Ayurveda Tips for Digestion । తిన్నది అరగకపోతే ఈ ఆయుర్వేద చిట్కాలు పాటించండి!
Ayurveda Tips for Digestion: తిన్నది అరగకపోతే ఎంత మంచి ఆహారం తిన్నప్పటికీ ప్రయోజనం ఉండదు. అయితే ఆహారం సులభంగా జీర్ణం అయ్యేందుకు ఆయుర్వేదంలో అద్భుతమైన చిట్కాలు ఉన్నాయి, అవి ఇక్కడ తెలుసుకోండి.
ఆరోగ్యంగా ఉండేందుకు అన్ని రకాల పోషకాహారం తీసుకోవడం ముఖ్యమే. కానీ జీర్ణక్రియ మెరుగ్గా జరగకపోతే, తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం అవదు, మన శరీరం పోషకాలను గ్రహించదు. అటువంటపుడు తిన్నదంతా అలాగే కడుపులో ఉండిపోయి వివిధ రకాల అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది.
ముఖ్యంగా పేలవమైన జీర్ణక్రియ కారణంగా చర్మ సమస్యలు, జుట్టు రాలడం, ఆటో ఇమ్యూన్ వ్యాధులు, ఊబకాయం, ఆందోళన, ఒత్తిడి డిప్రెషన్ వంటి అనేక వ్యాధులకు దారి తీస్తుంది. ఇటీవల కాలంలో చాలా మంది ఎసిడిటీ, కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలతో బాధపడుతూ ఉండవచ్చు. తిన్నది అరగక పోతే ఇలా జరుగుతుంది. కాబట్టి మీరు ఆరోగ్యంగా ఉండాలంటే, ముందు మీ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుకోవాలి.
పటిష్టమైన జీర్ణవ్యవస్థను కలిగి ఉండేందుకు ఆయుర్వేదంలో కొన్ని చిట్కాలు ఉన్నాయి. ఆయుర్వేదం ప్రకారం, భోజనంలో ఆరు రుచులను మితంగా చేర్చుకోవాలి, భోజనాల మధ్య హెర్బల్ టీలు తీసుకోవాలి అలాగే మీ నిద్రవేళకు, రాత్రి భోజనంకు మధ్య సరైన వ్యవధి కలిగి ఉండాలి. తిన్నది అరగటానికి ఆయుర్వేద నిపుణురాలు డాక్టర్ దీక్షా భావ్సర్ కొన్ని చిట్కాలు సూచించారు. అవేంటో ఈ కింద చూడండి.
Ayurveda Tips for Digestion- తిన్నది అరగటానికి ఆయుర్వేద చిట్కాలు
డా. దీక్ష, ఆయుర్వేద నిపుణురాలు సూచించిన ప్రకారం ఈ కింది చిట్కాలు పాటిస్తే మీ జీర్ణవ్యవస్థను మెరుగుపరుచుకోవచ్చు.
1. షడ్రుచుల భోజనం
ఆయుర్వేదం ప్రకారం, మీరు తినే ప్రతీ భోజనం తీపి, పులుపు, లవణం, ఘాటు, చేదు, వగరు వంటి 6 రుచులను కలిగి ఉండాలి. ఇలా వైవిధ్యమైన రుచులు కలిగిన ఆహారంను శరీరం సులభంగా జీర్ణం చేయగలదు. చిటికెడు ఉప్పు, నిమ్మకాయ, లేదా మిరియాలను కలిపి వివిధ రకాల రుచులను సృష్టించవచ్చు.
2. భోజన విరామాలలో హెర్బల్ టీలు
జీర్ణ అగ్నిని పలుచన కాకుండా భోజనానికి, భోజనానికి మధ్య హెర్బల్ టీలు తాగాలి. కొత్తిమీర టీ, జీలకర్ర టీ, ఫెన్నెల్ టీ వంటి CCF టీ వంటి టీలు తాగడం వల్ల అవి జీర్ణక్రియ మంటను రేకెత్తిస్తాయి, చిరుతిండి తినాలనే కోరికలను అరికడతాయి, శరీరం నుండి మలినాలను తొలగిస్తాయి.
3. లంచ్‌టైమ్‌లో ఎక్కువ తినండి
సూర్యుడు ఉన్నప్పుడు జీర్ణ అగ్ని బలంగా ఉంటుంది. అందుకే రోజులోని అతి పెద్ద భోజనాన్ని మధ్యాహ్న సమయంలో తీసుకోవాలని ఆయుర్వేదం చెబుతుంది. ఈ సమయంలో ఎక్కువ తిన్నా కూడా సులభంగా జీర్ణం అవుతుంది.
4. రాత్రిభోజన సమయం
నిద్రవేళకు 3 గంటల ముందే రాత్రి భోజనం తినడం పూర్తవ్వాలి. నిద్రలో ఉన్నప్పుడు శరీరం ఇతర మరమ్మత్తులు చేసుకుంటుంది. మానసిక ఒత్తిళ్లు, ఆలోచనలు, భావోద్వేగాలను జీర్ణం చేసి విశ్రాంతిని కల్పిస్తుంది. ఈ సమయంలో భోజనం అంటే, శరీర వ్యవస్థ డైవర్ట్ అవుతుంది. అందుకే జీర్ణసమస్యలతో పాటు నిద్రలేమి, మానసిక ఒత్తిళ్లు తలెత్తేది.
ఈ చిట్కాలు పాటిస్తే తిన్నది అరుగుతుంది. తినే ఆహారం మాత్రమే కాకుండా, ఎలా తింటారు అనే దానిపైనే మీ ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది అని డాక్టర్ దీక్ష భావ్‌సర్ తెలిపారు.