Tea On Empty Stomach | ఖాళీ కడుపుతో టీ, కాఫీలు తాగుతున్నారా? ఆ పని చేయకండి!-never drink tea or coffee on an empty stomach here is why ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Tea On Empty Stomach | ఖాళీ కడుపుతో టీ, కాఫీలు తాగుతున్నారా? ఆ పని చేయకండి!

Tea On Empty Stomach | ఖాళీ కడుపుతో టీ, కాఫీలు తాగుతున్నారా? ఆ పని చేయకండి!

HT Telugu Desk HT Telugu
Aug 01, 2022 07:33 AM IST

ఉదయం నిద్రలేచిన వెంటనే ఖాళీ కడుపుతో టీ లేదా కాఫీ తాగటం ఆరోగ్యానికి హానికరం అని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. కచ్చితంగా అల్పాహారం చేసిన తర్వాత లేదా అల్పాహారంతో పాటుగా తీసుకోవాలని సూచిస్తున్నారు. ఖాళీ కడుపుతో తాగితే ఏం జరుగుతుందో ఇక్కడ తెలుసుకోండి.

Drinking Tea with empty stomach
Drinking Tea with empty stomach (iStock)

మనలో చాలామందికి ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ చేసినా, చేయకపోయినా ఒక కప్పు చాయ్ మాత్రం కచ్చితంగా తాగాలనిపిస్తుంది. నిద్రలేచి, బ్రష్ చేసుకున్న వెంటనే చాయ్ కోసం తహతహలాడుతారు. ఇది వారి సంస్కృతిలో భాగం అయిపోయింది. ఎప్పట్నించో ఉన్న అలవాటు కారణంగా కొంతమందికి ఇది ఒక వ్యసనంగా కూడా మారిపోయింది. ఉదయం పూట చాయ్ తాగకుండా అస్సలు ఉండలేరు. అయితే ఖాళీ కడుపుతో టీ లేదా కాఫీ తాగటం వలన అది అనర్థాలకు దారితీస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

అలాగే నిద్రలేచిన వెంటనే బెడ్ కాఫీ తీసుకోవడం సరికాదు. ఈ 'బెడ్-టీ కల్చర్’ మీ ఆరోగ్యం విషయంలో ఆందోళన కలిగించే విషయం అవుతుంది. నిద్రలేచిన వెంటనే వాటిని తాగడం మీ శరీరానికి హాని కలిగించవచ్చు.

అల్పాహారంతో పాటుగా టీ తాగడం అలవాటు చేసుకోవాలి. ఖాళీ కడుపుతో టీ తీసుకోవడం కొన్ని ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుందని చెబుతున్నారు. చాలా మంది పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం ఖాళీ కడుపుతో చాయ్ లేదా కాఫీ తాగితే అది అజీర్ణం, గుండెల్లో మంటను కలిగిస్తుంది.

ఖాళీ కడుపుతో చాయ్, కాఫీలు తాగితే ఎలాంటి ప్రతికూల ప్రభావాలు ఉండవచ్చో ఇక్కడ తెలుసుకోండి.

ఉబ్బరం, ఏసిడిటీ

ఉదయాన్నే ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల అది కడుపు ఉబ్బరం లేదా మీ జీర్ణాశయంలో గ్యాస్ ఉత్పత్తి కావడానికి కారణం అవుతుంది. టీ, కాఫీలు ఆమ్ల స్వభావం కలిగి ఉంటాయి. అందువల్ల వాటిని ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల శరీరంలో యాసిడ్-ఆల్కలీన్ . సమతుల్యత దెబ్బతింటుంది, ఇది ఎసిడిటీని కలిగిస్తుంది. కాబట్టి కాబట్టి ఖాళీకడుపుతో పాలతో తయారు చేసిన కాఫీ, టీలు తీసుకోవద్దు. అయితే మీరు మేల్కొన్న తర్వాత గోరువెచ్చని నీటిలో ఒక చిటికెడు ఉప్పు, నల్ల మిరియాలు కలిపి కప్పు నిమ్మరసం లాంటి హెర్బల్ టీలు తాగవచ్చు.

మైకము కలిగిస్తుంది

కాఫీలో ఉండే కెఫీన్ అనే సమ్మేళనం కలిగించే దుష్ప్రభావాలలో మైకం ఒకటి. నిద్రలేచిన వెంటనే ఖాళీ కడుపుతో కాఫీ తాగితే అది డీహైడ్రేషన్ కు కారణం అవుతుంది. మైకం కమ్ముకుంటుంది. చురుకుగా అనిపించదు.

మలబద్దకం సమస్య

టీలో థియోఫిలిన్ అనే సమ్మేళనం కూడా ఉంటుంది, ఇది నిర్జలీకరణ ప్రభావాన్ని కలిగి ఉంటుంది, మలాన్ని నిర్జలీకరణం చేస్తుంది. ఫలితంగా మలబద్ధకం సమస్య కలుగుతుంది. అయితే ఆరోగ్యకరమైన ఆహారం, పీచు పదార్థాలు ఇంకా వ్యాయామం వంటివి అలవాటు ఉంటే మలబద్ధకాన్ని నివారించవచ్చు.

క్రమరహిత హృదయ స్పందన

ఖాళీ కడుపుతో కాఫీ, టీలు తాగేవారిలో కొందరు అరిథ్మియాను అనుభవించినట్లు నివేదికలు తెలిపాయి. ఇది ముఖ్యంగా కెఫిన్ వల్ల కలిగే హృదయ స్పందన రేటు పెరుగుదల. ఈ క్రమరహిత హృదయ స్పందన ఒక విధమైన ఆందోళనను కలిగిస్తుంది.

దంత సమస్యలు

ఉదయం లేచిన వెంటనే మొట్టమొదటగా టీ లేదా కాఫీ తీసుకుంటే నోటిలోని బ్యాక్టీరియా టీ, కాఫీలోని చక్కెరను విచ్ఛిన్నం చేస్తుంది. ఇది నోటిలో యాసిడ్ స్థాయిలను పెంచుతుంది. ఈ కారణంగా దంత ఎనామిల్ కోతకు కారణమవుతుంది. దీంతో దంత క్షయం, ఇతర నోటి సమస్యలు ఏర్పడవచ్చు.

కాబట్టి కాఫీ, టీలు ఎప్పుడు తాగినా కడుపు ఖాళీగా లేకుండా చూసుకోండి. అల్పాహారం, లేదా ఏవైనా స్నాక్స్ తింటూ తీసుకోవచ్చు. సాధారణంగా భోజనం చేసిన 1-2 గంటల తర్వాత టీ తాగడం ఉత్తమం. వర్కవుట్‌లకు ముందు కాఫీ తాగడం మంచిదని సిఫార్సు చేస్తున్నారు, ఎందుకంటే ఇది మీకు శక్తినిస్తుంది అలాగే అదనపు కేలరీలను బర్న్ చేయడంలో సహాయపడుతుంది.

అయితే నిద్రపోయే ముందు మాత్రం కాఫీ తాగడం మానుకోండి ఇది రాత్రి సమయంలో చాలాసార్లు నిద్రకు అంతరాయం కలిగించవచ్చు. నిద్రలేమి సమస్యలతో బాధపడాల్సి ఉంటుంది.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్