Radish Health Benefits। ఈ శీతాకాలంలో ముల్లంగిని తప్పకుండా తినండి, ఎందుకో తెలుసా?-must consume radish during this winter know surprising health benefits ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Radish Health Benefits। ఈ శీతాకాలంలో ముల్లంగిని తప్పకుండా తినండి, ఎందుకో తెలుసా?

Radish Health Benefits। ఈ శీతాకాలంలో ముల్లంగిని తప్పకుండా తినండి, ఎందుకో తెలుసా?

HT Telugu Desk HT Telugu

Radish Health Benefits: ముల్లంగి ఆరోగ్య ప్రయోజనాలు అనేకం. మలబద్ధకం నివారించవచ్చు, క్యాన్సర్ వ్యాధిని దూరం చేసుకోవచ్చు. ఈ చలికాలం ముల్లంగి ఎందుకు తినాలో ఇక్కడ చూడండి.

Radish Health Benefits (Pixabay)

ఏ సీజన్‌లో లభించే కూరగాయలు, పండ్లను ఆ సీజన్‌లో తీసుకుంటే ఆరోగ్యానికి అన్ని విధాల మేలు కలుగుతుంది. ఈ శీతాకాలంలో ముల్లంగి సమృద్ధిగా లభించే ఒక దుంప కూరగాయ. దీనిని కూరగా వండుకోవచ్చు, సలాడ్, చట్నీ, ఊరగాయ, కోఫ్తా, జ్యూస్ లాగా కూడా తయారు చేసుకోవచ్చు. ఎలా కావాలంటే అలా అనేక రూపాల్లో, అనేక మార్గాల్లో ముల్లంగిని ఆహారంగా తీసుకోవచ్చు. ముల్లంగి కూరను జొన్నరొట్టెతో తింటే ముర్గ్ ముసల్లంకు మించిన రుచి ఉంటుంది.

ముల్లంగి ఈ శీతాకాలంలో శరీరానికి అత్యంత అవసరమైన సూపర్‌ఫుడ్. దీనిని తినడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది మీ రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. మీ శరీరం నుంచి విషపదార్థాలను తొలగిస్తుంది. ముల్లంగిని దాని ఆకులతో పాటుగా వండుకు తినాలి, ఈ ఆకుల్లో విటమిన్ సి, విటమిన్ B6, మెగ్నీషియం, భాస్వరం, ఇనుము, కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

అలాగే ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి, కాబట్టి బరువు నియంత్రణలో ఉంటుంది. అలాగే ముల్లంగి తింటే అది జీర్ణక్రియకు సహాయపడుతుంది, జీవక్రియను మెరుగుపరుస్తుంది.

Radish Health Benefits- ముల్లంగి ఆరోగ్య ప్రయోజనాలు

పోషకాహార నిపుణురాలు లోవ్‌నీత్ బాత్రా ముల్లంగి తింటే కలిగే కొన్ని అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను గురించి వివరించింది. అవేంటో మనమూ తెలుసుకుందాం.

క్యాన్సర్ నిరోధక లక్షణాలు:

ఒక అధ్యయనం ప్రకారం, క్రూసిఫరస్ కూరగాయలలో కొన్ని సమ్మేళనాలు ఉంటాయి, ఇవి నీటితో కలిపినప్పుడు ఐసోథియోసైనేట్‌లుగా విభజన చెందుతాయి. ఈ ఐసోథియోసైనేట్‌లు క్యాన్సర్‌కు కారణమయ్యే పదార్థాల నుంచి శరీరాన్ని ప్రక్షాళన చేయడంలో సహాయపడతాయి, తద్వారా క్యాన్సర్ కణితి అభివృద్ధిని నిరోధిస్తాయి. ముల్లంగి కూడా క్రూసిఫెరస్ కూరగాయల విభాగంలోకి వస్తుంది. దీనిని తినడం వలన అది క్యాన్సర్‌ను నిరోధించడంలో సహాయపడుతుంది.

మధుమేహాన్ని నియంత్రిస్తుంది:

ముల్లంగిలోని శక్తివంతమైన యాంటీ-డయాబెటిక్ లక్షణాలు రోగనిరోధక ప్రతిస్పందనను ప్రేరేపిస్తాయి, గ్లూకోజ్ తీసుకోవడం పెంచుతాయి, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. అడిపోనెక్టిన్ అనేది రక్తంలో గ్లూకోజ్ స్థాయిల హెచ్చుతగ్గులకు కారకమయ్యే హార్మోన్. ముల్లంగిలో అడిపోనెక్టిన్‌ను నియంత్రించే బయోయాక్టివ్ సమ్మేళనాలు ఉంటాయి, అవి గ్లూకోజ్ హోమియోస్టాసిస్‌ను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

జీర్ణవ్యవస్థకు గొప్పది:

ముల్లంగి కరిగే, కరగని ఫైబర్‌ల కలయికను అందిస్తుంది. కాబట్టి ముల్లంగి తింటే అది మీ GI ట్రాక్ట్‌కు చాలా సహాయకరమైనది. ఈ రకమైన ఫైబర్ మలాన్ని వృద్ది చేసి, ఆ వ్యర్థాన్ని ప్రేగుల ద్వారా వ్యర్థాలను తరలించడంలో సహాయపడుతుంది. తద్వారా మలబద్ధకం సమస్య తీరిపోతుంది.

యాంటీహైపెర్టెన్సివ్ ఎఫెక్ట్స్:

ముల్లంగిలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది, ఇది రక్తపోటు స్థాయిలను నియంత్రించడంలో, గుండె సక్రమంగా పని చేయడంలో పాత్ర వహిస్తుంది. ఇంకా ముల్లంగిలో ఉండే ఆంథోసైనిన్స్ అనే సమ్మేళనాలు రక్త ప్రసరణను మెరుగుపరిచి, రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి.

ఇన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి, ముల్లంగిని తప్పకుండా తినండి, ఉల్లాసంగా ఉండండి.

సంబంధిత కథనం