ఈ మధ్య కాలంలో చాలా మందికి కడుపు సంబంధింత సమస్యలు తలెత్తడం సర్వసాధారణం అయింది. ఎసిడిటీ, ఉబ్బరం, అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలతో తరచూ ఇబ్బంది పడుతున్నారు. శరీరానికి అలవాటు లేని ఆహారాన్ని తినడం, అతిగా తినడంతో పాటు శారీరక శ్రమ అనేది లేకపోవడం వలన ఇలాంటి ఇబ్బందులు వస్తాయి. కొవ్వు పదార్ధాలు, మైదా, చక్కెరతో పాటుగా అప్పటికప్పుడు తయారుచేసి ఇచ్చే ప్రాసెస్ చేసిన ఆహారం తినడం వలన అవి, మీ పేగులో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాకు భంగం కలిగిస్తాయి. ఫలితంగా జీర్ణవ్యవస్థ పనితీరు మందగించి సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి సరైన జీర్ణక్రియ పునరుద్ధరించడం ముఖ్యం. అందుకు మన శరీరాన్ని, కడుపును డీటాక్స్ చేయాలి. డీటాక్స్ అంటే మన శరీరంలో ఉండి పోయిన మలినాలను తొలగించడం.
మన పేగులు కొన్ని లక్షల కోట్ల సూక్ష్మజీవులకు నిలయం. అవి జీర్ణక్రియ ప్రక్రియ, జీవక్రియలో కీలక పాత్ర పోషిస్తాయి. అయితే కొన్ని రకాల ఆహార పదార్థాలు పేగులో మంచి బ్యాక్టీరియా వృద్ధికి కారణం అవుతాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి, అదే సమయంలో మీ శరీరానికి సరైన పోషకాలను సరఫరా చేస్తాయి.
పోషకాహార నిపుణురాలు అవంతి దేశ్‌పాండే శరీరాన్ని డీటాక్స్ చేసి, పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరిచే మంచి పోషకాలతో నిండిన సూప్‌లు తాగవచ్చని సూచించారు. ఇందులో మాంసాహారులకు బాగా ఇష్టమైన పాయా సూప్ కూడా ఉంది. శాకాహారులైతే ఏదైనా మష్రూమ్-క్యారెట్ సూప్ లేదా బీట్‌రూట్ గంజి తాగవచ్చునని సూచించారు. మరి ఇందులో చాలా మందికి ఫేవరెట్ అయిన పాయా సూప్ ఎలా చేయాలో రెసిపీ ఇక్కడ అందిస్తున్నాం చూడండి.
ఈ మటన్ పాయా సూప్ సహజ కొల్లాజెన్‌ను కలిగి ఉంటుంది, ఇది ప్రేగు ఆరోగ్యాన్ని వేగంగా నయం చేయడంలో సహాయపడుతుంది. అలాగే ఈ శీతాకాలంలో దగ్గు, జలుబుల నుంచి ఉపశమనం కోసం మటన్ పాయా సూప్ రుచికరమైన, అత్యుత్తమ హోం రెమెడీ అని చెప్పవచ్చు. ఇది ఎంతో బలవర్థకమైనది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మరి ఇంకేం తిన్నది అరగకపోతే మటన్ పాయా సూప్ తాగేయండి, అంతా సెట్ అవుతుంది.