Brown Rice Recipes । ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండేందుకు బ్రౌన్ రైస్‌తో ఖిచ్డీ, పులావు ఇలా చేసుకోండి!
Brown Rice Recipes: తెల్ల బియ్యంతో కాకుండా బ్రౌన్ రైస్ తో కూడా బిర్యానీ, పులావు, ఖిచ్డీ, ఫ్రైడ్ రైస్ వంటివి చేసుకోవచ్చు. బ్రౌన్ రైస్ ఖిచ్డీ రెసిపీ ఇక్కడ ఉంది చూడండి.
Brown Rice Recipes: మన ఆరోగ్యం అనేది మనం ఎంచుకునే ఆహారపు అలవాట్లు, మన జీవనశైలి నిర్ణయిస్తుంది. ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండాలంటే ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, ఇతర అన్ని పోషకాలు నిండి ఉండే సమతుల్య ఆహారాన్ని తీసుకోవాలి. అయితే మనం బిర్యానీ, పులావ్, ఫ్రైడ్ రైస్ అంటూ అన్నంతో తయారు చేసే నూరూరించే వంటకాలనే ఎక్కువ తినేందుకు ఇష్టపడతాం. సాధారణంగా తెల్లబియ్యంతో వండే వాటిలో కార్బోహైడ్రేట్లు ఎక్కువ ఉంటాయి, ఇతర పోషకాలు తక్కువ ఉంటాయి. బరువు తగ్గాలనే ప్రయత్నంలో ఉన్నవారు తెల్లబియ్యంతో చేసే ఇలాంటి వంటకాలు తినడం వలన ఎలాంటి ప్రయోజనం ఉండదు. దీంతో చాలా మంది అన్నం తినకుండా ఉంటారు. కానీ అన్నం తినడం మానేసినా అది కూడా మంచిది కాదు. బదులుగా మీరు తెల్లబియ్యంకు బదులుగా క్వినోవా, మిల్లెట్లు, బ్రౌన్ రైస్‌తో కూడా మీకు నచ్చిన వంటకాలు చేసుకోవచ్చు.
తెల్ల బియ్యంతో పోలిస్తే , బ్రౌన్ రైస్‌లో పీచు అధికంగా ఉంటుంది. ఇది తేలికైన ఆహారంగా ఉంటుంది. మీరు బ్రౌన్ రైస్‌తో కూడా బిర్యానీ, పులావ్, ఖిచ్డీ, ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చు. ముఖ్యంగా బ్రౌన్ రైస్‌తో ఖిచ్డీ ఎలా చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి. బ్రౌన్ రైస్ ఖిచ్డీ రెసిపీని ఈ కింద చూడండి.
Brown Rice Khichdi Recipe కోసం కావలసినవి
- 1/2 కప్పు బ్రౌన్ రైస్
- 1 కప్పు పెసరిపప్పు
- 1 ఉల్లిపాయ
- 2 టేబుల్ స్పూన్లు నెయ్యి
- 1 టీస్పూన్ జీలకర్ర
- 1 టేబుల్ స్పూన్ అల్లం-పచ్చిమిర్చి పేస్ట్
- చిటికెడు ఇంగువ
- 1/2 చెంచా పసుపు పొడి
- 3 లవంగాలు
- తాజా కొత్తిమీర
- రుచికి తగినంత ఉప్పు
బ్రౌన్ రైస్‌తో ఖిచ్డీ తయారీ విధానం
- ముందుగా బ్రౌన్ రైస్‌ను, పెసరిపప్పును కడిగి, ఒక అరగంట పాటు నీటిలో నానబెట్టండి.
- ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ లో నెయ్యి వేడి చేసి, జీలకర్ర వేసి వేయించండి, ఆపై ఇంగువ, అల్లం-పచ్చిమిర్చి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించండి.
- ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, మిగతా సుగంధ దినుసులు వేసి వేయించండి.
- ఆపై బ్రౌన్ రైస్, పెసరిపప్పు వేసి, సరిపడా నీళ్లుపోసి, తగినంత ఉప్పు, కొత్తిమీర వేసి బాగా కలపండి.
- చివరగా ప్రెషర్ కుక్కర్ మూత పెట్టి రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి.
అంతే, మూత తీసి చూస్తే బ్రౌన్ రైస్‌తో ఖిచ్డీ రెడీ.
బ్రౌన్ రైస్ పులావ్ రెసిపీ
మీకు ఖిచ్డీ ఇష్టం లేకపోతే ఇదే విధానంలో పులావు కూడా వండుకోవచ్చు. అయితే పులావ్ చేసేటపుడు పెసరిపప్పుకు బదులుగా మీకు నచ్చిన కూరగాయలు క్యారెట్, కాలీఫ్లవర్, ఆలుగడ్డలు, బీన్స్ వంటివి ఉపయోగించాలి. కుక్కర్ లో నూనె వేడిచేసి జీలకర్ర, బిర్యానీ ఆకు, యాలకులు, దాల్చిన చెక్క, ఎండుమిర్చి, లవంగాలు, ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసి వేయించాలి. ఆపైన కూరగాయలు, ఉప్పు, కారం, పసుపు వేసి కలపాలి. అనంతరం నీళ్లు పోసి, నానబెట్టిన బ్రౌన్ రైస్ వేసి మూతపెట్టి ఉడికిస్తే పులావు సిద్ధం అవుతుంది.
సంబంధిత కథనం