Rishabh Pant: రెండు నెలల పాటు బ్రష్ కూడా చేసుకోలేకపోయాను: రిషబ్ పంత్ హారర్ స్టోరీ-rishabh pant recalls his struggles with life threatening car accident injuries ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Rishabh Pant: రెండు నెలల పాటు బ్రష్ కూడా చేసుకోలేకపోయాను: రిషబ్ పంత్ హారర్ స్టోరీ

Rishabh Pant: రెండు నెలల పాటు బ్రష్ కూడా చేసుకోలేకపోయాను: రిషబ్ పంత్ హారర్ స్టోరీ

Hari Prasad S HT Telugu
May 28, 2024 03:43 PM IST

Rishabh Pant: టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ తాను యాక్సిడెంట్ తర్వాత గాయాలతో ఎదుర్కొన్న బాధల గురించి వివరించాడు. ఈ మధ్యే శిఖర్ ధావన్ ప్రోగ్రామ్ ధవన్ కరేంగేలో అతడు మాట్లాడాడు.

రెండు నెలల పాటు బ్రష్ కూడా చేసుకోలేకపోయాను: రిషబ్ పంత్ హారర్ స్టోరీ
రెండు నెలల పాటు బ్రష్ కూడా చేసుకోలేకపోయాను: రిషబ్ పంత్ హారర్ స్టోరీ (PTI)

Rishabh Pant: రిషబ్ పంత్ ఇండియన్ క్రికెట్ లోనే కాదు.. మొత్తం స్పోర్ట్స్ చరిత్రలోనే నిలిచిపోతాడు. కారు ప్రమాదంలో మరణం అంచుల వరకూ వెళ్లి వచ్చిన అతడు.. మళ్లీ క్రికెట్ ఫీల్డ్ లో అడుగు పెట్టి ఐపీఎల్ ఆడటమే కాదు.. ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ కు కూడా సిద్ధమవుతున్నాడు. అయితే ఈ రికవరీ అంత సులువుగా జరిగిందేమీ కాదు. తాను చాలానే శ్రమించినట్లు పంత్ చెబుతున్నాడు.

బ్రష్ కూడా చేసుకోలేని పరిస్థితి

టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ ఈ మధ్యే ఓ టాక్ షో ప్రారంభించాడు. దీని పేరు ధవన్ కరేంగే. జియో సినిమాలో ఈ షో వస్తోంది. ఇందులో తాజాగా రిషబ్ పంత్ కూడా పాల్గొన్నాడు. ఈ ప్రోగ్రామ్ లో పంత్ తనకు జరిగిన కారు ప్రమాదం గురించి వెల్లడించాడు. తీవ్ర గాయాలతో 15 నెలలపాటు పోరాడి తిరిగి ఐపీఎల్ ద్వారా కాంపిటీటివ్ క్రికెట్ లో అడుగుపెట్టాడు.

ధావన్ తో పంత్ మాట్లాడుతూ.. ఆ యాక్సిడెంట్ తర్వాత తాను ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నాడో వివరించాడు. "గాయాల నుంచి కోలుకోవాలంటే ఆత్మవిశ్వాసం, నమ్మకం చాలా ముఖ్యం. ఎందుకంటే మీ చుట్టూ ఏదో ఒకటి అంటూనే ఉండేవాళ్లు ఉంటారు. కానీ మనకు ఏది మంచిదో అదే ఆలోచించాలి. ఆ ప్రమాదం నా జీవితాన్నే మార్చేసిన అనుభవం.

అది జరిగిన తర్వాత నేను అసలు బతుకుతానా లేదా కూడా తెలియని పరిస్థితి. కానీ ఆ దేవుడు దయతలచి నన్ను కాపాడాడు. రెండు నెలల వరకు నేను కనీసం బ్రష్ కూడా చేసుకోలేకపోయాను. ఆరేడు నెలల వరకు తీవ్రమైన నొప్పితో బాధపడ్డాను. వీల్ చెయిర్ లో ఎవరూ నన్ను చూడొద్దని నేను ఎయిర్ పోర్టుకు కూడా వెళ్లలేదు" అని పంత్ చెప్పాడు.

చాలా ఉత్సాహంగా ఉన్నాను

"ఇక ఇప్పుడు క్రికెట్ లోకి తిరిగి వస్తున్న వేళ ఒత్తిడి కంటే ఉత్సాహమే ఎక్కువగా ఉంది. ఇది నాకు రెండో జీవితంలాంటిది. అందుకే ఉత్సాహం ఉంది అదే సమయంలో కాస్త భయంగానూ ఉంది" అని పంత్ అన్నాడు. ఇక తన జీవితంలో తన తల్లి తీవ్ర ఆగ్రహానికి గురైన ఒక సందర్భాన్ని కూడా రిషబ్ పంత్ గుర్తు చేసుకున్నాడు. తాను ఐదో తరగతిలో ఉన్నప్పుడు అది జరిగినట్లు చెప్పాడు.

"నేను ఓ క్రికెటర్ కావాలన్నది మా నాన్న కల. నేను దానిని నెరవేర్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నేను ఐదో తరగతిలో ఉన్నప్పుడు నేనో క్రికెటర్ కావాలని నిర్ణయించుకున్నాను. అప్పుడు మా నాన్న నాకు రూ.14 వేల విలువైన బ్యాట్ గిఫ్ట్ గా ఇచ్చాడు. అది చూసి మా అమ్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది" అని పంత్ వెల్లడించాడు.

డిసెంబర్ 30, 2022లో కారు ప్రమాదానికి గురైన రిషబ్ పంత్.. 2023 మొత్తం క్రికెట్ కు దూరంగా ఉన్నాడు. ఐపీఎల్ 2024లో మళ్లీ ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ గా తిరిగొచ్చాడు. 13 మ్యాచ్ లలో అతడు 446 రన్స్ చేయడం విశేషం. మూడు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. డీసీ టీమ్ ఆరో స్థానంలో నిలిచింది. ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ జట్టులోకి కూడా సెలెక్టర్లు అతన్ని ఎంపిక చేశారు.

Whats_app_banner