CM YS Jagan : ముగిసిన విదేశీ పర్యటన - ఏపీకి చేరుకున్న సీఎం జగన్, పొలిటికల్ యాక్షన్ షురూ!-cm jagan has reached ap after completing his london tour ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Cm Ys Jagan : ముగిసిన విదేశీ పర్యటన - ఏపీకి చేరుకున్న సీఎం జగన్, పొలిటికల్ యాక్షన్ షురూ!

CM YS Jagan : ముగిసిన విదేశీ పర్యటన - ఏపీకి చేరుకున్న సీఎం జగన్, పొలిటికల్ యాక్షన్ షురూ!

Maheshwaram Mahendra Chary HT Telugu
Jun 01, 2024 08:49 AM IST

AP CM YS Jagan : విదేశీ పర్యటనను పూర్తి చేసుకున్న సీఎం జగన్ శనివారం ఉదయం విజయవాడకు చేరుకున్నారు. ఆయనకు వైసీపీ నేతలు స్వాగతం పలికారు.

ఏపీకి చేరుకున్న సీఎం జగన్
ఏపీకి చేరుకున్న సీఎం జగన్ ( Image Source From @AndhraFactCheck)

CM YS Jagan News : ఏపీ సీఎం జగన్ విదేశీ పర్యటన ముగిసింది. ఈ నెల 28వ తేదీన లండన్ కు వెళ్లిన ఆయన…. ఇవాళ ఉదయం తిరిగి విజయవాడకు చేరుకున్నారు. విదేశీ పర్యటనకు వెళ్లి వచ్చిన జగన్ కు వైసీపీ నేతలు ఘన స్వాగతం పలికారు.

yearly horoscope entry point

గన్నవరం విమానాశ్రయంలో  సీఎం జగన్ కు  మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు స్వాగతం పలికారు. అనంతరం విమానాశ్రయం నుంచి నేరుగా తాడేపల్లిలోని ఆయన నివాసానికి చేరుకున్నారు.

ఇక జూన్ 4వ తేదీన ఏపీ ఎన్నికల ఫలితాలు రానున్నాయి. దీంతో  కౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో పార్టీ పరంగా తీసుకోవాల్సిన చర్యలపై నేతలతో జగన్ చర్చించే అవకాశం ఉంది. పలు అంశాలపై దిశానిర్దేశం చేస్తారని తెలుస్తోంది. పోలింగ్ తర్వాత… రెస్ట్ మోడ్ లోకి వెళ్లి నేతలు కౌంటింగ్ వేళ తిరిగి యాక్టివ్ అవుతున్నారు. ఇప్పటికే పరస్పరం కౌంటర్లు, విమర్శలు చేసుకుంటున్నారు. కౌంటింగ్ కు సమయం దగ్గరపడుతున్న వేళ…. ఏపీ ఫలితాలపై మరింత ఉత్కంఠ పెరుగుతోంది.

ఇటీవలే సోషల్ మీడియాలో పోస్ట్….

ఇదిలా ఉంటే కౌంటింగ్ కు సమయం దగ్గరపడుతున్న వేళ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్ (X)లో రెండు రోజుల క్రితం ఆసక్తికరమైన ప్రకటన చేశారు. ప్రజా దీవెనలతో మళ్లీ వైసీపీ ప్రభుత్వమే ఏర్పాటు కాబోతుందని రాసుకొచ్చారు. ఐదేళ్ల క్రితం ఇదే రోజున(మే 30, 2019) వైసీపీ అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు.

“దేవుడి దయ, ప్రజలిచ్చిన చారిత్రాత్మక తీర్పుతో సరిగ్గా ఐదేళ్ల క్రితం ఇదే రోజన మన పార్టీ అధికారంలోకి వచ్చింది. కులం, మతం, ప్రాంతం, రాజకీయాలు చూడకుండా ప్రతి కుటుంబానికీ మంచి చేసింది. ప్రజలందరి దీవెనలతో మళ్లీ ఏర్పాటుకానున్న మన ప్రభుత్వం ఇదే మంచిని కొనసాగిస్తూ రాష్ట్ర సమగ్రాభివృద్ధి దిశగా మరిన్ని అడుగులు ముందుకేస్తుంది” అని వైఎస్ జగన్ తన పోస్టులో రాసుకొచ్చారు.

జూన్ 4న ఫలితాలు….

జూన్ 4న ఓట్ల లెక్కింపుకు ఏర్పాట్లు అన్నీ పూర్తి చేసినట్టు ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా ప్రకటించారు. 4వ తేదీ రాత్రి 8–9 గంటల మద్య అన్ని నియోజక వర్గాల తుది ఫలితాలను ప్రకటిస్తామని వెల్లడించారు.

రాష్ట్రంలో ఓట్ల లెక్కింపు కు నియోజక వర్గాల నుంచి వారీగా చేస్తున్న ఏర్పాట్లను సమీక్షించారు. ఓట్ల లెక్కింపుకు పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నామని, సత్వరమే ఫలితాల ప్రకటనకు చర్యలు తీసుకుంటున్నామని సీఈఓ తెలిపారు. రాష్ట్రంలోని మొత్తం 175 శాసన సభా నియోజకవర్గాల్లో 111 నియోజక వర్గాల్లో 20 రౌండ్ల లోపు, 61 నియోజకవర్గాల్లో 21 నుండి 24 రౌండ్ల లోపు ఫలితాలు వెలువడనున్నాయి.

మూడు నియోజకవర్గాల్లో 25 రౌండ్లకు పైబడి ఓట్ల లెక్కింపు కార్యక్రమం కొనసాగనుంది. 111 నియోజక వర్గాల్లో మద్యాహ్నం 2.00 గంటల్లోపు, 61 నియోజక వర్గాల్లో సాయంత్రం 4.00 గంటల్లోపు మరియు మిగిలిన 3 నియోజక వర్గాల్లో సాయంత్రం 6.00 గంటల్లోపు ఓట్ల లెక్కింపు పూర్తి అవుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు.

 

 

Whats_app_banner