Meat Quality | నాణ్యమైన మాంసంను ఎలా గుర్తించవచ్చు? మటన్ కొనేటపుడు ఇవి ముఖ్యం!
మాంసం నాణ్యమైనదేనా కాదా? ఎలా తెలుసుకోవచ్చు? మాంసం కొనేటపుడు ఈ 5 అంశాలను పరిగణలోకి తీసుకోండి.
ఆదివారం రాగానే మాంసం తినాలనే కోరిక మాంసాహార ప్రియులకు కలుగుతుంది. మాంసం ధర ఎంత ఉన్నా సరే చెల్లించి కోరికోరి కూర తెచ్చుకుని వండుకుంటారు. అయితే మనం తినే మాంసం నాణ్యమైనదేనా? ఈరోజుల్లో మాంసం ధర పెరుగుతూపోతుంది, అలాగే కల్తీ కూడా ఎక్కువైపోతుంది. ముఖ్యంగా మేక లేదా పొట్టేలు మాంసంలో ఈ కల్తీ ఎక్కువగా జరుగుతుంది. మరి ఎంతో ఖర్చు చేసి మాంసం కొనుగోలు చేస్తున్నపుడు దాని నాణ్యత విషయంలో రాజీ పడవద్దు. కల్తీ మాంసంతో ఆరోగ్యపరంగానూ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
కాబట్టి మాంసం కొనేటపుడు దాని నాణ్యతను ఎలా గుర్తించాలో తెలుసుకునేందుకు కొన్ని అంశాలు పరిశీలించాలి. అవేంటో ఇక్కడ అందజేస్తున్నాం, తెలుసుకోండి.
మాంసం రంగు
రంగును బట్టి మాంసం ఎలాంటిదో చెప్పేయవచ్చు. సాధారణంగా నాణ్యమైన మటన్ ముదురు ఎరుపు రంగులో ఉండాలి. ఎరుపులో కొద్దిగా ఊదా, గోధుమ రంగు కూడా చేరవచ్చు. సాధారణంగా గాలికి ఉంచినపుడు ఎరుపు మాంసం కొద్దిగా గోధుమ రంగులో మారుతుంది. ఏదేమైనా ఇలాంటి మాంసం తినడానికి సురక్షితమే అని గమనించాలి. ఇలా కాకుండా రంగు మరోలా ఉంటే ఆలోచించాలి.
వాసన
రంగు ద్వారా తెలియనపుడు వాసన గమనించాలి. మాంసం తాజా వాసన వస్తుందా? అప్పుడు నాణ్యమైనది అని అర్థం చేసుకోవచ్చు.తాజా మాంసం వాసన రాకపోతే లేదా వాసన తక్కువ వచ్చినా అది రీఫ్రిజరేటర్లో నిల్వ చేసిన మాంసం అని అర్థం చేసుకోవాలి. అలా కాకుండా వాసన ఘాటుగా వస్తే అది కల్తీ మాంసం అని గుర్తించాలి. అలాగే మాంసం నుంచి చెడు వాసన వస్తే అది కుళ్లిపోయినట్లు. అలాంటి మాంసానికి దూరంగా ఉండటమే శ్రేయస్కరం.
ముక్కలు కొట్టే తీరు
మాంసం విక్రయదారుడు ముక్కలను కొట్టే విధానం చూసి కూడా అది నాణ్యమైనదా.. కాదా? అనేది సులభంగా గుర్తించవచ్చు. ముక్కలు మృదువుగా, తేలికగా కొట్టగలిగితే అది నాణ్యమైనదని అర్థం. నాణ్యతలేని ముక్కలను కొట్టేటపుడు అవి సరైన రీతిలో కట్ అవ్వవు, ఎముక నుంచి మాంసాన్ని తీస్తున్నపుడు సాగినట్లుగా ఉంటుంది. ఎముకకు దృఢంగా అతుక్కోగలిగిన మాంసం నాణ్యమైనది అని ఇక్కడ గమనించాలి.
మాంసం స్వభావం
మాంసం చారలుచారలుగా, జిగట జిగటగా ఉంటే సరైన రీతిలో నిల్వచేయలేదని అర్థం. తడిగా ఉండటం కోసం నీరు ఎక్కువగా చల్లుతుంటారు. దీనివల్ల మాంసం బరువు పెరుగుతుంది. దీంతో మీకు లభించే దానికంటే తక్కువగా లభిస్తుంది. కాబట్టి ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలి.
మాంసం ఆకృతిని పరిశీలించాలి
మాంసంను నిశితంగా పరిశీలిస్తే అది దృఢంగా ఉందా, మృధువుగా ఉందా లేక పీచులాగా ఉందా అనేది మీకు అర్థమవుతుంది. మాంసం కండరాలతో దృఢంగా ఉంటే అది మంచిది. అయితే కొన్నిసార్లు లేత మాంసం మృధువుగా ఉంటుంది. కొవ్వు ఎక్కువగా ఉంటే పీచులాగా ఉంటుంది. కొన్ని చోట్ల దృఢంగా, కొన్ని చోట్ల లేతగా ఉండకూడదు. నాణ్యమైన మాంసం ఏకరీతిగా ఒకేలా ఉండాలి. మీకు ఎలాంటి మాంసం ఇష్టమో, ఆ ప్రకారంగా అడగాలి.
ఇక చివరగా, మాంసం కొనేటపుడు మీకు కావాల్సిన రీతిలో ముక్కలు కొట్టమని విక్రయదారుడ్ని కోరాలి. అయితే మాంసం ఆకృతి, దృఢత్వాన్ని బట్టి వండే విధానంలోనూ మార్పులు ఉంటాయి. కాబట్టి ఎంత సేపు ఉడికించాలి, ఎలాంటి మంట మీద ఉడికించాలి అనేది మాంసం విక్రయదారుడిని అడగవచ్చు. ఇలా చేస్తే మాంసం నాణ్యత, వండే విధానంపై మీకు ఒక అంచనా వస్తుంది.
సంబంధిత కథనం