేలికైన టీ తాగవచ్చునని న్యూట్రిషనిస్టులు పేర్కొన్నారు.
Tea Making Tips- టీని ఎక్కువసేపు ఉడకబెట్టవద్దు. టీ ప్రయోజనాలను పొందాలంటే తక్కువ ఉష్ణోగ్రతలోనే ఉంచాలి.
- చాయ్ చేసేటపుడు పాలు, పంచదార ఎక్కువగా వేయకూడదు. టీ నిజమైన సారాంశం పాలు, చక్కెర లేకుండా కేవలం నీరు కలపడం ద్వారా ఆస్వాదించవచ్చు. పాలు కలపాలనుకుంటే పాలు విడిగా వేడిచేసి, ఆపై డికాషన్ లో కలపవచ్చు.
- టీ బ్యాగులను ఉపయోగించవద్దు. బదులుగా వదులుగా లభించే టీ ఆకులను ఉపయోగించండి.
బ్లాక్ టీ, మచా టీలో అత్యధిక కెఫీన్ స్థాయిలు ఉండగా, గ్రీన్ టీ మీడియం స్థాయిలను కలిగి ఉంటుంది. ఊలాంగ్ టీలో మిగతా వాటి కంటే తక్కువ కెఫిన్ ఉంటుంది. హెర్బల్ టీలో కెఫీన్ సున్నా ఉంటుంది. కాబట్టి అన్నింటికంటే హెర్బల్ టీలు ఉత్తమమైనవిగా నిపుణులు పేర్కొన్నారు.
సంబంధిత కథనం