Flatulence Remedies | అపానవాయువును ఆపుకోలేకపోతున్నారా? ఇవిగో నివారణ మార్గాలు!
Flatulence Remedies: అపానవాయువు లేదా గ్యాస్ ఇబ్బంది కలిగించే సమస్య. కొన్నిసార్లు అపానవాయువును నియంత్రించలేము, అసాధ్యమైన పని కావచ్చు. అయితే ఇక్కడ కొన్ని ఇంటి నివారణలు ఉన్నాయి, వీటిని పాటించి చూడండి.
కడుపులో గ్యాస్ తయారవటానికి అనేక కారణాలున్నాయి. శరీరంలో తయారైన అపానవాయువు జీర్ణవ్యవస్థ నుండి మలమార్గం గుండా బయటకు వెళ్తుంది. దీనిని సాధారణంగా ఇంగ్లీషులో 'పాసింగ్ విండ్' లేదా 'ఫార్టింగ్' అని పిలుస్తారు. తెలుగులో అయితే అపానవాయువు, పిత్తు లేదా శ్రద్దు అని పిలుస్తారు. ఈ అపానవాయువు శబ్దం లేకుండా వచ్చినపుడు దుర్వాసనగా ఉంటుంది, ఇతరులకు ఇబ్బందికరంగా, అసౌకర్యంగా అనిపిస్తుంది. శబ్ధంతో వస్తే మాత్రం అది మిమ్మల్ని నలుగురిలో నవ్వులపాలు చేస్తుంది.
అపానవాయువు తరచుగా అజీర్ణం లేదా మీరు తీసుకునే ఆహార పదార్థాల వలన ఉద్భవించే సమస్య. మనం ఏదైనా తినేటప్పుడు లేదా త్రాగినప్పుడు, ఆహారపదార్థాలు, పానీయాలతో పాటుగా కొంత గాలిని కూడా మింగేస్తాము. ఈ గాలిలోని ఆక్సిజన్, నైట్రోజన్ వంటి వాయువులు జీర్ణవ్యవస్థలో చిక్కుకొని పోతాయి. మన జీర్ణవ్యవస్థ మనం తీసుకున్న ఆహారాన్ని జీర్ణం చేస్తున్నప్పుడు, జీర్ణక్రియ ప్రక్రియలో భాగంగా హైడ్రోజన్, మీథేన్ లేదా కార్బన్ డయాక్సైడ్ వంటి వాయువులు విడుదలై మన కడుపులో పేరుకుపోతాయి. ఈ వాయువులు చాలా అసౌకర్యాన్ని కలిగిస్తాయి, దాదాపు ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఏదో ఒక సమయంలో గ్యాస్ సమస్యను ఎదుర్కొంటారు. కడుపులో అధికంగా పేరుకుపోయిన గ్యాస్ శరీరంలోని వ్యవస్థలు బయటకు పంపివేస్తాయి.
Stop Farting- Flatulence Remedies- అపానవాయువు నివారణలు
మీరు తరచుగా అపానవాయువు, గ్యాస్ వంటి ఇబ్బందులు ఎదుర్కొంటుంటే ఇక్కడ కొన్ని ఇంటి నివారణలు ఉన్నాయి. ఇవి మీకు గ్యాస్ సమస్యల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి.
వాము
అజ్వైన్ లేదా వాము విత్తనాలు మీ శరీరంలో చిక్కుకున్న గ్యాస్, కడుపు నొప్పుల నుండి ఉపశమనాన్ని అందించడంలో అత్యంత ప్రభావవంతమైనవి. మీరు భోజనం చేసిన తర్వాత లేదా ఎప్పుడైనా కడుపు ఉబ్బరం లేదా అపానవాయువును ఎదుర్కొంటున్నప్పుడు గోరువెచ్చని నీటిలో ఒక టీస్పూన్ వాము విత్తనాలు వేసి ఆ నీటిని తాగాలి.
జీరా
జీరా లేదా జీలకర్ర మంచి జీర్ణక్రియకు సహాయపడుతుంది. చాలా మంది డైటీషియన్లు, పోషకాహార నిపుణులు ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో ఒక గ్లాసు జీరా నీటిని తాగాలని సలహా ఇస్తారు. ఉబ్బరం లేదా అపానవాయువు సమస్యలను ఎదుర్కొంటున్నప్పుడు కూడా మీరు ఈ జీరా వాటర్ తాగితే ఉపశమనం లభిస్తుంది.
ఇంగువ
ఇంగువ మీ వంటగదిలో లభించే అద్భుతమైన పదార్థాలలో ఒకటి. ఇది యాంటీ ఫ్లాట్యులెంట్‌గా పనిచేస్తుంది, మీ కడుపులో అదనపు గ్యాస్‌కు కారణమయ్యే గట్ బ్యాక్టీరియా పెరుగుదలను అరికడుతుంది. మీరు ఒక టీస్పూన్ ఇంగువను ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కలిపి భోజనం తర్వాత లేదా మీకు అసౌకర్యంగా అనిపించినప్పుడు ఎప్పుడైనా తాగవచ్చు. అయితే దీన్ని ఎక్కువగా తీసుకోకండి, ఇది ఛాతీలో మంటను కలిగించవచ్చు.
లెమన్ సోడా
లెమన్ సోడా కూడా అపానవాయువు నుంచి విముక్తి కలిగిస్తుంది. మీరు ఒక గ్లాసు నీటిలో నిమ్మరసం, కొంచెం బేకింగ్ పౌడర్ మిక్స్ చేసి మీ స్వంత నిమ్మ సోడాను తయారు చేసుకోవచ్చు. భోజనం తర్వాత తీసుకుంటే గ్యాస్ నుండి తక్షణ ఉపశమనం పొందవచ్చు. ఇది భారీ భోజనం తర్వాత, ముఖ్యంగా రాత్రి భోజనం తర్వాత జీర్ణక్రియకు సహాయపడుతుంది.
త్రిఫల
త్రిఫల అనేది మలబద్ధకంతో సహా అనేక జీర్ణ రుగ్మతలను సరిచేయడంలో సహాయపడే దివ్యౌషధం. ఉబ్బరం, అపానవాయువు లేదా కడుపులో మరేదైనా అసౌకర్యాన్ని అనుభవిస్తున్నప్పుడు త్రిఫలాన్ని తీసుకోవచ్చు. ఒక టీస్పూన్ త్రిఫల పొడిని గోరువెచ్చని నీటిలో కలపి రోజుకు ఒకసారి త్రాగాలి.
అదనంగా ఉబ్బరం, అపానవాయువు సమస్యలను వదిలించుకోవడానికి మీ ఆహారంలో పుదీనా లేదా అల్లం గ్రీన్ టీని చేర్చుకోవచ్చు. అతిగా భోజనం చేయకుండా జీర్ణం అయ్యే స్థాయిలో భోజనం చేయడం ఉత్తమం.
సంబంధిత కథనం